సబ్బుల, షాంపూల ధరలు 20 శాతం పెరిగే అవకాశం

న్యూఢిల్లీ: ఇది వరకే ఒకసారి ధరలను పెంచిన సబ్బు, పేస్టులు, షాంపూల తయారీ కంపెనీలు (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్  ) మరోసారి రేట్లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. ఇన్​ఫ్లేషన్​ను తట్టుకోవడానికే ఇలా చేయాల్సి వస్తోందని అంటున్నాయి. సబ్బులు, డిటర్జెంట్,  ఇతర  వస్తువుల ధరలను 20 శాతం వరకు పెంచుతున్నట్లు జనవరిలోనే హిందుస్థాన్​ యూనిలీవర్​ (హెచ్​యూఎల్​) ప్రకటించింది. రిన్ సోప్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్, లైఫ్‌‌‌‌‌‌‌‌బాయ్,  పియర్స్ వంటి వాటి ధరలను గత నవంబర్​లో పెంచింది. పార్లే, డాబర్, బ్రిటానియా​ వంటి ఫుడ్​ప్రాసెసింగ్​ కంపెనీలు కూడా ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఇవి గత ఏడాదే రెండుమూడు సార్లు ధరలను పెంచాయి.  తమ కంపెనీల ధరల పెరుగుదల  దాదాపు 3-–5 శాతం ఉంటుందని, ఫిబ్రవరి తరువాత కొత్త రేట్లు వర్తిస్తాయని పార్లే ప్రొడక్టుల సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు అన్నారు.  కొన్నింటి ధరలను ఇది వరకే పెంచామని చెప్పారు. మహమ్మారి  వచ్చిన మొదటి సంవత్సరంలో ఇన్‌‌‌‌పుట్ ఖర్చులు ఎక్కువగా లేవని, 2021 నుంచి అన్ని సరుకుల ఖర్చులు పెరుగుతున్నాయని అన్నారాయన.  

ధరల పెరుగుదలకు కారణం ఏమిటి?

గోధుమలు, నూనె, చక్కెర ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. కీలకమైన ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా సబ్బులు మొదలైన వాటి ధరలు పెరిగాయి. పెట్రో ధరల పెరుగుదల, లేబర్ ఖర్చు, ప్యాకేజింగ్ ధర మొదలైనవి మరోసారి పెంపునకు దారి తీస్తున్నాయి.“ ముడిసరుకుల ధరలు చాలా పెరిగాయి. సప్లై సమస్యలు ఇందుకు ప్రధాన కారణం.    లిక్విడిటీ బాగానే ఉండటం వల్ల డిమాండ్ బలంగా ఉంది. రాబోయే రెండు నెలల్లో మా ఆలివ్ నూనె,  ఆహార ప్రొడక్టుల ధరలను సుమారు 15–-20 శాతం పెంచాలని భావిస్తున్నాం”అని మోడీ నేచురల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్ మోడీ అన్నారు. 

కొన్ని కంపెనీలు మాత్రం దూరం

ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలు మాత్రం ఇప్పట్లో ధరలను పెంచమని అంటున్నాయి. “మా ఫోకస్ అమ్మకాలను పెంచుకోవడంపైనే ఉంది. ప్రస్తుతానికి  ధరల పెంపు జోలికి వెళ్లడం లేదు. అయినప్పటికీ, కమోడిటీ ధరలు పెరుగుతూనే ఉంటే అప్పుడు ఆలోచిస్తాం ”అని బికానో, బికనీర్​వాలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ అన్నారు. ఇప్పటికిప్పుడు ధరలను పెంచబోమని బీఎల్ ఆగ్రో కూడా ప్రకటించింది. ‘‘ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ఎఫ్ఎంసీజీ రంగాలు వినియోగంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటాయి. డిమాండ్ తగ్గినప్పుడు ధరలు ఎక్కువ అవుతాయి.   ప్రాసెసింగ్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రొడక్టుల రేట్లను పెంచాం. మిగతా వాటి ధరలను పెంచడం లేదు ” అని బీఎల్ ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ ఖండేల్వాల్ అన్నారు.   ప్రస్తుతం ఆపరేటింగ్ మార్జిన్‌‌‌‌‌‌‌‌లను కాపాడాలన్నా, అదనపు ఖర్చులను భర్తీ చేయాలన్నా ధరలను పెంచడమే  ప్రాసెసింగ్ కంపెనీల ముందున్న మార్గమని చెప్పారు. మరికొన్ని కంపెనీలు కూడా ధరల పెరుగుదలను నివారించడానికి ఇతర చోట్ల ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. “గత కొన్ని నెలలుగా కొన్ని వస్తువుల ధరలు పెంచాం కానీ ఇప్పట్లో మరోసారి పెంచం. ఇందుకు బదులుగా ఇతర ఖర్చులు తగ్గించుకుంటాం.   ప్రీమియమైజేషన్​ను ఎక్కువ చేస్తాం. అమ్మకాలను పెంచుకుంటాం ” అని ఐటీసీ ప్రతినిధి తెలిపారు. ధరల నుండి పరిశ్రమకు ఉపశమనం కలిగించేందుకు, జీఎస్టీని తగ్గించాలని ఎఫ్ఎంసీజీ కంపెనీలు కోరుతున్నాయి. బిస్కెట్లపై జీఎస్టీ ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని, ఇదొక పెద్ద పరిశ్రమ అని కృష్ణారావు అన్నారు అక్షయ్ మోడీ మాట్లాడుతూ, చాలా పదార్థాలపై జీఎస్టీ 0 లేదా 5 శాతం మాత్రమేనని ప్యాకేజ్డ్/ప్రాసెస్డ్ ఫుడ్‌‌‌‌పై జీఎస్టీని కూడా 5 శాతానికి తగ్గించాలని అన్నారు.