ఓల్డ్​ వాల్వులు స్థానంలో స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఓల్డ్ వాల్వుల స్థానంలో స్మార్ట్​వాల్వ్​టెక్నాలజీని అమలుచేయాలని నిర్ణయించినట్టు వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా సనత్ నగర్​లో ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం సనత్​నగర్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు అధిక శాతం వాల్వులు రోడ్లపైనే ఉన్నాయన్నారు. వాటిని ఆపరేట్​చేసే టైంలో పలువురు లైన్ మెన్లు ప్రమాదానికి గురవుతున్నారని చెప్పారు. అలాంటి చోట్ల స్మార్ట్​వాల్వ్​టెక్నాలజీని అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. 

దీంతో లైన్ మెన్లు క్షేత్ర స్థాయిలో తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. మొబైల్ యాప్ తో వాల్వులను ఆపరేట్​చేయొచ్చని చెప్పారు. స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ పూర్తిగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని పనిచేస్తుందన్నారు. సనత్​నగర్​లో సక్సెస్​అయితే మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని అశోక్​రెడ్డి వెల్లడించారు. అలాగే కృష్ణా నగర్ ‘సి’బ్లాక్, అమీర్​పేట, శ్రీనగర్​కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సీవరేజీ నిర్వహణను పరిశీలించారు. సీవేజ్​ఓవర్ ఫ్లో అయ్యి సెల్లార్లలోకి వస్తున్నాయని స్థానికులు ఎండీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, డీజీఎం, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.