రాహుల్ ఏమన్నా ప్రధాని అభ్యర్థా? : స్మృతి

రాహుల్ ఏమన్నా ప్రధాని అభ్యర్థా? :  స్మృతి

న్యూఢిల్లీ: ఎన్నికల ఇష్యూస్ పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్  నేత రాహుల్  గాంధీ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ప్రధాని స్థాయి వ్యక్తితో చర్చించేందుకు రాహుల్  ప్రధాని అభ్యర్థా అని ఆమె ప్రశ్నించారు. ‘‘తన సొంత నియోజకర్గం అమేథీలోనే రాహుల్  పోటీచేయడం లేదు. అక్కడ ఒక బీజేపీ కార్యకర్తపై పోటీచేసే ధైర్యం కూడా ఆయనకు లేదు. 

అలాంటి వ్యక్తి గొప్పలు చెప్పకుండా ఉండాలి. రాహుల్  ఏమన్నా ఇండియా కూటమి ప్రధాని క్యాండిడేటా మోదీతో డిబేట్  చేయడానికి? ఆయనకు ఏం అర్హత ఉంది?” అని స్మృతి పేర్కొన్నారు. కాగా, ఎన్నికల అంశాలపై ప్రధానితో చర్చలో పాల్గొనాలన్న ప్రతిపాదనను రాహుల్  అంగీకరించారు. ప్రధానితో చర్చలో పాల్గొనడానికి తాను గానీ లేదా ఇండియా కూటమి నుంచి మల్లికార్జున్  ఖర్గే గానీ హాజరవుతారని ఆయన ప్రకటించారు. ఈ చర్చకు హాజరవ్వాలన్న ఆహ్వానాన్ని కాంగ్రెస్  స్వాగతిస్తుందని, ప్రధాని కూడా ఈ చర్చలో పాల్గొనాలని దేశమంతా ఎదురుచూస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, ఈ చర్చలో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఒప్పుకోరని ఆయన చెప్పారు.