కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ కుంగుబాటుపై జ్యూడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. డిసెంబర్ 19న కమిషన్ ముందు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ విచారణకు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రాష్ట్ర సీఎస్ గా సోమేష్ కుమార్ ఉండగా..సీఎంలో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే వీరిని కమిషన్ విచారిస్తోంది. డిసెంబర్ 20న కోదండరాం, వెదిరె శ్రీరామ్ ఓపెన్‌కోర్టుకు వస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
డిసెంబర్ 18న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ నిర్వహిస్తున్న ఓపెన్ కోర్టు విచారణకు బుధవారం రజత్‌కుమార్‌తో పాటు రిటైర్డ్ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2015 మార్చిలో అప్పటి సీఎం (కేసీఆర్) అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని, ఆ మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని విచారణలో రజత్ కుమార్ వెల్లడించారు.
మేడిగడ్డ కుంగితే చర్యలేవీ..?
2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నారని రజత్‌ను జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ కుంగినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి అప్పుడు ఎలాంటి రిపేర్లు చేయలేకపోయామని ఆయన తెలిపారు. అయితే.. ఇంజనీరింగ్ అధికారులు, స్టేట్ డ్యామ్‌సేఫ్టీ అధికారులతో దానిపై రివ్యూలు నిర్వహించామన్నారు. అప్పటికీ నదిలో నీళ్లుండడం వల్ల కూడా రిపేర్లు చేయలేకపోయామని తెలిపారు. బ్యారేజీ కుంగడానికి అసలు కారణమేంటి అని కమిషన్ ప్రశ్నించగా.. బ్యారేజీ ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగిపోయి ఉండొచ్చని రజత్ బదులిచ్చారు. అయితే.. క్వాలిటీ కంట్రోల్, ఓ అండ్ ఎం నిర్లక్ష్యం వల్ల కూడా బ్యారేజీకి డ్యామేజ్ జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు 200 అప్రూవల్స్
కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 200 వరకు పరిపాలనా అనుమతులు ఇచ్చారని రిటైర్డ్ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అని, 28 ప్యాకేజీలు, 8 లింకులతో కూడిన నెట్వర్క్ అని తెలిపారు. అంత పెద్ద ప్రాజెక్టుకు ఒక్కటే పరిపాలనా అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. పనులను బట్టి వివిధ సమయాల్లో 200 వరకు అనుమతులు ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎవరు అనుమతులిచ్చారు.. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారా? అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ సబ్ కమిటీ లాంటివేవీ ఏర్పాటు చేయలేదని జోషి చెప్పారు.