కారు సీట్ల కింద పెట్టి గంజాయి స్మగ్లింగ్..​ స్మగ్లర్​ సునీతా దాస్, మరో ఇద్దరు అరెస్టు

కారు సీట్ల కింద పెట్టి గంజాయి స్మగ్లింగ్..​  స్మగ్లర్​ సునీతా దాస్, మరో ఇద్దరు అరెస్టు


హైదరాబాద్ సిటీ, వెలుగు: గంజాయి స్మగ్లర్​సునీతా దాస్ ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువస్తుండగా స్టేట్​టాస్క్​ఫోర్స్ డీ టీమ్‌‌ పట్టుకుంది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా జగదల్ పూర్ నుంచి హైదరాబాద్ కు కారు సీటు కింద స్పెషల్ అరలు తయారుచేసుకుని సునీతా దాస్ అనే మహిళ 14.5 కిలోల గంజాయి ప్యాకెట్లను  తీసుకువస్తోంది.  

పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తన టీమ్ తో హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెను పట్టుకున్నారు.  సునీతా దాస్​తో పాటు కారు డ్రైవర్‌‌ ఇస్తియాఖురేషి, కంకన్‌‌ సన అనే వ్యక్తులను అరెస్టు చేశారు. దూల్‌‌పేట్‌‌లోని ఓ వ్యాపారికి అమ్మడానికి గంజాయి తీసుకెళుతున్నామని నిందితులు ఒప్పుకున్నారు.  గంజాయి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను హయత్ నగర్ ఎక్సైజ్ పీఎస్​లో అప్పగించారు.

కారులో గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

గండిపేట : కారులో గంజాయి తరలిస్తున్న నలుగురిని  అత్తాపూర్‌‌ పోలీసులు అరెస్టు చేశారు. పీవీ నర్సింహారావు ఎక్స్‌‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 160 వద్ద అత్తాపూర్‌‌ సబ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ ఎన్‌‌.వెంకన్న తనిఖీలు చేస్తున్నారు.  ఫారెస్ట్‌‌ ఆఫీస్‌‌ ప్రాంతంలో కారులో సులేమాన్‌‌నగర్‌‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌‌ రెహన్ (23), ఎంఎం పహాడీకి చెందిన మహ్మద్‌‌ సమీరుద్దీన్‌‌(23),  సులేమాన్‌‌నగర్‌‌కు చెందిన మిర్‌‌ అరాఫత్‌‌ ఆలీ(28), ఆసిఫ్‌‌నగర్‌‌కు చెందిన అద్దుల రవికుమార్‌‌ (28) గంజాయిని తీసుకువస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.