అరగంటలోనే ఫోన్ బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అయితే ఎలా ఉంటుంది! ఇప్పటివరకు వచ్చిన ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లేవి కూడా ఇలా 30 నిమిషాల్లోపే ఫుల్ చార్జింగ్ కాలేదు.
మరి ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు కాకపోయినా, వచ్చే రెండేళ్లలో సాధ్యమే అంటోంది సామ్సంగ్. ఎందుకంటే ఈ సంస్థ త్వరలో గ్రాఫీన్ బ్యాటరీలతో ఫోన్లు తయారుచేయబోతుంది. 2020 లేదా 2021కల్లా ఈ ఫోన్లు మార్కెట్లో ఉంటాయని అంచనా. గ్రాఫీన్ బ్యాటరీ ఫోన్లు అందుబాటులోకి వస్తే ఒక సంచలనమే.
ప్రస్తుతం వాడుతున్న ఫోన్లన్నీ ‘లిథియమ్– అయాన్’ బ్యాటరీతో తయారైనవే. వీటి కెపాసిటీ ఎక్కువే అయినా దీనికి కొన్ని పరిమితులున్నాయి. ఇవి ఎక్కువగా చార్జింగ్ చేస్తుంటే త్వరగా వేడెక్కుతాయి. పైగా చార్జింగ్ అవడానికి చాలా సమయం పడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వాడినా అది పరిమితమే. కొంతకాలం వాడితే బ్యాటరీ పాడవుతుంది. దీంతో కొత్త బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే దీనికంటే మెరుగైన బ్యాటరీ రూపొందించేందుకు చాలా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
అన్నింటికంటే ముందుగా సామ్సంగ్ సంస్థ గ్రాఫీన్ బ్యాటరీ తయారుచేసే పనిలో ఉంది.
గ్రాఫీనే ఎందుకు?
మిగతా లోహాలతో పోలిస్తే గ్రాఫీన్ చాలా ప్రత్యేకమైంది. ఇది ఒకే లేయర్ కర్బన అణువులతో తయారై, టు–డైమెన్షనల్‌గా ఉంటుంది. ఈ నానోమెటీరియల్ చాలా కఠినమైంది అయినప్పటికీ, కావాల్సినట్లుగా మారగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉంది. స్టీల్, డైమండ్ల కంటే చాలా గట్టిగా ఉంటుంది. హై థర్మల్, ఎలక్ట్రికల్ కండక్టివిటీగా పని చేస్తుంది. అందువల్ల ఎలక్ట్రానిక్ రంగంలో దీని వినియోగం పెరుగుతోంది. సిలికాన్ వంటి పదార్థాలకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని చాలా మంది సైంటిస్టుల అభిప్రాయం.
గ్రాఫీన్ బ్యాటరీ తయారి
‘గ్రాఫినానో’ అనే సంస్థ గ్రాఫీన్పై ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ గ్రాఫీన్ బ్యాటరీలు తయారు చేసింది. వీటిని ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో వాడుతున్నారు.
గ్రాఫీన్ బ్యాటరీలను ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. పైగా ఇవి నిమిషాల వ్యవధిలోనే చార్జ్ అవుతాయి. ‘లిథియమ్ అయాన్’ బ్యాటరీతోపోలిస్తే 33 రెట్లు వేగంగా చార్జ్ అవుతుంది. అందుకే గ్రాఫీన్ బ్యాటరీ తయారు చేస్తున్నట్లు సామ్సంగ్ 2017లోనే ప్రకటించింది. అప్పట్లో గ్రాఫీన్ బాల్‌ను ఈ సంస్థ తయారు చేసింది. దీన్ని పన్నెండు నిమిషాల్లోనే ఫుల్‌చార్జ్ చేసింది.