
టారిఫ్ లతో ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఎస్ కస్టమ్స్, బోర్డరర్ ప్రొటెక్షన్ విభాగం పోస్ట్ చేసింది. రెసిప్రోకల్ టారిఫ్స్ తో అమెరికా ప్రజలపై పడే భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ మినహాయింపులో ఉన్నాయి.
అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తులపై ఇటీవలే 145 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చైనాలో తయారయ్యే యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్స్, కంప్యూటర్స్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ విభాగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. వెడ్ బష్ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 90 శాతం యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తి, అసెంబ్లింగ్ చైనా నుంచే జరుగుతోంది.
ఈ నిర్ణయంతో అమెరికా టెక్ కంపెనీలైన యాపిల్, ఎన్ విడియా, మైక్రోసాఫ్ట్ తో పాటు ఇతర టెక్ కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఎక్కువగా చైనా నుంచే ఈ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. అంతకు ముందే కొన్ని ఉత్పత్తులు, దిగుమతులపై టారిఫ్ ల ఉపశమనం ఉంటుందని ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత ట్రంప్ అధికార యంత్రాంగం ఎలక్ట్రానిక్ వస్తువులను సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.