హైదరాబాద్ లో సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది త్రాచుపాము. సిగ్నల్ లైట్లు ఉన్న స్థంభం పైకి ఎక్కిన పాము ఎంతకీ దిగకపోవడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. భారీగా జనం గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు గంటసేపు పాము ఇబ్బందిపెట్టింది.
అసలేం జరిగిందంటే.. హిమాయత్ నగర్లోని లిబర్టీ చౌరస్తా సిగ్నల్ దగ్గర ఉన్న వేప చెట్టుపై నుంచి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ స్థంభం పైకి వచ్చింది పాము. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి.. తమ ఫోన్ లలో వీడియో తీసుకున్నారు వాహనదారులు.జనం భారీగా చేరడంతో లిబర్టీ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సుమారు గంట పాటు ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది పాము. తర్వాత ఎట్టకేలకు సిగ్నల్ స్థంభం నుంచి కిందకు దిగి , పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లార్ లోకి వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత జనాలను చెదరగొట్టిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు .