సౌదీ అరేబియాలో మంచు

 సౌదీ అరేబియాలో మంచు
  • చరిత్రలోనే తొలిసారి అల్ జాఫ్ రీజియన్​లో ఘటన 

జెడ్డా:  గల్ఫ్‌‌‌‌ దేశం సౌదీ అరేబియాలోని ఎడారిలో మంచు కురిసింది. అల్- జాఫ్ రీజియన్ లో చరిత్రలోనే తొలిసారిగా మంచు పడింది. వాస్తవానికిఈ ప్రాంతం ఏడాదంతా పొడి వాతారణంలో ఉంటుంది. ఇక్కడ వర్షాలు పడటం, మంచు కురవడం ఎన్నడూ జరగలేదు. అలాంటిది ఇక్కడ ఇప్పుడు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తేమతో కూడిన గాలి ఈ ప్రాంతంలోకి వచ్చింది. ఫలితంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

 సౌదీ అరేబియా, యూఏఈ మొత్తం ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రాబోయే రోజుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని సౌదీ వాతావరణ విభాగం హెచ్చరించింది. అందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించింది. బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.  విజిబిలిటీ తగ్గుతుందని, ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.