స్వాతంత్ర్య సంగ్రామంలో సమిధలైన వీరులెందరో!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయిన ఈ అమృతోత్సవ వేళ త్యాగమూర్తుల పోరాటాలను స్మరించుకోవడం అవసరం. వాళ్ల అపూర్వ త్యాగాలు, నిస్వార్థ సేవానిరతి ఈ జాతిని స్వేచ్ఛాకాంక్ష వైపు నడిపించాయి. విదేశాల్లో తిరుగుబాట్లు అన్నీ విధ్వంసకరంగా జరిగితే భారతీయులు తమ పోరాటాన్ని సత్యం, అహింస రూపంలో సాగించారు. మహ్మద్ బిన్ ఖాసీం తర్వాత 800 ఏళ్ల విదేశీ దురాక్రమణతో సర్వస్వం కోల్పోయిన భారతీయులకు వాస్కోడిగామా రూపంలో పోర్చుగీసులతో మరో ప్రమాదం మొదలైంది. అచిరకాలంలోనే ఆంగ్లేయుల కబంధహస్తాల్లోకి భారత్ వెళ్లింది. వ్యాపారానికి వచ్చి రాజకీయాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకొని భారత్​ను ఆక్రమించి తమది రవి అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటీషువాళ్లు చెప్పుకున్నారు. భారతీయ సాంస్కృతిక సంపదే 800 ఏండ్లపాటు దురాక్రమణ శక్తులతో పోరాడిందని గ్రహించిన బ్రిటీషువాళ్లు మెకాలే విద్యావిధానంతో ‘కూటనీతి’ని ప్రయోగించి భారతీయ ఆత్మను దెబ్బతీశారు. ఇక్కడ సంపదను ఇంగ్లాండుకు తరలించి తమకు తాము ప్రపంచ విశ్వవిజేతలుగా విర్రవీగారు.

భారతీయులు1757 నుంచి1857 మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో బ్రిటీషు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ వచ్చారు.1824లో కిట్టూరు రాణి చెన్నమ్మ సాగించిన అజరామరమైన పోరాటం ‘భారత స్వర్ణపత్రం’లో రాసుకోదగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టిన సంథాలీ తెగవారు1855లో చేసిన వీరోచిత పోరాటం విస్మృత చరిత్రలో భాగం. పంజాబ్ లో కూకాల ఉద్యమం బ్రిటీషువారి వెన్నులో వణుకు పుట్టించింది. స్వదేశీ సంస్థానాల రాజులు వారి ప్రాంతాల్లో అవిశ్రాంతంగా బ్రిటీషువాళ్లను ఎదిరించే ప్రయత్నం చేశారు. ఈ పోరాటాలను భూమికగా చేసుకొని నానాసాహెబ్, తాంతియాతోపే, ఝాన్సీ లక్ష్మీబాయిలు ‘1857’ తిరుగుబాటును ముందుండి నడిపించారు. బ్రిటీషర్స్ ఈ తిరుగుబాటును ‘సిపాయిల తిరుగుబాటు’గా వర్ణించి పలుచన చేశారు. వీరసావర్కర్ రంగప్రవేశం చేసి ఇదే ప్రథమ స్వాతంత్ర్య పోరాటం అని సిద్ధాంతీకరించే వరకు, దాన్ని పుస్తక రూపంలో తెచ్చే వరకు మనకు తెలియదు. మనదేశపు ముడిపదార్థాలను బ్రిటన్‌‌కు తరలించి అక్కడ తయారు చేసిన వస్తువులను తిరిగి మన మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవటం దేశ ప్రజలను ఆలోచింపజేసింది. ఈస్టిండియా కంపెనీ అధికారులు ప్రజల రోజువారీ జీవితంపై పెత్తనం చేస్తే, వాళ్లు అవలంబించిన ఆర్థిక దృక్పథం ఇక్కడి రైతులను కూలీలుగా మార్చింది. దేశసంపద బ్రిటన్‌‌కు తరలిపోయింది. 

హైదరాబాద్​లోనూ పోరాటం

మీరట్ లో1857 మే10న ప్రారంభమైన సైనిక తిరుగుబాటు దేశ ప్రజల్ని మేల్కొల్పింది. అనేకచోట్ల బ్రిటీషువారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. హైదరాబాద్ లో కూడా జరిగాయి. కానీ..1860లో నిజాం నవాబు బ్రిటీషువారితో ఒడంబడిక చేసుకొని బ్రిటీషు విశ్వాసపాత్రుడిగా పేరుపొందాడు. వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా1846లో కర్నూల్ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హైదరాబాద్ రెసిడెన్సీపై దాడిచేసిన రోహిల్లా తుర్రేబాజ్ ఖాన్ అమరులయ్యారు. 1857 తిరుగుబాటు రుచి చూసిన బ్రిటీషువారు తమ కుయుక్తులతో సిక్కులను పోరాటం నుంచి పక్కకు తప్పించేందుకు అర్థా మెకాఫ్ భాయి కన్నాసింగ్ నాభాను, ముస్లింలను ప్రధాన స్రవంతి నుంచి వేరు చేసేందుకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్​ను వాడుకున్నారు. మిగతా వాళ్లను తమ వైపు లాగేందుకే సర్ హ్యూమ్ తో కాంగ్రెస్ ను స్థాపించారని ఇటీవల పరిశోధనలు నిరూపించాయి. కానీ కాంగ్రెస్ స్వాతంత్ర్య కాంక్షాపరుల వేదికగా మారింది. ఈలోపు బ్రిటీషు ప్రభుత్వం బెంగాల్​ను విభజించి స్వాతంత్ర్య పోరాటాన్ని పలుచన చేయాలనుకుంది. వందేమాతరం ఉద్యమం జ్వలిత చేతనగా వచ్చింది. తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్నాడు. బ్రిటీషు ప్రభుత్వం తిలక్​ను మాండలే జైలుకు పంపింది. లాలాలజపతిరాయ్ కి ద్వీపాంతర కారాగారవాస శిక్ష విధించింది. ఈ అకృత్యాలను బిపిన్​చంద్రపాల్, అరవింద ఘోష్ తీవ్రంగా ప్రతిఘటించారు. 

గాంధీజీ రాకతో..

1911లో బెంగాల్ విభజన రద్దు చేసి రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. 1914లో గదర్​పార్టీ వీరులు, హిందూస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ యోధులు లాలాహరదయాళ్, కర్తార్ సింగ్, భగత్ సింగ్ వంటివారు, మహేంద్రప్రతాప్ వంటి వాళ్లు బ్రిటీషువారిపై గెరిల్లా పోరాటం చేశారు. అలాంటి స్ఫూర్తితోనే అల్లూరి సీతారామరాజు, ఆష్ఫాఖుల్లాఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, సర్దార్ ఉద్ఘాంసింగ్, చంద్రశేఖర్ ఆజాద్, పృథ్వీసింగ్ ఆజాద్, సుఖదేవ్, రాజగురు వంటి యోధానయోధులు తమ ప్రాణాలను గడ్డి పరకల్లా విసిరేశారు. ఇదంతా దేశంలో గొప్ప స్ఫూర్తిని నింపింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత గాంధీజీ భారతస్వాతంత్ర్య పోరాటంలోకి అడుగుపెట్టారు. అహింస, సత్యం ఆధారంగా హిందూ, జైనమతాల్లోని విలువలను ఆచరణలో పెడుతూ చేసిన శాంతియుత పోరాటం అనన్య సామాన్యం. గాంధీ తలపెట్టిన సత్యాగ్రహం, దండియాత్ర, సహాయ నిరాకరణోద్యమం, ఉపవాస దీక్షలు, ప్రజల్లో సరికొత్త చైతన్యాన్ని రేకెత్తించాయి. మరోవైపు బాబూ రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ గోఖలే, సి.రాజగోపాలాచారి, జవహార్ లాల్ నెహ్రూ వంటి వారు గాంధీజీకి అండగా నిలిచారు. ‘మీ రక్తాన్ని నాకివ్వండి మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అని నినదిస్తూ సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ నిర్మాణం చేశాడు. డా. బి.ఆర్.అంబేద్కర్ తన అపారమైన మేధస్సుతో అనేక చర్చలు చేసి, రచనల ద్వారా ‘భారత సామాజిక సమానత్వం’ కోసం దారులు ఏర్పరిచారు. సర్దార్ పటేల్ వంటి ధీశాలి భారతదేశాన్ని ‘అఖండం’గా ఉంచే ప్రయత్నం చేశారు. ఇలా తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష నింపుకున్న భారతీయ జనమానస హృదయం గ్రహించిన బ్రిటీషువాళ్లు మూటాముల్లే సర్దుకోక తప్పలేదు.

దేశభక్తిని చాటుదాం..

బ్రిటీష్​వారు పోతూ పోతూ దేశవిభజన శక్తులకు లొంగిపోయి శాశ్వత ద్రోహం చేశారు. అదే పాకిస్థాన్ విభజన. జిన్నాలాంటి ఉన్మాది కోరికలను స్వాగతించి10 లక్షల మంది నిరాశ్రయు లయ్యేందుకు, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు. ప్రాచీన భారత నాగరికతను ప్రతిబింబించే ‘సింధు’ ప్రాంతం మన నుంచి దూరమైంది. దేశవిభజన ఫలితాలు ఈనాటికీ భారత్ అనుభవిస్తూనే ఉంది. అవశేషంగా మిగిలిన కశ్మీర్ సమస్య రావణకాష్టంగా రగిలింది.  నిజాం స్టేట్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రజాకర్లతో కలిసి చేసిన కుట్ర ఇక్కడి మానప్రాణాలు హరించింది. 15 ఆగస్టు 1947న భారతదేశం స్వాతంత్ర్యం పొందినా తెలంగాణ విమోచనకు మరో 13 నెలలు ఆగాల్సి వచ్చింది. లేదంటే ఇక్కడ ‘దక్కన్ పాకిస్తాన్’ ఏర్పడేది. ఇదంతా ఎందరో త్యాగమూర్తుల పోరాట గాథ. అలాంటి వీరుల త్యాగాలను స్మరించి తరించేందుకు ఇప్పుడు భారతదేశం 75 సంవత్సరాల ‘స్వాతంత్ర్య అమృతోత్సవాలు’ జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఎగరేసి మన దేశభక్తిని చాటుదాం. ఒకదేశ గర్వం ఆ దేశపు జెండాలో ఉంటుందని అంటారు. అలాంటి మువ్వన్నెల జెండాను మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించడం మనకు మరింత గర్వకారణం.

- డా. కె. లక్ష్మణ్,

 రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షులు