పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలా పాములు చల్లదనం కోసం మానవ నివాసాల్లోకి వస్తున్నాయి. కొన్ని పాములు అయితే..ప్రజల బాత్ రూంలో చొరబడుతున్నాయి. మరికొన్ని వాహనాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ 13వ తేదీన కరీంనగర్ లో ఓ నాగుపాము బైక్ లో దూరిన ఘటన మరవక ముందే..తాజాగా మరో నాగుపాము ఆటోలో దూరింది. పాకడం ఇబ్బంది మారిందో లేక..ఆటోలో వెళ్లాలన్న ఆసక్తి కనభర్చిందో కానీ..ఆరడుగుల నాగుపాము ఎంచక్కా ఆటో ఎక్కింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
బద్లాపూర్ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వెనకాల ఆటో స్టాండ్ లో ఆటోలు నిలిపి ఉన్నాయి. ఈ సయయంలో ఓ ఆటోలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆటోకు వెనకాల పాము వేలాడుతూ కనిపించింది. ఈ సమయంలో అటు నుంచి వెళ్తున్న పాదచారులు పామును చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పాము పడగవిప్పేసరికి భయాందోళనకు గురయ్యారు. భయం నుంచి బయటకు వచ్చిన స్థానికులు..నాగుపామును చూసేందుకు గుమిగూడారు. తమ ఫోన్లలో నాగుపామును వీడియో తీశారు. ఈ సమయంలో ఆటో వెనుక వైపు నుంచి నిలువునా లేచిన పాము..ఆటో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ నాగుపాముకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Near Ticket window of Badlapur railway station#wildearth #AnimalLovers #badlapur #snake pic.twitter.com/5echRbAA3A
— ABHI KUSHWAHA (@ABHIKUS44168075) October 12, 2023
ఆటోలో నాగుపాము కనిపించినా..ఆటో డ్రైవర్ మాత్రం దానికి హాని తలపెట్టలేదు. రోడ్డుమీద ఎలాంటి పాము కనిపించినా..దాన్ని చంపేందుకో లేక..దాడి చేసేందుకు జనాల ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆటో డ్రైవర్లు ఆ నాగుపామును ఏమీ అనలేదు. దీనికి తోడు భయాందోళనకు గురైన స్థానికులను కూడా శాంతింపచేశారు. దాని మానాన అది వెళ్లిపోతుంది..ఏమీ అనకండి అంటూ సర్దిచెప్పారు.
ఆటో ఎక్కిన నాగుపాము వీడియోపై నెటిజన్లు ఫన్ని కామెంట్స్ పెట్టారు. పాము ఆటోలో జంగిల్ సఫారీకి వెళ్తోందని అన్నారు. ముంబై చుట్టూ తిరిగేందుకు పాము ఆటోలో ఎక్కిందన్నారు.