- సిటీలో పదుల సంఖ్యలో చోరీ గ్యాంగ్ లు.. ఢిల్లీ, ముంబై అడ్డాగా దేశవ్యాప్త నెట్ వర్క్
- పిక్ పాకెటర్లు, చైన్ స్నాచర్లకు టాస్క్‌లు.. రోజుకు 15 నుంచి 20 స్మార్ట్ ఫోన్లు చోరీ
- కొరియర్, ట్రాన్స్‌పోర్ట్ ద్వారా తరలింపు.. ముంబయి నుంచి విదేశాలకు ట్రాన్స్‌పోర్ట్
హైదరాబాద్,వెలుగు : సిటీలో మొబైల్ ఫోన్ల స్నాచింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా మారింది. ఢిల్లీ, ముంబయి అడ్డాగా సెల్‌ఫోన్ మాఫియా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ను ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ సహా మెట్రో సిటీల్లో గ్యాంగ్ లను ఏర్పాటు చేసుకుని.. ఏటా రూ.వందల కోట్లు విలువైన స్మార్ట్ ఫోన్లను చోరీ చేస్తుంది. స్థానిక పిక్ పాకెటర్లు, చైన్‌స్నాచర్లు, డ్రగ్స్, గంజాయి బానిసలను స్నాచర్లుగా మార్చుకుంది.
కొట్టేసిన సెల్ ఫోన్లను సెంట్రల్‌ఎక్వీప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్)కు చిక్కకుండా విదేశాలకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. గత నెల రోజుల్లో ఇలాంటి మూడు గ్యాంగ్‌లను సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సూడాన్ దేశానికి మొబైల్ ఫోన్స్ ఎక్స్‌పోర్ట్ చేసే గ్యాంగ్ వద్ద ఇంటర్నేషనల్ సెల్‌ఫోన్ మాఫియా వివరాలను రాబట్టారు. దీంతో అబిడ్స్ జగదీశ్ మార్కెట్, సికింద్రాబాద్‌లోని హాంకాంగ్ మార్కెట్స్‌పై నిఘా పెంచారు.
కొట్టేసిన ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి
సెల్ ఫోన్లలో సీఈఐఆర్ సంఖ్య అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి గ్యాంగ్స్ కొత్త రూట్ లో వెళ్తున్నాయి. చోరీ చేసిన ఫోన్లు ట్రేస్ కాకుండా సీఈఐఆర్‌కు చిక్కకుండా విదేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నాయి. కొట్టేసిన సెల్‌ఫోన్లను ముందుగా సిటీలోని పలు మార్కెట్లలో సెకండ్ సేల్స్ వ్యాపారులకు అమ్ముతున్నాయి. ఫోన్లను ఆన్ చేయకుండా సిమ్ కార్డులు వేయకుండా నెలల తరబడి స్టోర్ చేస్తున్నారు. దీంతో ఐఎంఈఐ నంబర్ల ద్వారా పోలీసులు సెర్చ్ చేసినా వాటి జాడ దొరకడంలేదు. అనంతరం సెకండ్ సేల్స్ వ్యాపారుల నుంచి అంత ర్రాష్ట్ర ముఠాలు బల్క్‌గా కొనుగోలు చేస్తున్నాయి.
రోజుకు 20కి పైగానే చోరీ
సిటీలో రోజూ దాదాపు 20కి పైగా ఖరీదైన స్మార్ట్ ఫోన్లనే టార్గెట్ చేసి స్నాచర్లు కొట్టేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో స్థానిక దొంగలతో పాటు అంతర్రాష్ట్ర ముఠాలు కూడా చోరీలకు పాల్పడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, రద్దీగా ఉండే మార్కెట్లలో రెక్కీ వేసి కొట్టేస్తున్నట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఆర్టీసీ బస్సుల్లో నే ఎక్కువగా ఫోన్ల చోరీ జరుగుతుందని పోలీసుల కేస్ స్టడీస్ ద్వారా తెలుస్తుంది. చైన్ స్నాచింగ్స్‌తో పోల్చితే సెల్‌ఫోన్ చోరీలపైనే స్నాచింగ్ ముఠాలు ఫోకస్ పెడుతున్నాయి. రోడ్లపై నడిచి వెళ్లే వారి చేతుల్లో నుంచి ఫోన్లను లాక్కెళ్తున్నాయి.
మెట్రో సిటీలే టార్గెట్
మొబైల్స్ చోరీ చేయడం ఈజీ కావడంతో అంతరాష్ట్ర ముఠాలు మెట్రో సిటీలను టార్గెట్ చేశాయి. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి సిటీస్‌లో ఢిల్లీ, యూపీ, బిహార్, ముంబయి గ్యాంగ్స్ చోరీలకు పాల్పడు తున్నాయి. ముందుగా ఇక్కడికి టూరిస్టుల్లా వచ్చి మకాం వేస్తున్నాయి. ఐదుగురికి మించకుండా రైల్వే స్టేషన్‌లు, శివారు ప్రాంతాల్లోని లాడ్జిల్లో షెల్టర్ తీసుకుంటు న్నాయి. రద్దీ ప్రాంతాల్లో బస్సు రూట్లను సెలెక్ట్ చేసుకుని ముందుగా రెక్కీ వేస్తున్నా యి. ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే చోరీలకు పాల్పడుతు న్నాయి. కొట్టిసిన ఫోన్లను కొరియర్లు, పార్సిల్స్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాయి.
అత్తాపూర్‌లో మొబైల్ చూస్తూ ఇంటిముందు కూర్చున్న ఇద్దరు బిహార్ యువకులపై ఓ మైనర్ బాలుడు, మహ్మద్ అజీజ్ ఖురేషి అనే యువకుడు దాడి చేశారు.సెల్‌ఫోన్ చోరీ చేసేందుకు యత్నించారు. దీంతో బిహారీలు అడ్డుకోగా దాడి చేసి హత్య చేశారు. నిందితులై మైనర్ బాలుడు, అజీజ్ గంజాయికి బానిసలు అయ్యారు. ఇలాంటివే సిటీలో పదుల సంఖ్యలో మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ముందుగా బైక్ లు చోరీ చేసి సెల్‌ఫోన్ స్నాచింగ్స్ చేస్తున్నారు. కొట్టేసిన ఫోన్లను ముంబయి, ఢిల్లీ గ్యాంగ్‌లకు విక్రయిస్తున్నారు.