SparkCat: స్మార్ట్‌ఫోన్లలో కొత్త వైరస్.. ఫోటోలు, బ్యాంకు డీటైల్స్ అన్నీ దోచేస్తోంది

SparkCat: స్మార్ట్‌ఫోన్లలో కొత్త వైరస్.. ఫోటోలు, బ్యాంకు డీటైల్స్ అన్నీ దోచేస్తోంది

ఓవైపు సైబర్ దాడులు.. మరోవైపు ఈ వైరస్‌ల గోల.. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కొత్త కష్టాలు మొదలైనట్టే. స్పార్క్‌క్యాట్(SparkCat) అనే మాల్వేర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను వణికిస్తోంది. అతి వేగంగా వ్యాప్తి చెందుతూ.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వ్యక్తిగత డేటాను తస్కరిస్తోంది.

ఈ మాల్వేర్ ఇంగ్లీష్, హిందీ, చైనీస్, జపనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్ సహా మరికొన్ని భాషలను గుర్తించగలదని నివేదికలు చెప్తున్నాయి. ఆయా భాషల్లో ఉన్న యూజర్ల వ్యక్తిగత డేటాను స్పార్క్‌క్యాట్ వైరస్ స్కాన్ చేస్తుందట. అలా స్కాన్ చేసిన సమాచారమంతా.. దీన్ని సృష్టించిన హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. ఇప్పటివరకు 18 Android యాప్‌లు, 10 iOS యాప్‌లలో ఈ మాల్వేర్ ఉన్నట్లు తేలింది. ఆ యాప్‌లలో ఒకటి ChatAi. 

ALSO READ | ఫిబ్రవరి 8న ఈ బ్యాంకు యూపీఐ సర్వీసులు బంద్..Phonepe,Gpay పనిచేయదు

మీ ఫోన్లలో ChatAi యాప్ లేదా మరే ఇతర అనుమానాస్పద యాప్‌లు ఉండి ఉంటే, వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఒక్కసారి మీ వ్యక్తిగత డేటా ముష్కరుల చేతుల్లోకి వెళ్లిందంటే.. సోషల్ మీడియాలో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ లక్షణాలుంటే.. జాగ్రత్త..!

  • వైరస్ అటాక్ చేస్తే.. స్మార్ట్ ఫోన్ పనితీరు తగ్గిపోతుంది. 
  • అనుమతి లేకుండా కొత్త యాప్స్ డౌన్‌లోడ్ అవుతుంటే అనుమానించాల్సిందే.
  • గుర్తు తెలియని టెక్స్ట్ సందేశాలు రావడం, మీ అనుమతి లేకుండా మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మెసేజులు వెల్లడం, పర్మిషన్ లేకుండా యాప్స్ కొనుగోలు వంటివి జరిగితే జాగ్రత్త పడాల్సిందే.
  • పదే పదే ఒకే రకమైన యాడ్స్ డిస్‌ప్లే అవ్వడం కూడా కారణాల్లో ఒకటిగా చెప్తున్నారు. 

మీ స్మార్ట్‌ఫోన్‌ను రక్షించుకోండిలా..!

  • తెలియని యాప్‌లు డౌన్‌లోడ్ చేయకండి. ఇటీవల కాలంలో Amazon prime, Aha, Netflix వంటి ఓటీటీ యాప్‌లు కొనుగోలు చేయడానికి ఇష్టపడక.. చాలా మంది apk ఫైల్స్ వాడుతున్నారు. ఇవి అంత్యంత ప్రమాదకరం. 
  • యాప్ అనుమతులను ఒకటికి రెండుసార్లు చదవండి. ఏదేని యాప్ డౌన్ లోడ్ చేసి.. ఇన్స్టాల్ చేసే సమయంలో కాంటాక్ట్స్, కెమెరా, లొకేషన్, వంటి అనవసరమైన యాక్సెస్ అడిగితే, దానిని నివారించండి.
  • సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌.. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండండి. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ వస్తుంటాయి. అవి సహాయపడతాయి.
  • యాంటీవైరస్‌.. నమ్మకమైన యాంటీవైరస్‌లు మాల్వేర్ బెడదను కొంతమేర నిరోధించగలవు.
  • క్రిప్టో వాలెట్, క్రిప్టో కరెన్సీ.. ఇటువంటి పదాలకు చెందిన యాప్‌లు అప్రమత్తత చాలా అవసరం. క్రిప్టో కరెన్సీ స్క్రీన్‌షాట్లు వంటివి మీ మొబైళ్లలో ఉంచకండి.