మెట్‌పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పెద్దపూర్ గురుకులంలో 12 రోజుల్లోనే ఇద్దరు స్టూడెంట్లు చనిపోవడం, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు స్కూల్ ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఇందులో భాగంగా పాత షెడ్‌లు, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో రెండు పుట్టలు, అందులో పాములు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. నాలుగు పాములను చంపేయగా మిగతావి పొదల్లోకి వెళ్లిపోయాయి. దీన్ని బట్టి ఇటీవల స్టూడెంట్ల మరణం, అస్వస్థతకు పాములే కారణమై ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.