మన వేప చెట్టును కాపాడుకుందాం..

మన నేలపైనే పుట్టే అరుదైన చెట్టు వేప. ఈ చెట్టు ప్రతి భాగం మానవాళికి ఏదో రకంగా ఉపయోగపడుతోంది. గత రెండు మూడు ఏండ్లుగా వేపచెట్లు విపరీతంగా ఎండిపోవడమో లేక కూలిపోవడమో జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఇటీవల ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీనికి కారణమైన తెగులును అడ్డుకుని వేప చెట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పండుగల్లో తెలుగువారికి ముఖ్యమైంది ఉగాది. నూతన సంవత్సరాదిగా పిలుచుకునే ఉగాది పర్వదినం రోజున అందరూ సుఖసంతోషాలతో ఉండాలని షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుని తినే ఆచారం ఉంది. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు ఇలా ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడి చేయడం ఆనవాయితీ. అయితే ఇది మనం ఒక రకంగా పర్యావరణానికి ఇచ్చే గౌరవమే. ఇందులో వాడే ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుంచి వచ్చినవే. కానీ ఇందులో చేదును ఇచ్చే వేప చెట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. అజారహ్ ఇండికా శాస్త్రీయ నామంతో పిలిచే వేప చెట్టును పురాణాల్లో లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు. 

ఈ నేలపైనే పుట్టే చెట్టు..
కేవలం మన నేలపైనే పుట్టే అత్యంత వైవిధ్యమైన చెట్టు వేప. వేప ఆకుల్లో  సుమారు150 రకాల విశిష్టమైన రసాయనాలు ఉంటాయి. పురాతన కాలం నుంచి వేపను ఎన్నో అవసరాలకు, చికిత్సలకు వాడుతున్నారు. మానవాళికి వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. చెట్టు వేర్ల నుంచి చిగుళ్లు వరకు అంతా ఆరోగ్య ప్రదాయినే. వేప ఆకులు, వేప కాయలు, నూనె, కొమ్మలు, వేర్లు ఇలా వేప చెట్టులోని అన్నీ పనికొచ్చేవే. తరతరాలుగా ఉన్న ఆయుర్వేద వైద్యంలో వేపకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చర్మవాధులు, ముఖసౌందర్యం, పేగుల్లో పురుగులు నశించడానికి, మొలలు, దురదలు, దద్దుర్లు, పచ్చకామెర్లు, అల్సర్లు, అతిమూత్ర వ్యాధి, తామర, కుష్టు, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు, జ్వరం, మలేరియా, రక్త సంబంధ వ్యాధులకు వేప ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తుంది. మనదేశంలో ఇప్పటికీ పల్లెల్లో పళ్లు తోముకోవడం కోసం వేప పుల్లను ఉపయోగించడం పరిపాటి.  వేప చెట్టు లేత చిగుళ్లను చిన్న గుళికగా చేసి దానికి చిన్న పసుపు గుళికను కలిపి గోరువెచ్చటి నీటితో తీసుకుంటే అన్నవాహిక శుభ్రపడుతుంది. అలాగే రక్తంలో ఉన్న మలినాలను కూడా వేప శుభ్రపరుస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వేప చెట్టును ఇప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండు మూడు సంవత్సరాలుగా వేపచెట్లు విపరీతంగా ఎండిపోవడమో లేక కూలిపోవడమో జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఇటీవల ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.

లొరాంథస్​ సమస్యతో..
వేప చెట్టు చిగుళ్లు ఎండిపోతున్నాయి. మూడు నాలుగు సంవత్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్ లో ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు జీహెచ్ ఎంసీ జీవవైవిధ్య విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. బాగా ఎదిగిన వేపచెట్లపై ‘లొరాంథస్’ అనే పరాన్న మొక్క ఎదగడమే ఇందుకు కారణమని సైంటిస్టులు గుర్తించారు. లొరాంథసస్​ను మిన్లెటో అని కూడా వ్యవహరిస్తారు. భారీగా ఎదిగిన వేప చెట్లను ఆసరా చేసుకుని ఎదిగే ఈ లొరాంథస్ వేప చెట్టులో ఉండే నీటితో పాటు లవణాలు, పోషకాలు తదితరమైన వాటిని పీల్చుకొని అన్ని భాగాలను ఎండిపోయేలా చేస్తుంది. దాంతో చెట్టు కూలిపోతుంది. అంతేకాకుండా లొరాంథస్ వ్యాపించడంతో వేప చెట్టుకు తగిన సూర్యరశ్మి సోకదు. అయితే వేపచెట్లపై ఈ లొరాంథస్ ను గుర్తించిన వెంటనే, చెట్టును మొత్తం కొట్టేయకుండా, సదరు కొమ్మను నరికివేయడం ద్వారా మిగతా శాఖలకు వ్యాపించకుండా కాపాడవచ్చని అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. 

కొన్ని నెలల నుంచి మళ్లీ సమస్య..
ఇటీవల కొద్ది నెలలుగా మళ్లీ వేప చెట్లకు గత పరిస్థితే వచ్చింది. దీనిపై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఎప్పుడో 1980లలో ఉత్తరాఖండ్​లో సోకిన ఈ వ్యాధికి ‘డిపాక్ డిసీజ్ ఆఫ్ నీమ్’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా చెట్టు కొసల నుంచి కాండానికి సోకుతున్న ఫామాక్సిస్ ఆర్టికా వ్యాధి గాలి ద్వారా, కీటకాల ద్వారా సోకుతున్నట్లు సైంటిస్టులు గ్రహించారు. వేప చెట్లను ఈ వైరస్ బారి నుంచి కాపాడాలంటే వైరస్ సోకిన కొమ్మలను కత్తరించి కాల్చేయాలి. అలాగే చెట్టుకు ఎక్కువ నీరు పోయడం వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గోరింటాకును కలిపిన నీటిని చెట్టుకు పోయడం లేదా వైరస్ సోకిన ప్రాంతంలో ఈ నీటిని పూయడం ద్వారా వైరస్ ను తగ్గించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణాలే కాకుండా మరిన్ని కారణాలు కూడా వేప చెట్టు పాలిట శత్రువులవుతున్నాయి. ముఖ్యంగా నగరీకరణలో కాంక్రీట్ నిర్మాణాల వల్ల చెట్టు వేర్లకు అందాల్సిన నీరు, పోషకాలు తగినంత అందడం లేదు. దీని వల్ల కూడా చెట్లు క్రమంగా అంతరిస్తున్నాయి. గృహ నిర్మాణాల సమయాల్లో, విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని ఒకవైపు చెట్టు కొమ్మలను నరికేయడం వల్ల భారమంతా ఒకేవైపు పడి అవి నేలకూలుతున్నాయి.

వేపపువ్వు తినొచ్చు..
గత ఆరు నెలలుగా వేపచెట్లు తెగుళ్ల బారిన పడి ఎండిపోవడం వల్ల.. వేపపూతను ఈసారి తినాలా వద్దా అని కొందరు సందేహిస్తున్నారు. అయితే ఉగాది పచ్చడిలో వేపపూతను కలిపి నిరభ్యంతరంగా తినొచ్చని పలువురు సైంటిస్టులు స్పష్టం చేశారు. వేప చెట్టుకు వచ్చిన తెగులు తాత్కాలికమేనని, పూతలో వైరస్​ ఏమీ ఉండదని చెబుతున్నారు.

మానవాళికి సంపద..
ఒక వేపచెట్టు తన జీవితకాలంలో యాభై వేల నుంచి దాదాపు ఏడు లక్షల రూపాయల విలువైన సంపదను మానవాళికి ఇస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా పేటెంట్ కోసం ఎంతో తాపత్రయపడింది. అటువంటి విశిష్టమైన వేప చెట్టును మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నం. మానవాళికి ఎన్నో సేవలు అందించే ఈ వేప చెట్టు భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన సంపద. ఈ సంపదను కాపాడుకునే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకూడదు. మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఇతర మొక్కల స్థానంలో వేప మొక్కలకు అధిక ప్రాధాన్యమిచ్చి నాటించే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా వేప చెట్ల సంరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. లేకుంటే ఎంతో విలువైన ‘వేప చేదులోని తియ్యదనాన్ని’ భావి తరాలకు అందించడంలో ఓడిపోయిన వారిగా మనం నిలబడాల్సి వస్తుంది. అలా జరిగితే పర్యావరణానికి, ప్రకృతికి మానవాళి పెట్టే మరో గొడ్డలి కాటు ఇదే అవుతుంది. ఈ ఉగాది నుంచి వేప చెట్టు ప్రాముఖ్యతను తెలుసుకొని కాపాడుకోవడంలో చేయిచేయి కలుపుదాం.. ఆనందకరమైన ఉగాది కోసం వేప పూతను అందుకుందాం.
- మోతె రవికాంత్ వ్యవస్థాపక అధ్యక్షులు-సెఫ్