కాళేశ్వరం ఫైళ్లు కేబినెట్​కు రాలే.. కేవలం ప్రతిపాదనలే పెట్టారు..

కాళేశ్వరం ఫైళ్లు కేబినెట్​కు రాలే.. కేవలం ప్రతిపాదనలే పెట్టారు..
  • కమిషన్​ ఎదుట స్మితా సభర్వాల్​ అంగీకారం
  • ఆర్థికాంశాలపై మాత్రమే కేబినెట్​లో చర్చించారు
  • బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్​ ఇచ్చిన విషయం తెలియదు
  • సీఎం సెక్రటరీగా నాకు 7 ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు.. వాటిపై జిల్లాల్లో పర్యటించి సీఎంకు ఫీడ్​బ్యాక్​ ఇవ్వడం తన పని అని స్మిత వెల్లడి
  •  నేను సీఎస్​ కాక ముందే ప్రాజెక్టుపై నిర్ణయాలు జరిగాయి: సోమేశ్​కుమార్​ 
  • కాళేశ్వరం కమిషన్​ ఓపెన్​ కోర్టు విచారణకు హాజరు

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఏ ఫైల్​ కూడా కేబినెట్​ ముందుకుగానీ, సీఎంవోకి గానీ రాలేదని బీఆర్​ఎస్​ హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్​ స్పష్టం చేశారు.  ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్  ముందుకు వచ్చాయని.. ఆర్థికాంశాలపై చర్చించేందుకే ఆ ప్రతిపాదనలు పెట్టారని తెలిపారు. జీవోను కూడా కేబినెట్​లో పెట్టలేదని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ముందు ఆమె ఒప్పుకున్నారు.

‘‘జీవో 776కు నాటి ఇరిగేషన్​ శాఖ మంత్రి అనుమతిచ్చారు కదా.. అయినా కూడా కేబినెట్​లో దానిపై చర్చించలేదా?’’ అని కమిషన్​ ప్రశ్నించగా.. ఆ ఫైల్​ అసలు సీఎంవో వరకు కూడా రాలేదని ఆమె తేల్చిచెప్పారు. గురువారం కమిషన్​ ఓపెన్​ కోర్టు విచారణకు స్మితా సభర్వాల్​తో పాటు మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​ హాజరయ్యారు. పలు ప్రశ్నలకు ఇద్దరూ.. ‘‘లేదు.. తెలియదు.. యాదికి లేదు’’ అని సమాధానాలు చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టులోని 6, 7, 8, 10, 11, 12 ప్యాకేజీల మోడిఫికేషన్​కు సంబంధించి జీవో 776ని జారీ చేశారు కదా.. దానిని కేబినెట్​ ముందు ప్రవేశపెట్టారా అని కమిషన్​ ప్రశ్నించగా.. ఆర్థిక అంశాలపై చర్చించేందుకు మాత్రమే ప్రతిపాదనలు పెట్టారని స్మిత వెల్లడించారు.

‘‘ప్రాణహిత –చేవెళ్ల డిజైన్​ మార్పు డీపీఆర్​తో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి అప్పటి ఇరిగేషన్​ శాఖ మంత్రి ఆమోదించారు.. ఆతర్వాత 2016 జనవరి 18న జీవో 40ని జారీ చేశారు, దానిపైనా కేబినెట్​లో చర్చ జరగలేదు కదా’’ అని కమిషన్​ ప్రశ్నించింది. మంత్రి స్థాయిలోనే ఆమోదం తెలిపాక కేబినెట్​ ముందుకు రాని, చర్చించని ఏ ఫైల్​ కూడా సీఎంవోకు రాదని స్మితా సభర్వాల్​ స్పష్టం చేశారు.

2016 మార్చి 1న రూ.2,591 కోట్లతో మేడిగడ్డ, రూ.1,785 కోట్లతో అన్నారం, రూ.1,437 కోట్లతో సుందిళ్ల బ్యారేజీలకు అప్పటి సీఎం ఓకే చెప్పాక.. కేబినెట్​లో చర్చించకుండానే జీవో జారీ చేశారా? అని కమిషన్​ ఆరా తీయగా.. సీఎం ఆమోదం తెలిపే ప్రతి విషయం తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని, వాటికి అప్రూవల్స్​ ఇచ్చిన విషయం తనకు తెలియదని ఆమె బదులిచ్చారు. ఈ విషయంలో నాటి సీఎం సొంతంగా నిర్ణయించి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే, మూడు బ్యారేజీలకూ కేబినెట్​ అప్రూవల్స్​ లేవంటారా? అని కమిషన్​ ప్రశ్నించగా.. తనకు తెలియదని స్మిత చెప్పారు.  

సీఎం సెక్రటరీగా మీ పనులేంటి?

నాడు సీఎం సెక్రటరీగా మీ పనులేంటో చెప్పాలని స్మితా సభర్వాల్​ను కాళేశ్వరం కమిషన్​ ప్రశ్నించింది. తనకు 7 ప్రధాన సబ్జెక్టులను అప్పగించారని ఆమె చెప్పారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి తాను జిల్లాల్లో పర్యటించానని, ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఫీడ్​బ్యాక్​ను నాటి సీఎంకు చెప్పానని తెలిపారు. అయితే, తన పరిధి కేవలం జనరల్​ కో ఆర్డినేషన్​కే పరిమితమని ఆమె స్పష్టం చేశారు. తన ముందుకు వచ్చే అంశాలు ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉన్నాయో లేదో చెక్​ చేయడం తన పరిధి అని తెలిపారు. ‘‘సీఎస్​ నుంచి వచ్చే వివిధ ఫైళ్లు, ఇతర అంశాల్లో ఏవైనా లోపాలున్నాయో లేదో చెక్​ చేయడం కూడా నాడు నా డ్యూటీ. దానిపైనా సీఎంకు వివరించాల్సి  ఉంటుంది.

కేబినెట్​ సెక్రటేరియెట్​లో అన్ని చెక్స్​ అయ్యాక ఆ ఫైల్​ ఆమోదం కోసం సీఎంకు పంపాల్సి ఉంటుంది. అయితే, నాడు  నా దగ్గరకు వచ్చిన ఫైళ్లలో ఎలాంటి లోపాలుగానీ, తప్పులనుగానీ ఇటు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​, అటు సీఎస్​ ఆఫీస్​ నుంచి చెప్పలేదు” అని ఆమె పేర్కొనారు. అయితే, ఏ ఫైల్​ల్లోనైనా సీఎస్​గానీ, ఇతర శాఖల కార్యదర్శులుగానీ లోపాలను ఎత్తిచూపితే.. ఆ విషయాన్ని నాడు సీఎంకు చెప్పేవారా? అని కమిషన్​ ప్రశ్నించగా.. చెప్తామని పేర్కొన్నారు.

మరి, ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లపై అలాంటి లోపాలను ఏవైనా సీఎస్​గానీ, ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​గానీ ఎత్తి చూపాయా? అని కమిషన్​ ప్రశ్నించగా.. ఎవరూ లోపాలను చెప్పలేదని ఆమె అన్నారు. ‘‘మీరేమైనా మీదగ్గరకు వచ్చిన ఫైళ్లలో లోపాలు తేల్చారా?’’ అని ప్రశ్నించగా.. లేదని స్మిత బదులిచ్చారు. అయితే, క్రాస్​ ఎగ్జామినేషన్​లో ఆమె చాలా వరకు ప్రశ్నలకు తెలీదు అనే బదులివ్వడం గమనార్హం. 

నేను రాకముందే బ్యారేజీలపై నిర్ణయాలు: సోమేశ్​

కాళేశ్వరం ప్రాజెక్టుతో తనకు ఏ సంబంధమూ లేదని, ఆ ప్రాజెక్ట్​ అప్రూవల్స్​కు సంబంధించిన నిర్ణయాలు జరిగినప్పుడు తాను సీఎస్​గా గానీ, ఇరిగేషన్​ సెక్రటరీగా గానీ పనిచేయలేదని మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​ చెప్పారు. సీఎస్​గా పనిచేయడానికి ముందు ఇరిగేషన్​ సెక్రటరీగా పనిచేశారు కదా అని కమిషన్​ ప్రశ్నించగా.. కేవలం మూడున్నర నెలలు మాత్రమేనని, 2019 మే 2 నుంచి 2019 ఆగస్టు 18 వరకే పనిచేశానని ఆయన చెప్పారు. ఆ సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. ఇరిగేషన్​ సెక్రటరీగా పనిచేసి దాదాపు మూడేండ్లు అవుతుండడంతో అంతగా ఆ విషయాలు గుర్తులేవన్నారు.

అయితే, ఆయన సమాధానంపై జ్యుడీషియల్​ కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమైన విషయాలేవైనా చాలా మంది గుర్తుంచుకుంటారని, అంత త్వరగా ఎలా మరిచిపోతారని చురకలు అంటించింది. మేడిగడ్డ లిఫ్ట్​ సిస్టమ్​కు సంబంధించి అదనపు పనుల కోసం 2019 ఆగస్టు 6న జీవో 329 ఇష్యూ చేశారు కదా? అని కమిషన్​ ప్రశ్నించగా.. ఇచ్చి ఉండొచ్చని, ఆ విషయం తనకు గుర్తులేదని సోమేశ్​  చెప్పారు. ఆ జీవోలో ‘‘ఆ పనులకు సంబంధించిన ఖర్చులను 4700–01–232–2526–530/531 హెడ్​ అకౌంట్స్​ నుంచి తీసుకోవాలి” అని పేర్కొన్నారు కదా అని ప్రశ్నించగా.. అది సంబంధిత ఈఎన్​సీ, చీఫ్​ ఇంజనీర్ల ప్రపోజల్స్​ మేరకే ఆ జీవోను ఇచ్చామని ఆయన చెప్పారు.

ALSO READ : రేవంత్..ఏం చేస్కుంటవో చేస్కో..ఫార్ములా ఈ రేస్​లో అవినీతే లేదు..ఏసీబీ కేసు ఎలా పెడ్తది? : కేటీఆర్​

బ్యారేజీలకు సంబంధించి మీరేమైనా వ్యతిరేకాభిప్రాయం వెల్లడించారా? అని కమిషన్​ ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు. కేబినెట్​ అనుమతితోనే మూడు బ్యారేజీలను నిర్మించారా? అని కమిషన్​ ప్రశ్నించగా.. కేబినెట్​ అనుమతితోనే బ్యారేజీలను నిర్మించాల్సి ఉంటుందని, కానీ, వాటిపై నిర్ణయం జరిగినప్పుడు తనకు వాటితో ఎలాంటి సంబంధం లేదని సోమేశ్​ చెప్పారు. ప్రాణహిత –చేవెళ్ల 6, 7, 8, 10, 11, 12 ప్యాకేజీలకు మార్పులు చేసి రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం ఆదేశించిన అంశం కేబినెట్​లో చర్చించారా? అని ప్రశ్నించగా.. తాను అప్పుడు లేనని, దానిపై ఏమీ చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. తాను అప్పుడు కమర్షియల్​ ట్యాక్స్​ సెక్రటరీగా పనిచేశానన్నారు.  కేబినెట్​ ముందు బ్యారేజీల విషయాలపై చర్చించారా? అని ప్రశ్నించగా.. తనకు తెలియదన్నారు. అయితే, ఏ ఫైల్​ అయినా సరే సీఎస్​ నుంచే కేబినెట్​కు వెళ్తుందని, మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు.  

డైరెక్ట్​గా సీఎం అప్రూవల్స్​ ఇచ్చారా?

‘‘ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్​లో అదనంగా ఆయకట్టు సృష్టించేందుకు వ్యాప్కోస్​తో స్టడీ చేయించేందుకుగానూ  రూ.6.67 కోట్లు ఇష్యూ చేస్తూ అప్పటి సీఎం ఆమోదం తెలిపారు.. ఆ తర్వాత వెంటనే ఆర్థికాంశాలపై కేబినెట్​లో చర్చించారు.. ఆ ఫైల్​ కూడా ఉంది కదా?’’ అని జ్యుడీషియల్​ కమిషన్​ స్మిత సబర్వాల్​ను ప్రశ్నించింది. కొన్నిసార్లు అంశం అర్జెన్సీ, ప్రాధాన్యత ఆధారంగా బిజినెస్​ రూల్స్​కు లోబడి ఆ ప్రాజెక్టు ఆర్థికాంశాలపై చర్చించి ఉండొచ్చని ఆమె చెప్పారు.

అయితే, తనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియవన్నారు. మామూలుగా అయితే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఫైల్స్​ అన్నీ కూడా కేబినెట్​ నుంచే సీఎంకు వెళ్తాయి..కానీ ఈ ప్రాజెక్ట్​ విషయంలో మాత్రం డైరెక్ట్​గా సీఎం అప్రూవల్​ ఇచ్చారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని స్మిత చెప్పారు.