బయో వెపన్ నుంచి లీకైందన్న ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారి
కెనడా ల్యాబ్ నుంచి చైనా సైంటిస్టులే పంపించారన్నది మరో వాదన
కొట్టి పారేసిన అధికారులు
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కొత్త కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ వైరస్ తమ తమ దేశాల్లోకి రాకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం ఆ వైరస్ ఎట్లా సోకిందన్న దానిపై కథలు అల్లేస్తున్నారు. ఇంటర్నేషనల్ వార్తా సంస్థల నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకు రకరకాల స్టోరీలను వండేస్తున్నారు. ఏంటా కథలు..?
బయో వెపన్ నుంచి లీక్
ఎక్కువ సంచలనమవుతున్న విషయం ఇదే. దానికీ కారణం లేకపోలేదు. ఓ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్లో ఆ వార్త వచ్చింది మరి. వుహాన్‌లోని మిస్టరీ ల్యాబ్‌లో తయారు చేస్తున్న బయో వెపన్ నుంచే ఆ వైరస్ లీకైందని ఓ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ అధికారి అన్నట్టు ఆ పేపర్ వార్త రాసింది. ఆ మిస్టరీ ల్యాబ్ వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీనేనని ఆ అధికారి చెప్పినట్టు వెల్లడించింది. అంతేకాదు, ఈ బయోవెపన్ థియరీని చెప్పిన ఆ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వైరస్ స్టడీస్‌లో ఎక్స్పర్ట్ అట. చైనా ఆర్మీ కోసం వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఓ బయోవెపన్‌ను తయారు చేస్తోందని, అక్కడి నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందని ఆ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, హెల్త్ అధికారులు మాత్రం ఆ వాదనలను కొట్టిపారేస్తున్నారు. వైల్డ్‌లైఫ్ మార్కెట్ నుంచే అది పాకిందంటున్నారు.
కెనడా–గూఢచర్యం
పోయినేడాది కెనడాలోని విన్నిపెగ్‌లో ఉన్న నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఇద్దరు చైనా సైంటిస్టులను (భార్యభర్తలు) ల్యాబ్ తీసేసింది. ల్యాబ్ పాలసీలను తుంగలో తొక్కారన్న కారణంతో వారిద్దరితో పాటు స్టూడెంట్లను తొలగించింది. దీంతో ఆ ఇద్దరు సైంటిస్టులే వుహాన్‌లోని ల్యాబ్‌కు కరోనా వైరస్‌ను పంపించారని, ఆ ల్యాబ్ నుంచి అది బయటకు పాకిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయింది. అయితే, కెనడా ప్రభుత్వం ఆ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.
మందుల కోణం
ఇంగ్లాండ్‌లోని పిర్‌బ్రైట్ ఇనిస్టిట్యూట్ అనే వర్సిటీ కరోనా వైరస్‌కు మందును తయారు చేసి 2015లో పేటెంట్‌కు అప్లై చేసుకుందని కొందరు వాదిస్తున్నారు. సొంత లాభం కోసమే కొన్ని ఫార్మా కంపెనీలు కావాలని ఆ వైరస్‌ను బయటకు లీక్ చేశాయని ఆరోపణలు చేశారు. అంతేకాదు, వ్యాక్సిన్ డెవలప్మెంట్, పిర్‌బ్రైట్ ఇనిస్టిట్యూట్‌కు నిధులు ఇస్తున్న బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కూ లింకు పెట్టారు.
గబ్బిలం సూప్ నుంచా?
ఇక, చాలా మందైతే చైనా వాళ్లు తినే తిండి వల్లే వైరస్ వ్యాపించిందని పుకార్లు పుట్టించారు. ఓ మహిళ గబ్బిలం సూప్ తాగుతున్న వీడియోను పెట్టి చైనా వాళ్ల తిండి అలవాట్లను ప్రస్తావించారు. అయితే, అధికారులు ఆ ఆరోపణలనూ కొట్టిపారేశారు. ఆ వీడియో గురించి ఆరా తీయగా ఎప్పుడో 2016లో వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లోని పలావ్లో తీసిందని తేలింది.
చైనా అనుకున్న దానికన్నా ఎక్కువా?
వుహాన్‌లోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు పేరిట ఓ వీడియో వైరల్ అవుతోంది. దాదాపు 90 వేల మంది దాకా ఆ వైరస్ బారిన పడ్డారని ఆ వీడియోలో ‘వుహాన్ నర్స్’ చెప్పింది. అయితే, సిటీని పూర్తిగా మూసేయడంతో ఆ వీడియోలో నిజమెంతన్నది అధికారులూ చెప్పలేకపోతున్నారు. కానీ, డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ఆర్0 (వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే నంబర్) పోలిస్తే ఆ నర్సు చెబుతున్న కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ఆర్0 కేసులు 1.4 నుంచి 2.5 రెట్లుండే అవకాశం ఉంది. నర్సు చెప్పిన కేసులంటే ఆ విలువ 14 నుంచి15 దాకా వెళుతుందని అధికారులంటున్నారు.
For More News..