‘కాఫీడే’ సిద్ధార్థ ఆత్మహత్య..ఎన్నోప్రశ్నలు

కెఫె కాఫీ డే ఫౌండర్​ సిద్ధార్థ సూసైడ్​… కార్పొరేట్‌‌ సర్కిల్స్‌‌ను కుదిపేస్తోంది. భారీగా పేరుకుపోయిన అప్పులు.. ఐటీ ఆఫీసర్ల నుంచి వేధింపులు.. అప్పులిచ్చిన సంస్థల నుంచి ఒత్తిళ్లు.. ఇలా ఆయన ఆత్మహత్యకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్‌‌ ప్రపంచంలో వివిధ కారణాలతో సీఈఓలు ఎప్పుడూ సుఖంగా ఉండని మాట నిజమే. అయితే, అన్ని కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి ఉందా?. సిద్ధార్థ సూసైడ్​కి దారి తీసిన కారణాలను ఓవర్‌‌ సింప్లిఫై చేసి చెప్పటం  కరెక్టేనా అని కొందరు ఎనలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

సిద్ధార్థ కేసులో కనిపిస్తున్న కారణాలు కొన్నే. కనిపించనివి చాలానే ఉన్నాయి. ఆయన బిజినెస్‌‌మ్యాన్‌‌ మాత్రమే కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి అల్లుడు. మరో పొలిటికల్‌‌ లీడర్‌‌కి సన్నిహితుడు. అయినా ఆయన ఎక్కడా రాజకీయ నాయకులతో క్లోజ్​గా ఉన్న జాడల్లేవు. ఐటీ దాడుల్లో దొరికిన కొన్ని లావాదేవీల వివరాలు, లెక్కచూపని రూ.650 కోట్లు ఐటీ ఆఫీసర్లతో ఆయనకు గ్యాప్‌‌ పెంచాయి. ‘మైండ్‌‌ ట్రీ’లో తన వాటాలను సిద్ధార్థ రూ.3000 కోట్లకు అమ్మినప్పుడు ఆ డీల్‌‌కు ఐటీవాళ్లు అడ్డుపడ్డ మాట నిజమే అయినా అది తాత్కాలికమే.

తర్వాత కాఫీ డేలో ఆయన షేర్లను స్వాధీనం చేసుకొని మైండ్‌‌ ట్రీ షేర్లను రిలీజ్‌‌ చేశారు. దేశంలోని వ్యాపారులు తమ సక్సెస్‌‌ రేట్​ను అంతకంతకూ పెంచుకోవాలనే తపనలో వెనకాముందు చూడకుండా దూకుడుగా పోతుంటారు. అతివిశ్వాసమే దానికి కారణం. వ్యాపార విస్తరణకు అప్పులు చేస్తుంటారు. అప్పు చేయడం తప్పు కాదు. అయితే దూకుడుగా బిజినెస్‌‌ను విస్తరించే జోష్​లో కొందరు ఇండస్ట్రియలిస్టులు ఏ రేటుకు అప్పు చేస్తున్నాం?.. ఎంత చేస్తున్నాం?.. బిజినెస్‌‌ అవసరాలకు కావాల్సింది ఎంత?.. లాంటి ప్రశ్నలను పట్టించుకోరు.

సిద్ధార్థ కూడా బిజినెస్​ను విస్తరించేందుకు భారీగా అప్పులు చేశారు. అవి గత రెండేళ్లలో రూ.11,000 కోట్లకు చేరాయని అంటున్నారు. ఇందులో సిద్ధార్థ పర్సనల్​గా తీసుకున్నవి, ఆయన ప్రమోట్​ చేసిన కంపెనీలు తీసుకున్నవి, ఆయన గ్యారంటీ ఇచ్చినవీ ఉన్నాయి. వీటిలో షార్ట్‌‌ టర్మ్‌‌ లోన్స్‌‌ ఎక్కువగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడి సంస్థలు, దేశీయ ఫైనాన్షియల్‌‌ కంపెనీలు సర్కారు బ్యాంకుల దగ్గర తక్కువ వడ్డీకి అప్పులు తీసుకొని అదే సొమ్మును చాలా ఎక్కువ వడ్డీకి అవసరాల్లో ఉన్న కార్పొరేట్‌‌ సంస్థలకు షార్ట్‌‌ టర్మ్‌‌ లోన్స్‌‌ కింద ఇస్తుంటాయ్‌‌.

ఈ రకమైన అప్పుల్లో సాధారణంగా షేర్లను తాకట్టు పెట్టుకుంటారు. ఆ షేర్ల ధర నిలకడగా ఉంటే సరే సరి. లేకపోతే అప్పులిచ్చిన సంస్థలు ఊరుకోవు. లోన్లు తీర్చేయాలని లేదా కొల్లాటరల్‌‌ గ్యారంటీ కింద కొత్త అసెట్స్‌‌ను తేవాలని ఒత్తిడి చేస్తాయి. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పుడు అసెట్స్‌‌ విలువ ఎంత?.. అప్పులు ఏ స్థాయిలో చేస్తున్నాం?.. అనే లెక్కలు లేకపోవడం వల్ల క్యాష్‌‌ ఫ్లో సమస్యలు తలెత్తినప్పుడు ఇబ్బందుల్లో పడుతుంటారు. పైగా ఒక బిజినెస్‌‌లో సక్సెస్‌‌ అయినవాళ్లు అదే బిజినెస్‌‌ మీద గురిపెట్టరు.

మంచి లాభాలొస్తాయనే నమ్మకం ఉంటే తమకు సంబంధంలేని వ్యాపారాల్లోకి కూడా అడుగుపెడుతుంటారు. సిద్ధార్థ కూడా రియల్‌‌ ఎస్టేట్‌‌, లాజిస్టిక్స్‌‌ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. మైండ్‌‌ ట్రీ వంటి ఐటీ సంస్థలో షేర్లు తీసుకున్నారు. నిజానికి ఆయన అసెట్స్‌‌ విలువ అప్పుల కంటే చాలా ఎక్కువ. అయితే అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆస్తులను అమ్మాలంటే అన్ని సార్లూ సాధ్యం కాదు. పైగా అనుకున్న విలువ కూడా రాకపోవచ్చు. సిద్ధార్థ విషయంలోనూ అదే జరిగింది.

ఆయన ఈ పరిస్థితి నుంచి బయటకొచ్చేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధార్థ వ్యవహారం కేవలం బిజినెస్‌‌కే పరిమితమైతే ఆయన ఆస్తులను అమ్మి జాగ్రత్తగా బయటపడే వీలు ఉన్నట్లు అనిపిస్తోంది. మహా అయితే అప్పుల భారం ఇంకొంచెం పెరిగేదేమో. కానీ ఆ వెసులుబాటును ఆయన వాడుకోలేదు. తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నారు. బహుశ బిజినెస్​కు సంబంధం లేని బలమైన కారణాలేమైనా ఉండొచ్చు. సిద్ధార్థ సూసైడ్​కి దారితీసిన కారణాలపై ఎవరి డౌట్లు వారికి ఉండొచ్చు. ఆయన విషయంలో ఈ వ్యవస్థ తప్పు కూడా ఉండి ఉండొచ్చు.

కానీ దీన్ని ఉదాహరణగా చూపిస్తూ టాప్‌‌ బిజినెస్‌‌మెన్‌‌ అనుకుంటున్నవాళ్లు, మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థిస్తూ వచ్చినవాళ్లు ఇప్పుడు పన్నుల వ్యవస్థను, ఆడిటర్లపై ప్రభుత్వం విధించిన కఠినమైన రూల్స్‌‌ను తప్పుపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ​ విజయ్‌‌ మాల్యా సైతంవ్యవస్థను తప్పు పడుతూ ఒక ప్రకటన చేశారు.  నిజానికి ఆయన ఈ వ్యవస్థకు ఆవతలి వ్యక్తి కాదు. అప్పట్లో ఆయన ఒక ఎంపీ. సిద్ధార్థ కూడా గొప్ప ఫ్యామిలీ బ్యాక్‌‌గ్రౌండ్‌‌ నుంచే వచ్చారు. ఆయన మరణం విషాదకరమే. అలా జరిగి ఉండాల్సింది కాదు. అయితే, ఆయన్ని ఈ వ్యవస్థకు బయటి వ్యక్తిగా, వ్యవస్థ బలితీసుకున్న వ్యక్తిగా మాత్రం చూడలేం.

పాలసీల తయారీలో కార్పొరేట్‌‌ రంగ ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తుంటారు. వారిలో అనేక మంది చట్ట సభల్లో సభ్యులు కూడా. తమనే బలితీసుకునే వ్యవస్థను వాళ్లు తయారుచేస్తారా?. ఒక వేళ వాళ్లే సిస్టమ్‌‌కు బాధితులంటే ఇక లక్షల మంది సామాన్య వ్యాపారులను ఏమనాలి?. చిరు వ్యాపారుల విషయంలో మునిసిపల్‌‌ ఆఫీసర్లు, పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు వారిపై మరింత ఒత్తిడి తెస్తాయి. ఏ వైపు నుంచి వారికి అండ ఉండదు. మరి వాళ్లు ఏ సిస్ట​మ్‌‌ను తప్పు పట్టాలి?. సిద్ధార్థ మరణంపై జరుగుతున్న చర్చ ఇలా అనేక కొత్త  ప్రశ్నలకు తావిచ్చింది.

– మల్యాల మారుతిరావ్‌‌

సిద్ధార్థ మరణం విషాదకరమే.

అలా జరిగి ఉండాల్సింది కాదు. అయితే, ఆయన్ని ఈ వ్యవస్థకు బయటి వ్యక్తిగా, వ్యవస్థ బలితీసుకున్న వ్యక్తిగా మాత్రం చూడలేం.   పాలసీల తయారీలో కార్పొరేట్‌ రంగ ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తుంటారు. వారిలో అనేక మంది చట్ట సభల్లో సభ్యులు కూడా. తమనే బలితీసుకునే వ్యవస్థను వాళ్లు తయారుచేస్తారా?. ఒక వేళ వాళ్లే సిస్టమ్‌కు బాధితులంటే ఇక లక్షల మంది సామాన్య వ్యాపారులను ఏమనాలి?.