పెద్దాపూర్ గురుకుల స్కూల్ లో మళ్లీ కలకలం .. 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత

పెద్దాపూర్ గురుకుల స్కూల్ లో మళ్లీ కలకలం ..  24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత
  • చేతులు, కాళ్లపై గాట్లతో పాము కాటు అనుమానాలు
  •  హాస్పిటల్ కు తరలించి  ట్రీట్ మెంట్  
  •  భయాందోళనలో విద్యార్థులు, పేరెంట్స్ 

మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల స్కూల్ లో మరోసారి పాము కాటు కలకలం రేపింది. 24 గంటల్లోనే ఇద్దరు స్టూడెంట్స్ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థులు,  తల్లిదండ్రుల్లో  భయాందోళన నెలకొంది.  వివరాల్లోకి వెళ్తే..  పెద్దాపూర్ గురుకుల స్కూల్ లో ఎనిమిదో క్లాస్ విద్యార్థి సిరిసిల్లా జిల్లాకు చెందిన బోడ యశ్విత్(14)  గురువారం ఉదయం నిద్రలేవగానే అస్వస్థతకు గురవగా వెంటనే టీచర్లకు చెప్పాడు. అతని కాలు, చెయ్యిపై నాలుగు గాట్లు ఉండడంతో విషపురుగు లేదా పాముకాటు వేసిందా అని అనుమానించారు. 

108లో కోరుట్లలోని ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు యాంటివీనమ్ ట్రీట్ మెంట్ ఇచ్చి అబ్జర్వేషన్ లో ఉంచారు.  కాగా బుధవారం రాత్రి కూడా మెట్ పల్లికి చెందిన ఎనిమిదో క్లాస్ విద్యార్థి ఓంకార్ అఖిల్ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరగా యాంటివీనం ట్రీట్ మెంట్ అందిస్తున్న విషయం  తెలిసిందే. 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురవడం, ఇద్దరి చేతులు, కాళ్లపై ఒకే విధంగా గాట్లు ఉండడంతో పాము కాటుకు ఇచ్చే ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

వీరు పక్క పక్క బెడ్లపై పడుకోగా గంటల వ్యవధిలోనే అస్వస్థతకు గురికావడం, చేతులు, కాళ్లపై గాట్లు ఉండడంతో పాముకాటుపై అనుమానాలు పెరిగా యి. తల్లిదండ్రులు భారీగా స్కూల్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇంటికి తీసుకెళ్తామని పంపించాలని ప్రిన్సిపల్, అధికారులపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేయగా వాగ్వాదం జరిగింది.  

విద్యార్థులకు కలెక్టర్ పరామర్శ

 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను  జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరామర్శించారు. అనంతరం స్కూల్ ను సందర్శించి ఘటనపై వివరాలు అడిగారు. పరిసరాలను పరిశీలించి చెత్తా చెదారం తొలగించాలని ఆదేశించారు. పాముకాటుపై  క్లారిటీ లేదని పూర్తి టెస్టులు చేశాకే  తెలుస్తుందని చెప్పారు. విద్యార్థులు భయాందోళనకు గురికావద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు. 

 స్కూల్ ప్రిన్సిపల్ సస్పెన్షన్ 

విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఘటనపై ముందుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు108కు లేట్ గా కాల్  చేయడం, స్కూల్ లో శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో ఆమెను సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన నిర్లక్ష్యం ఏమి లేదని,  అస్వస్థతకు గురైన విద్యార్థుల పేరెంట్స్ ను పిలిచి హాస్పిటల్ కు పంపించానని ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. 

  హైవేపై పేరెంట్స్  రాస్తారోకో

 స్కూల్ లో విద్యార్థులకు సరైన వసతులు లేవని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ నేషనల్ హైవే ఈ–63పై విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో చేశారు. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న స్కూల్ ను వేరే చోటకు తరలించాలని కోరారు.  డీఎస్పీ రాములు, ఆర్డీవో శ్రీనివాస్ సముదాయించినా వినిపించుకోలేదు.  ఏడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకిరువైపులా కిలోమీటర్ల మేర వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నాలుగు నెలల కిందట ఘటన

నాలుగు నెలల కింద స్కూల్ లో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో చనిపోగా మరో ఇద్దరు అస్వస్థతకు గురై  హైదరాబాద్ లో  ట్రీట్ మెంట్ పొందారు. ప్రస్తుతం అదేవిధంగా జరిగింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో  భయాందోళన నెలకొంది. అప్పట్లో ఘటన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి  స్కూల్ ను సందర్శించి మౌలిక వసతులకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నిధులు రాకపోవడంతో స్కూల్ పరిసరాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు.  ప్రతిరోజు పాములు కనిపిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.