- వేల స్కూళ్లలో నో టాయిలెట్స్
- సైట్‌లో వివరాలుంచిన విద్యాశాఖ
- సాయం చేయాలని దాతలకు పిలుపు
- ప్రైవేట్ స్కూళ్ల వివరాలు ఉంచడంపై విమర్శలు
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లే కాదు.. ప్రైవేట్ స్కూళ్లలోనూ వసతులు అంతంత మాత్రమేనని తేల్చింది ఈ డేటా. రంగురంగుల బిల్డింగ్స్, మాయ చేసే రిసెప్షన్ చూసి పిల్లల్ని చేర్చించే పేరెంట్స్‌కు ఈ వివరాలు షాక్‌కు గురిచేసేవే. స్వయంగా స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ https://csredu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఏఏ స్కూల్‌కు ఏం కావాలనే వివరాలను ఉంచింది. దాతలు ఆయా స్కూళ్లను ఎంచుకుని సాయం చేసే అవకాశాన్ని ఈ సైట్‌లో కల్పించారు. విరాళాలిచ్చే దాతల్ని తప్పుదోవ పట్టించేలా ఇందులో గవర్నమెంట్ స్కూళ్లతోపాటు ప్రైవేట్ స్కూళ్లనూ ఉంచారనే విమర్శలొస్తున్నాయి. ఇక విద్యాశాఖ ఇచ్చిన ఈ వివరాలతో ప్రైవేట్ స్కూళ్లలో సౌకర్యాల లేమి, డొల్లతనం మరోసారి బయటపడింది.
సమస్యల్లో సర్కారుకు దీటుగా ప్రైవేట్
రాష్ట్రంలో 42,000 స్కూళ్లున్నాయి. వీటిలో 12,000 ప్రైవేట్ స్కూళ్లు. మిగిలినవన్నీ గవర్నమెంట్‌వి. ఈ స్కూళ్లకు డొనేషన్స్ సేకరించే క్రమంలో ఏఏ బడులో ఏఏ సమస్య ఉందో అధికారులు ప్రకటించారు. స్టేట్‌లో మొత్తం 28,825 స్కూల్స్‌కు బిల్డింగ్స్ అవసరమని పేర్కొన్నారు. వీటిలో సర్కారు బడులకు దీటుగా ప్రైవేట్‌స్కూళ్లు ఉండడం గమనార్హం. ఈ డేటా ప్రకారం దాదాపు 70 శాతం ప్రైవేట్ స్కూళ్లు అద్దె భవనాల్లో, అరకొర వసతుల మధ్య ఉన్నాయని, చాలా స్కూళ్లు శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్‌లో కొనసాగుతున్నాయి. కొన్నింటికి పక్కా బిల్డింగ్స్ ఉన్నా వాటిలో సరిపడ గదుల్లేవు.
ప్రైవేట్ స్కూళ్ల వివరాలు ఎందుకుంచారు?
బడుల బలోపేతం కోసం విరాళాల సేకరణ మంచి అంశమే అయినా వెబ్‌సైట్‌లో ప్రైవేట్ బడుల వివరాలూ ఉంచడంపై విమర్శలొస్తున్నాయి. కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతూ ఒకటి, రెండు సెక్షన్స్‌తో నడుస్తున్న ఎయిడెడ్ స్కూల్స్ వివరాలనూ వెబ్‌సైట్‌లో పెట్టడంపై స్టూడెంట్స్, టీచర్స్ యూనియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే వాటిని వెబ్‌సైట్ నుంచి తొలగించి, కేవలం గవర్నమెంట్ స్కూళ్ల వివరాలే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
స్కూళ్ల కోసం డొనేషన్స్ ఇవ్వండి
సర్కారు బడుల బలోపేతం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్) విధానాన్ని తీసుకొచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్. దీనికోసం ప్రత్యేకంగా డోనర్ కార్నర్ పేరుతో రూపొందించిన వెబ్ పోర్టల్‌ను ఇటీవల ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. దీంట్లో డబ్బు, వస్తు రూపంలోనూ డొనేషన్స్ ఇవ్వొచ్చు. బిల్డింగ్స్, సైన్స్ ల్యాబ్స్, టాయ్‌లెట్స్, కిచెన్‌షెడ్స్, డ్రింకింగ్ వాటర్, ప్రహరీగోడ, అడిషనల్ క్లాస్ రూమ్స్, ఎలక్ట్రిసిటీ, బెంచీలు… ఇలా ఏఏ స్కూల్‌కు ఏం అవసరం అనే అన్ని వివరాలను (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర మేనేజ్మెంట్లకు సంబంధించి అన్నింటిని) వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
క్లాస్ రూమ్స్ కావాలి
గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం13,675 అదనపు క్లాస్ రూమ్స్ అవసరమని ఆఫీసర్స్ గుర్తించారు. ప్రైమరీ స్కూల్స్‌లో ఐదో తరగతి వరకూ కొనసాగుతున్నా.. ఒకటి, రెండు గదుల్లోనే క్లాసులు జరుగుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లలోనూ ల్యాబ్స్ లేవ్
36,200 స్కూళ్లలో సైన్స్ ల్యాబ్స్ అవసరమని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. చాలా ప్రైవేట్ స్కూళ్లలో ల్యాబ్స్ లేకుండానే ప్రాక్టికల్స్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
బడి చుట్టూ గోడలుండాలిగా..
కాంపౌండ్ వాల్ లేని స్కూళ్లు 11,573. ర్యాంప్స్ అండ్ హ్యాండ్‌రెయిన్స్ 25,734 బడుల్లో అవసరం. కరెంట్, వాటర్ కనెక్షన్స్, త్రిఫేజ్ పవర్ లేని స్కూళ్లు 3,787.
అగ్గి పడితే ఎలా?
28,825 స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ పరికరాల్లేవని అధికారులు లెక్క తేల్చారు. పట్టణాల్లోని ఇరుకు బిల్డింగ్స్‌లో, జిల్లాలు, మండల కేంద్రాల్లో కొనసాగుతున్న చాలా ప్రైవేట్ స్కూళ్లలో ఈ పరిస్థితి ఉంది.
నో డ్రింకింగ్ వాటర్
రాష్ట్రంలో డ్రింకింగ్ వాటర్ లేని స్కూళ్లు 2,795. కొన్ని చోట్ల నల్లాలు, పంపులున్నా అవి తాగేందుకు పనికిరావని తేలింది. ఆయా స్కూళ్లకు మొత్తంగా 33,130 వాటర్ ఫిల్టర్స్ అవసరమని తేల్చారు.
టాయ్‌లెట్సూ లేవంట
సర్కారు బడుల కంటే ఎక్కువ ప్రైవేట్ స్కూళ్లలోనే టాయ్‌లెట్స్ లేవని తెలుస్తోంది. మొత్తం 11,451 బాయ్స్ టాయ్‌లెట్స్, 6,434 బాలికల టాయ్‌లెట్స్ అవసరమని తేల్చారు. అయితే ప్రస్తుతమున్న వాటిల్లోనూ వాటర్ సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి.