- 90 శాతం నాలాల పనులు పూర్తి చేసినట్లు చెబుతున్న జీహెచ్ఎంసీ
- 48గంటలు దాటినా తొలగని వర్షపు నీరు
- వర్షాకాలం మంరింత అధ్వానంగా ఉండే ఛాన్స్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో చేపట్టిన ఫస్ట్ఫేజ్స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ) పనులు పూర్తయినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించేలా లేదు. ఇప్పటివరకు 90 శాతానికి పైగా పనులు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా ఇబ్బందులు తొలగేలా లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ వరద నీరు నిలవడమే ఇందుకు నిదర్శనం. ఎండా కాలంలోనే ఇలా ఉంటే వర్షా కాలంలో పరిస్థితులు ఎలా ఉంటోయోనని జనం ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల కిందట సిటీలో 4 నుంచి 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, చందానగర్ సహా చాలా ప్రాంతాల్లో మరుసటి రోజుకు కూడా వరదనీరు తొలగలేదు. ఎస్ఎన్డీపీ ఫస్ట్ ఫేజ్ కింద చేస్తున్న పనులు వంద శాతం అయినా ముంపు సమస్య పోయే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన అన్నిచోట్ల పనులు చేస్తే తప్ప వరదలను నివారించలేమని అంటున్నారు. వీలైనంత త్వరగా ఫస్ట్ఫేజ్పూర్తిచేసి సెకండ్ఫేజ్ పనులు స్టార్ట్చేయాలంటున్నారు. చాలా డివిజన్లలో బాక్సు డ్రెయిన్ల పనులు స్టార్ట్చేసినప్పటికీ పూర్తిచేయలేదు. సెకండ్ఫేజ్లో పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
సెకండ్ ఫేజ్ కష్టమే!
ఫస్ట్ ఫేజ్ కింద రూ.737.45కోట్లతో 37 నాలాల పనులు చేపట్టారు. రెండేళ్లుగా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వందల కాలనీలు నీట మునిగాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఎస్ఎన్డీపీ పనులు మాత్రం పూర్తిచేయలేదు. ఫస్ట్ ఫేజ్ పూర్తిచేసి, సెకండ్ ఫేజ్ పనులు మొదలుపెడతామని చెప్పినప్పటికీ, సెకండ్ ఫేజ్ కష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా బల్దియా అధికారులు చేసేలా లేరు. ఫండ్స్కోసం లోన్ తీసుకునేందుకు అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే లోన్ లిమిట్ పూర్తి కావడంతో కొత్త లోన్లు పుట్టడం లేదు. మల్కాజిగిరి, మన్సూరాబాద్, ఖైరతాబాద్, చందానగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, బోరబండ ప్రాంతాల్లో నాలాల నిర్మాణం చేపట్టినప్పటికీ అన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.
ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ పనులు చేయాలి
ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ పనులు చేస్తే తప్ప డ్రైనేజీ సమస్య తీరదు. చాలాచోట్ల బాక్స్ డ్రెయిన్లు, నాలాలు నిర్మిస్తున్నప్పటికీ అవసరం ఉన్నచోట ఒకేసారి నిర్మిస్తే ఇబ్బందులుండవు. ఆనంద్ బాగ్ లో నిర్మించిన బాక్స్ డ్రెయిన్ పూర్తిగా నిర్మించకపోవడంతో వర్షాలు కురిసిన టైంలో సమస్య తీవ్రమవుతోంది. వెంటనే సెకండ్ ఫేజ్ పనులు స్టార్ట్ చేస్తే మంచింది.
– శ్రవణ్, మల్కాజిగిరి కార్పొరేటర్
పైప్లైన్లను మార్చాలి
కొత్త నాలాలు ఎక్కడ నిర్మించారో.. పాత నాలాలను ఎంత మేరకు వైడెనింగ్చేశారో క్లారిటీ లేదు. నాలాల్లోని చెత్తను రెగ్యులర్ గా తీయడం లేదు. అలాంటప్పుడు ఎస్ఎన్డీపీ పనులు చేసినా ప్రయోజనం ఉండదు. ఎన్నో ఏండ్ల కింద, తక్కువ జనాభా ఉన్నప్పుడు వేసిన పైప్లైన్లనే నేటికీ వాడుతున్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పైప్ లైన్లు వేయాలి. అప్పుడు సమస్య ఉండదు. ఈ అంశంపై చేసిన సర్వే రిపోర్టులను బయట పెట్టలేదు. ఎస్ఎన్డీపీ పనులు చేసినా కూడా సోషల్ ఆడిట్ జరగాలి.
– దొంతి నర్సింహారెడ్డి, ఎక్స్ పర్ట్