ఒడిషా: ఎవరికైనా పామును చూస్తే చెప్పలేనంత భయం కలుగుతుంది. అటువంటిది పామును నోటితో కొరికి చంపడమంటే.. ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి పామును ఇలాగే కొరికి చంపాడు. జాజ్‌పూర్ జిల్లాలోని దనగాడి బ్లాక్ పరిధిలోని సలిజంగా సమీపాన ఉన్న గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్రా బుధవారం రాత్రి పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. రాత్రి కావడంతో పామును చూసుకోలేదు. అది బద్రా కాలిపై కరిచింది. వెంటనే గమనించిన బద్రా.. టార్చ్ లైట్ తో పామును చూసి పట్టుకున్నాడు. కోపంతో పామును చేతుల్లోకి తీసుకొని.. నోటితో కొరికి కొరికి చంపాడు. అనంతరం చచ్చిన పామును తీసుకొని ఇంటికి వెళ్లి.. భార్య మరియు స్నేహితులతో జరిగిన విషయం చెప్పాడు. వెంటనే స్నేహితులు బద్రాను ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా కోరారు. కానీ, బద్రా మాత్రం హాస్పిటల్ కు వెళ్లకుండా.. నాటు వైద్యం చేసే వారి దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకున్నాడు.
ఈ ఘటనపై బద్రా మాట్లాడుతూ.. ‘నేను బుధవారం రాత్రి పొలం నుంచి కాలినడకన ఇంటికి వస్తుండగా నా కాలికి ఏదో తగిలింది. నేను టార్చ్‌ని ఆన్ చేసి చూడగా.. అది విషపూరిత పాము. వెంటనే కోపంతో పామును నా చేతుల్లోకి తీసుకొని పదేపదే కొరికాను. దాంతో పాము అక్కడికక్కడే చనిపోయింది. నేను ఆస్పత్రికి వెళ్లకుండా.. నాటు వైద్యుల దగ్గరకు వెళ్లాను. ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను బాగానే ఉన్నాను’ అని బద్రా అన్నాడు.