లేదు.. తెలియదు.. యాదికి లేదు

లేదు.. తెలియదు.. యాదికి లేదు
  • కమిషన్​ అడిగిన పలు ప్రశ్నలకు స్మితా సభర్వాల్, సోమేశ్​ సమాధానాలు ఇవి

కాళేశ్వరం కమిషన్: 2016 మార్చి 1న రూ.2591 కోట్లతో మేడిగడ్డ, రూ.1785 కోట్లతో అన్నారం, రూ.1437 కోట్లతో సుందిళ్ల బ్యారేజీలకు అప్పటి సీఎం ఓకే చెప్పాక.. కేబినెట్​లో చర్చించకుండానే జీవో జారీ చేశారా?
స్మిత: సీఎం అప్రూవల్స్​ ఇచ్చిన విషయం నాకు తెలియదు. ఈ విషయంలో సీఎం సొంతంగా నిర్ణయించి ఉండొచ్చు.
కమిషన్​: అంటే మూడు బ్యారేజీలకూ కేబినెట్​ అప్రూవల్స్​ లేవంటారా? 
స్మిత: నాకు తెలియదు
కమిషన్​: ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్​లో అదనపు ఆయకట్టు సృష్టించేందుకు వ్యాప్కోస్​తో స్టడీ కోసం  రూ.6.67 కోట్లు అప్పటి సీఎం రిలీజ్​చేశారు. కేబినెట్​ ఆమోదం లేకుండా డైరెక్ట్​గా సీఎం అప్రూవల్​ ఇచ్చారా? 
స్మిత: నాకు తెలియదు.
కమిషన్​: మీరేమైనా మీదగ్గరకు వచ్చిన ఫైళ్లలో లోపాలు ఎత్తి చూపారా?
స్మిత: లేదు 
కమిషన్​: మేడిగడ్డ లిఫ్ట్​ సిస్టమ్​కు సంబంధించి అదనపు పనులకోసం 2019 ఆగస్టు 6న జీవో 329 ఇష్యూ చేశారు కదా? 
సోమేశ్​: ఇచ్చి ఉండొచ్చు.  ఆ విషయం నాకు గుర్తులేదు.
కమిషన్​:  కేబినెట్​ అనుమతితోనే మూడు బ్యారేజీలను నిర్మించారా? 
సోమేశ్​: నాకు వాటితో ఎలాంటి సంబంధం లేదు.
కమిషన్​:  ప్రాణహిత –చేవెళ్ల 6, 7, 8, 10, 11, 12 ప్యాకేజీలకు మార్పులు చేసి రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన అంశం కేబినెట్​లో చర్చించారా?
సోమేశ్​: దీనిపై ఏమీ చెప్పలేను.
కమిషన్​: కేబినెట్​లో బ్యారేజీల విషయాలపై ఎప్పుడైనా చర్చించారా? 
సోమేశ్​: నాకు తెలియదు. 
కమిషన్​:  ఏదైనా ప్రాజెక్ట్​ లేదా ఇతర అంశాల్లో సీఎంకు డిసెంట్​ నోట్స్​ ఇచ్చారా?
సోమేశ్​: ఇవ్వలేదు. 
కమిషన్​: బ్యారేజీలను ఎప్పుడు ప్రారంభించారు? 
సోమేశ్​: 2018 లేదా 2019లో ప్రారంభించి ఉండొచ్చు.
కమిషన్: 3 బ్యారేజీలతో మీకు సంబంధం లేదా?   
సోమేశ్​: లేదు. 

నాడు సీఎంతో విభేదించారా?

ఏదైనా ప్రాజెక్ట్​ లేదా ఇతర అంశాల్లో సీఎంకు డిసెంట్​ నోట్స్​ ఇచ్చారా? అని కాళేశ్వరం కమిషన్​ ఆరా తీయగా.. ఇవ్వలేదని సోమేశ్​ కుమార్​ బదులిచ్చారు. ఏదైనా ఫైల్​కు సంబంధించి అందులో నెగెటివ్​ ఉంటే డిసెంట్​ వ్యక్తం చేయాలని మీ మనస్సాక్షికి అనిపించలేదా? అని కమిషన్​ ప్రశ్నించగా.. అవసరాన్ని బట్టి లోపాలను ఎత్తి చూపుతామన్నారు. అయితే, తన టెన్యూర్​లో మాత్రం అలాంటివి ఎదురు కాలేదన్నారు.  కింది స్థాయి అధికారులు తయారుచేసిన ఫైళ్లలో ఏవైనా లోపాలుంటే సరి చేసుకురావాలని చెప్పానని తెలిపారు. మూడు బ్యారేజీలతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని ఎప్పుడూ అనిపించలేదా..? అని కమిషన్​ ప్రశ్నించింది.

ఇలాంటి ఆర్థికాంశాల్లో ఆర్థికశాఖ కస్టోడియన్​గా ఉంటుందని, ఆర్థికశాఖ క్లియర్​ చేస్తే.. దానిని తాను ఫార్వర్డ్​ చేస్తానని సోమేశ్​ చెప్పుకొచ్చారు. మూడు బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బ్యారేజీలను ఎప్పుడు ప్రారంభించారని కమిషన్​ ప్రశ్నించగా.. 2018 లేదా 2019లో ప్రారంభించి ఉండొచ్చని సోమేశ్​ చెప్పారు. తాను సెక్రటరీగా ఉండి ఉంటే కచ్చితంగా ప్రారంభోత్సవానికి వెళ్లి ఉండేవాడిని కదా అంటూ వ్యాఖ్యానించారు. మూడు బ్యారేజీలతో మీకు ఎలాంటి సంబంధం లేదా అని కమిషన్​ మరోసారి ప్రశ్నించగా.. లేదని చెప్పిన ఆయన, ఒకసారి మాత్రం ముంపు విషయంలో మహారాష్ట్ర అధికారులతో సమావేశమయ్యామని తెలిపారు.