
కురవి, వెలుగు : స్నాప్ చాట్‌లో పరిచయమైన ఓ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 3.37 లక్షలు వసూలు చేసి మోసం చేసింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గూలగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గార్ల మండలంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి జనవరి 22న స్నాప్‌చాట్‌లో ఓ అమ్మాయి పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించారు.
కొన్ని రోజుల తర్వాత రెంట్‌పే చేయడానికి రూ. 400 తక్కువగా ఉన్నాయని, సెండ్ చేయాలని అమ్మాయి అడగడంతో అతడు ఫోన్‌పే చేశాడు. తర్వాత మరోసారి అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ రూ. 2 వేలు ఉండాలని, ఆ డబ్బులు ఇవ్వాలని కోరడంతో అవి కూడా పంపించాడు. ఇలా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు పలు విడతలుగా రూ. 3.37 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్‌ఆఫ్ రావడంతో మోసపోయినట్లు తెలుసుకొని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.