- మెదక్ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద ఎస్‌ఎంసీ చైర్మన్ల నిరసన
- బయటే నిల్చున్న స్టూడెంట్స్, టీచర్స్
మెదక్‌టౌన్, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు -మన బడి’ పథకం కింద చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడాన్ని నిరసిస్తూ పనులు చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్లు మంగళవారం మెదక్ పట్టణంలోని గర్ల్స్హైస్కూల్ గేటుకు తాళం వేశారు. దీంతో స్కూల్‌కు వచ్చిన స్టూడెంట్స్, టీచర్లు బయటే నిల్చుండిపోయారు. ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ చైర్మన్లు దశరథం, శంకర్, లక్ష్మణ్ మాట్లాడుతూ రూ. లక్షలు ఖర్చు చేసి వివిధ పనులు చేశామని, రెండేండ్లు అవుతున్నా ఇప్పటివరకు బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఈవో ఆఫీస్‌కు, హైదరాబాద్‌లోని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అప్పులు చేసి పనులు చేశామని, బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పెండింగ్స్ బిల్స్ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈవో నీలకంఠం స్కూల్ వద్దకు చేరుకొని ఎస్‌ఎంసీ చైర్మన్లతో మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.