డంపింగ్ యార్డు పొగ మొస మర్రనిస్తలే .. చెత్తతో పూర్తిగా నిండిన రాంపూర్​-మడికొండ యార్డు

  • సగం కూడా పూర్తి కాని బయోమైనింగ్
  • వేస్టేజీని తగలబెడుతుండటంతో చుట్టుపక్కల ఊళ్లను కమ్మేస్తున్న పొగ
  • శ్వాసకోశ వ్యాధులతో పలువురికి ఇబ్బంది
  • డంపింగ్  యార్డును తరలించాలని స్థానికులు పోరాడుతున్నా ఫలితం శూన్యం

హనుమకొండ/కాజీపేట, వెలుగు : ఓరుగల్లు డంపింగ్​ యార్డు పొగ చుట్టుపక్కల ఊళ్లను కమ్మేస్తోంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. దట్టమైన పొగ, ఘాటైన వాసనతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  డంపింగ్​ యార్డు నుంచి వెలువడే కాలుష్యంతో కొంతమంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.  ఆస్తమా లాంటి జబ్బులున్న పేషెంట్లు ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ యార్డును దూర ప్రాంతానికి  తరలించాలని స్థానికులు చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నా.. లీడర్లు గానీ, ఆఫీసర్లు గానీ పట్టించుకోవడం లేదు. స్మార్ట్  సిటీ స్కీమ్​లో భాగంగా బయోమైనింగ్ ప్రాజెక్టు చేపట్టి రెండేండ్లు దాటినా ఇంతవరకు సగం కూడా పూర్తి కాలేదు. దీంతో రోజువారీగా పేరుకుపోతున్న చెత్తను డంపింగ్  యార్డు సిబ్బంది కాలబెడుతుండటంతో ఆ పొగంతా చుట్టుపక్కల ఐదు గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

పెరుగుతున్న చెత్త.. డెడ్​ స్లోగా బయో మైనింగ్

గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్  పరిధిలో 66 డివిజన్లు ఉండగా.. సుమారు 2.5 లక్షల ఇండ్లు, 11 లక్షల వరకు జనాభా ఉంది. రోజూ సగటున 400 టన్నుల వరకు తడి, పొడి చెత్త ఏర్పడుతుండగా.. దాన్నంతా సిటీ శివారులో రాంపూర్​, మడికొండ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్​ యార్డులో వేస్తున్నారు. 2007లో  దీనిని ఏర్పాటు చేయగా.. ఇప్పటికే అందులో సుమారు 5.5 లక్షల వరకు టన్నుల చెత్త పోగైంది.

దీంతో ఆ చెత్త గుట్టనంతా ప్రక్షాళన చేసేందుకు క్యాపింగ్​ చేపట్టి అందులో ఎనర్జీ జనరేషన్​ ప్లాంట్, బయోగ్యాస్​ ప్లాంట్​ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2021 డిసెంబర్​ లో స్మార్ట్​ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.36 కోట్ల అంచనా వ్యయంతో బయోమైనింగ్ చేపట్టారు. యార్డులో 3 లక్షల టన్నుల వ్యర్థాలను క్లీన్​ చేసేందుకు చైన్నైకి చెందిన లీప్​ ఎకోటెక్​ సొల్యూషన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ టెండర్  దక్కించుకుంది. రోజూ 1,600  టన్నుల చొప్పున ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర టన్నుల దాకా చెత్తను ప్రాసెస్  చేసినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. తాజాగా బయోమైనింగ్​ ప్రాజెక్టును పరిశీలించిన అధికారులు.. జనవరి వరకు ప్రాసెసింగ్​ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్​ పెట్టారు. రెండేండ్లలో కాని పనులను నెలన్నరలో ఎలా పూర్తి చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఊళ్లను కమ్మేస్తున్న పొగ

బయోమైనింగ్ లో భాగంగా కాంట్రాక్ట్​ సంస్థకు డంపింగ్​ యార్డులో ఉన్న 3 లక్షల టన్నుల వ్యర్థాలను అప్పగించారు. రోజువారీగా వస్తున్న చెత్తతో సంబంధం లేకుండా సదరు సంస్థ ఆ 3 లక్షల టన్నుల వరకే పరిమితమై పని చేస్తోంది. కొత్తగా ఉత్పత్తవుతున్న చెత్తకు సరైన సొల్యూషన్​ లేక దానినంతా అదే యార్డులో డంప్​ చేస్తున్నారు. ఫలితంగా ఆ యార్డు ఇదివరకే పూర్తిగా నిండిపోయింది. దీంతో నగరానికి నాలుగువైపులా డంపింగ్​ యార్డులు ఏర్పాటు చేయాలని గతంలో ప్రయత్నించినా స్థల వివాదాలతో సాధ్యం కాలేదు.

రోజూ సాయంత్రం డంపింగ్​ యార్డు సిబ్బంది చెత్తకు మంట అంటిస్తున్నారు. దీంతో దాని నుంచి వెలువడే దట్టమైన పొగ, ఘాటు వాసనలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కమ్ముకుంటున్నాయి. రాంపూర్, మడికొండ గ్రామాలతో పాటు అయోధ్యపురం, కుమ్మరిగూడెం, ఎలుకుర్తి ఆ సమీప ప్రాంతాలను కూడా పొగ కమ్మేస్తోంది. నిరుడు కూడా ఇలాగే మంటలు పెట్టడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఫైర్​ ఇంజిన్లతో  మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. ఫైర్​ ఇంజిన్​ సిబ్బంది కూడా పొగ, ఘాటు వాసనలకు అక్కడే సొమ్మసిల్లి 
పడిపోయారు.

యార్డును తరలిస్తామని మాట తప్పుతున్న లీడర్లు

డంపింగ్​ యార్డు పొగ, ఘాటు వాసనలతో రోగాల బారినపడుతున్నామని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యార్డును అక్కడి నుంచి తరలించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. యార్డును తరలిస్తామని ప్రతీసారి ఎలక్షన్లలో లీడర్లు మడికొండ, రాంపూర్, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మాటిచ్చి ఓట్లేయించుకోవడం, ఆ తరువాత అటువైపు  చూడకపోవడం సాధారణంగా మారింది.

రెండు వారాలుగా యార్డుకు రోజూ మంట అంటిస్తున్నారు. దీంతో సాయంత్రమైందంటే పొగ, వాసనలతో అవస్థలు పడుతున్నాయని తాజాగా గురువారం రాత్రి మడికొండ గ్రామస్థులు నేషనల్  హైవేపై ధర్నాకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోగా.. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇకనైనా డంపింగ్​ యార్డును తరలించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇన్ఫెక్షన్లు అయితున్నయ్ 

డంపింగ్​ యార్డు నుంచి వస్తున్న పొగ వల్ల నాకు గొంతు ఇన్ఫెక్షన్​ అయ్యింది. పొగతో కండ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. యార్డును ఇక్కడి నుంచి తరలించాలని లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నోసార్లు విన్నవించినం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

తొట్టె ప్రవీణ్, రాంపూర్

ఊపిరి ఆడుతలేదు 

డంపింగ్​ యార్డు నుంచి దట్టమైన పొగ వస్తోంది. ఘాటు వాసనలు, పొగతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. యార్డును తరలించాలని ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేదు. ఇకనైనా యార్డును ఇక్కడి నుంచి తరలించి మా సమస్యను పరిష్కరించాలి.

కుక్కల కళావతి, మడికొండ