న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ క్వార్టర్లో మనదేశ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు వార్షికంగా రెండు శాతం పడిపోయాయి. ఎండలు ఎక్కువగా ఉండటం, తక్కువ గిరాకీ ఇందుకు కారణమని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ వెల్లడించింది. దీని రిపోర్ట్ ప్రకారం, వాల్యూమ్ షేర్‌లో షావోమీ తిరిగి మొదటిస్థానాన్ని దక్కించుకుంది. విలువ పరంగా శామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచింది.
5జీ స్మార్ట్‌ఫోన్‌లు మొత్తం షిప్‌మెంట్‌లలో 77 శాతం ఉన్నాయి. జనం ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్‌ల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడంతో స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ తగ్గింది. ఈ క్వార్టర్ షావోమీ 23 శాతం వార్షిక వృద్ధి సాధించింది. షిప్‌మెంట్‌లలో దీని వాటా 18.9 శాతం, వివో వాటా 18.8 శాతం ఉంది. శామ్‌సంగ్ 25 శాతం వాటాతో విలువ పరంగా మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. తరువాత వివో, ఆపిల్ ఉన్నాయి.