హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో పరిమితికి మించి పొగ వెదజల్లే వాహనాల కట్టడికి రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో కొత్త పాలసీని పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్ణయించారు.
విపరీతంగా పొగ వెదజల్లే టూ, త్రీ, ఫోర్ వీలర్లకు మొదటి దశలో భారీ జరిమానాలు విధించేందుకు ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టారు. ఆ తర్వాత మళ్లీ అదే తప్పు చేస్తే.. పరిస్థితిని బట్టి వాహనం సీజ్ చేయాలని నిర్ణయించారు. పోలీసుల సహకారంతో ప్రధానంగా హైదరాబాద్ సిటీలో అన్ని చోట్ల తనిఖీలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల 100 మందికిపైగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ)లను రవాణా శాఖ నియమించింది. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పూర్తి స్థాయిలో ఈ తనిఖీల కోసం ఉపయోగించుకోనున్నది. .
పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యంగా..
హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే పోయినేడాది ఈవీ పాలసీ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలను మాఫీ చేసి ప్రోత్సాహం అందిస్తున్నారు. అదేవిధంగా, తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఆటోలు, ఆర్టీసీ బస్సులను ఓఆర్‌ఆర్ అవతలికి పంపిస్తామని, వీటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో చాలా వరకు ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరోవైపు ఆటోలు, బస్సులే కాకుండా పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, లారీల వంటి భారీ వాహనాలు ప్రమాదకర స్థాయిలో రోడ్లను పొగతో కమ్మేస్తున్నాయి. ఇలాంటి వాహనాలకు చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నది. నిత్యం హైదరాబాద్ రోడ్లపై తిరిగే వాహనాల్లో కనీసం 30 నుంచి 40 శాతం వరకు వివిధ స్థాయిల్లో పరిమితికి మించి పొగను రిలీజ్ చేస్తున్నాయని అధికారులు గుర్తించారు.
శ్వాసకోశ వ్యాధుల బారిన జనాలు
ఆర్టీఏ నిబంధనల ప్రకారం.. ప్రతి ఆరు నెలలకోసారి అన్ని రకాల వాహనాలు పొల్యూషన్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ సర్టిఫికెట్‌ను వాహనదారుడు బండితో పాటే ఉంచుకోవాలి. ఆర్టీఏ అధికారులు తనిఖీ చేసినప్పుడు చూపించాలి. ఆర్టీఏ ఎం వ్యాలెట్ లో కూడా అప్లోడ్ చేసుకుని చూపించొచ్చు. కానీ.. చాలా మంది పొల్యూషన్ సర్టిఫికెట్‌ను లైట్ తీసుకుంటున్నారు. ఇకపై ఇలా చేస్తే నడ్వదని ఆర్టీఏ అధికారులు అంటున్నారు. వాహనాల నుంచి వెలువడే పొగలో ప్రధానంగా కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మిథేన్ ఉంటాయి. వాతావరణంలో ఇవన్నీ మోతాదుకు మించిపోవడంతో జనం శ్వాసకోశ వ్యాధుల బారినపడ్తున్నారు.
హైదరాబాద్లో వాయు కాలుష్యం ఇప్పటికే ప్రమాదకరస్థాయికి చేరుకున్నది. ఈ తరుణంలో ఈవీలను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించాలన్న సర్కారు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధి విధానాలు రూపొందించి, అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేస్తామని అంటున్నారు.