టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా జూన్ 9న దాయాది జట్లు ఇండియా, పాకిస్థాన్ న్యూయార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయనేది అందరికి తెలిసిన విషయమే. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని గత వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాయాదుల మ్యాచ్ టికెట్ ధర 1.75 లక్షల డాలర్లు (సుమారు రూ.1.4 కోట్లు)అని, దీనికి ట్యాక్స్‌లు, ఇతరత్రా ఫీజులు కలిపితే రూ.1.86 కోట్లకు చేరుతోందని ప్రచారం జరుగుతోంది. చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నా.. తీరాచూస్తే అక్కడ పూర్తిస్థాయి క్రికెట్ స్టేడియం కనిపించక అభిమానులు ఖంగు తింటున్నారు.
పూర్తి కాని నిర్మాణం
అగ్రరాజ్యం అమెరికాలో క్రికెట్ ఆడేది అంతంత మాత్రం కావడంతో అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు లేవు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ కోసం 34 వేల సామర్థ్యంతో న్యూయార్క్‌లో ప్రత్యేకంగా ఓ తాత్కాలిక స్టేడియం(నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం) నిర్మిస్తున్నారు. 8 మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. పోనీ, అదైనా పూర్తయ్యిందా..! అంటే ఇంకా సగం పనులు పూర్తి కాలేదు. స్టాండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 12,500 సామర్థ్యంతో ఈస్ట్ స్టాండ్‌ను గత నెల రోజులుగా నిర్మిస్తున్నారు. ఇక వెస్ట్, నార్త్, సౌత్ స్టాండ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో ఐసీసీకే తెలియాలి. తాజాగా, రెండు నెలల్లోనే ఎంతో పురోగతి సాధించామంటూ ఐసీసీ ఓ వీడియో పోస్ట్ చేసింది.
The #T20WorldCup 2024 fever is gripping New York 😍
— ICC (@ICC) March 5, 2024
The Nassau County International Cricket Stadium celebrates its one-month construction milestone 🏟️
Details ➡ https://t.co/ldyYDpSA5C pic.twitter.com/SSQxrPIX0o
ఐసీసీ పోస్ట్ చేసిన వీడియోలో తేదీల్లో పురోగతి ఉంది తప్ప, స్టేడియం నిర్మాణంలో అగ్రరాజ్యం మార్క్ పెద్దగా కనిపించడం లేదు. అదునాతన టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు ఉన్న అమెరికాలో మూడు నెలల్లో స్టేడియం పూర్తవ్వాలి. అలాంటిది మందకొడిగా పనులు సాగుతున్నాయి. మెగా టోర్నీ ప్రారంభానికి రెండు నెలల సమయమే ఉండడంతో స్టేడియం నిర్మాణం పూర్తవుతుందా..! అని అభిమానులు నాలుక కరుచుకుంటున్నారు.
నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం షెడ్యూల్:
- జూన్ 3: శ్రీలంక vs సౌతాఫ్రికా
- జూన్ 5: భారత్ vs ఐర్లాండ్
- జూన్ 7: నెదర్లాండ్స్ vs సౌతాఫ్రికా
- జూన్ 9: భారత్ vs పాకిస్థాన్
- జూన్ 10: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్
- జూన్ 11: పాకిస్థాన్ vs కెనడా
- జూన్ 12: అమెరికా vs భారత్