అరబ్ గడ్డపై అర్జెంటీనా అదరగొట్టింది. ఖతార్‌లో ఖతర్నాక్ ఆటతో సాకర్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. ఫిఫా వరల్డ్ కప్‌లో మూడోసారి కప్పు నెగ్గి తీన్‌మార్ కొట్టింది..! కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల నెరవేరింది. టోర్నీ హిస్టరీలో అత్యంత థ్రిల్లింగ్‌గా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా కప్పు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో విజేతగా నిలిచింది. ఎక్స్‌ట్రా టైమ్‌తో కలిసి తొలుత ఇరు జట్లూ 3-3తో సమంగా నిలిచాయి.
అర్జెంటీనా టీమ్‌ను ముందుండి నడిపించిన మెస్సీ, డబుల్ గోల్స్‌తో సత్తా చాటగా.. ఫ్రాన్స్ తరఫున కిలియన్ ఎంబాపె మూడు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. మెస్సీనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవగా.. టోర్నీలో 8 గోల్స్ కొట్టిన ఎంబాపె గోల్డెన్ బూట్ అవార్డు గెలిచాడు. వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా గోల్డెన్ ట్రోఫీతో పాటు రూ. 347 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. కెరీర్‌లో లోటుగా ఉన్న వరల్డ్ కప్‌ను ముద్దాడిన మెస్సీ.. ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు.
లూసైల్ (ఖతార్): సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కల సాకరమైంది. అర్జెంటీనా 36 ఏండ్ల తర్వాత మరోసారి ఫిఫా కప్పు నెగ్గి తీన్‌మార్ కొట్టింది. కిక్కిరిసిన లూసైల్ స్టేడియంలో ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీసేన 4–2తో ఫ్రాన్స్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. నిర్ణీత టైమ్‌లో ఇరు జట్లూ సమంగా 2–2తో నిలవగా.. ఎక్స్‌ట్రా టైమ్‌లో స్కోరు 3–3గా మారింది. అర్జెంటీనా తరఫున లియోనల్ మెస్సీ 23, 108వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టగా, అంగెల్ డి మరియా 36వ నిమిషంలో మరో గోల్ రాబట్టాడు.
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కిలియన్ ఎంబాపె 80, 81, 118వ నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించాడు. విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా.. మెస్సీతో సహా నలుగురు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. ఫ్రాన్స్ తరఫున తొలి ప్రయత్నంలో ఎంబాపె, నాలుగో ప్రయత్నంలో మువాని మాత్రమే గోల్స్ కొట్టడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కొమన్ షాట్‌ను అర్జెంటీనా కీపర్ మార్టినెట్ అడ్డుకోగా.. ఆరెలిన్ షాట్ పక్కకు వెళ్లిపోయింది.
ఫస్టాఫ్‌లోనే అర్జెంటీనా డబుల్
మ్యాచ్ మొదలైనప్పటి నుంచే అర్జెంటీనా దూకుడుగా ఆడింది. బాల్‌ను ఎక్కువగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. పర్‌ఫెక్ట్ పాస్‌లతో ఫ్రాన్స్ డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లి ఎటాక్ చేసింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ అర్జెంటీనా ఎటాక్‌ను నడిపించాడు. ఆరంభంలోనే ఇలా దూకుడు చూపెట్టిన మెస్సీసేనను అడ్డుకునేందుకు ఫ్రాన్స్ డిఫెడంర్లు కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాక్స్‌లో బాల్ అందుకొని ముందుకెళ్తున్న అర్జెంటీనా ప్లేయర్ డి మరియాను ఫ్రాన్స్ ప్లేయర్ డెంబెలే కింద పడేయడంతో రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు.
దీన్ని సద్వినియోగం చేసుకున్న మెస్సీ.. తన స్టయిల్‌లో కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ కూల్‌గా గోల్ కొట్టి సంబరాల్లో మునిగిపోయాడు. కొద్దిసేపటికే అర్జెంటీనా లీడ్ డబులైంది. పావు గంట తర్వాత మరోసారి ఫ్రాన్స్ డిఫెన్స్‌ను మెస్సీసేన బ్రేక్ చేసింది. రైట్ ఫ్లాంక్‌లో బాల్‌ను అందుకున్న మెస్సీ.. దాన్ని అలిస్టర్‌కు అందించాడు. అతను డిఫెండర్లను తప్పించుకుంటూ బాక్స్‌లోకి దూసుకొచ్చి డి మరియాకు అందించగా.. కీపర్‌ను తప్పించిన మరియా దాన్ని నెట్‌లోకి పంపాడు. దాంతో, ఫస్టాఫ్‌లోనే అర్జెంటీనా 2–0తో లీడ్‌లో నిలిచింది. ఫస్టాఫ్‌లో ఫ్రాన్స్ టార్గెట్‌పై ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఓ టీమ్ ఇలా చేయడం 1996 తర్వాత ఇదే తొలిసారి.
ఎంబాపె.. 96 సెకండ్లలో రెండు గోల్స్
స్పష్టమైన లీడ్‌తో సెకండాఫ్‌లోకి వచ్చిన అర్జెంటీనా అదే జోరు కొనసాగించే ప్రయత్నం చేసింది. బాల్‌ను తమ కంట్రోల్‌లోనే ఉంచుకోవడంతో మెస్సీసేన ఈజీగా గెలుస్తుందని అంతా ఫిక్సయ్యారు. టైం కూడా దగ్గరపడటంతో అర్జెంటీనా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ, ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె అంచనాలు తలకిందులు చేశాడు. నెమ్మదిగా అర్జెంటీనా డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లిన ఫ్రాన్స్ ప్లేయర్లు అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నం చేశారు. కొలో మువాని బాల్‌ను బాక్స్‌లోకి తీసుకెళ్లగా.. అర్జెంటీనా ప్లేయర్ ఒటమెండి అతడిని వెనక్కిలాగి పడేశాడు. దాంతో, ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది.
దీన్ని ఎంబాపె గోల్‌గా మలిచాడు. దాంతో 1–2తో ఫ్రాన్స్ రేసులోకి వచ్చింది. ఈ షాక్ నుంచి అర్జెంటీనా కోలుకునేలోపే ఎంబాపె మెరుపు వేగంతో మరో గోల్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. హాఫ్ వేలో కోమన్ బాల్ అందుకొని లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు తెచ్చి ఎంబాపెకు అందించాడు. అద్భుత వేగంతో రన్నింగ్ చేస్తూ బాక్స్ దగ్గరకు చేరుకున్న వెంటనే తురమ్‌కు పాస్ చేసిన ఎంబాపె తిరిగి అతడిని నుంచి పాస్ అందుకొని బాల్‌ను నెట్‌లోకి కొట్టాడు. కేవలం 96 సెకండ్ల విరామంలో ఎంబాపె చేసిన రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ 2–2తో స్కోరు సమం చేయగా.. అర్జెంటీనా దిమ్మతిరిగింది. వాళ్లంతా డీలా పడగా.. ఫ్రాన్స్ ప్లేయర్లు ఫుల్ జోష్‌తో ముందుకెళ్లారు.
ఎంబాపె ముందుండి నడిపించగా.. ఫ్రాన్స్ పూర్తిగా ఎటాకింగ్ గేమ్ ఆడింది. అర్జెంటీనా గోల్ పోస్ట్ టార్గెట్‌గా వరుస పెట్టి దాడులు చేసింది. ఎంబాపె సహా ఫ్రాన్స్ ప్లేయర్ల షాట్లను అర్జెంటీనా డిఫెండర్లు నిలువరించగా, ఇంజ్యురీ టైమ్‌లో మెస్సీ క్లోజ్ రేంజ్ నుంచి కొట్టిన షాట్‌ను ఫ్రాన్స్ కీపర్ సేవ్ చేయడంతో మరో గోల్ రాలేదు.
ఎక్స్‌ట్రా టైమ్‌లో చెరొకటి..
సెకండాఫ్‌లో తేలిపోయిన అర్జెంటీనా ఎక్స్‌ట్రా టైమ్‌లో తిరిగి పుంజుకుంది. కచ్చితమైన పాస్‌లతో ముందుకెళ్లింది. 105, 107వ నిమిషాల్లో మెస్సీ కొట్టిన రెండు షాట్లను ఫ్రాన్స్ సేవ్ చేసింది. దాంతో, ఎక్స్‌ట్రా టైమ్ సెకండాఫ్ మొదలైన వెంటనే మరోసారి ప్రత్యర్థి బాక్స్‌లోకి అర్జెంటీనా చొచ్చుకెళ్లింది. తొలుత రైట్ సైడ్ నుంచి లాటరో మార్టినెజ్ కొట్టిన షాట్‌ను కీపర్ అడ్డుకోగా..రీబౌండ్ అయిన బాల్‌ను మెస్సీ నెట్‌లోకి పంపించాడు. దాంతో, అర్జెంటీనా 3–2తో మళ్లీ లీడ్‌లోకి వచ్చింది. కానీ, బాక్స్‌లో ఎంబాపెను కింద పడేసి ఎల్లో కార్డ్ గొంజాలో మోంటియెల్ అర్జెంటీనాను దెబ్బతీశాడు.
దీనికి రిఫరీ పెనాల్టీ ఇవ్వగా.. ఎంబాపె ఎలాంటి పొరపాటు చేయకుండా మ్యాచ్‌లో తన మూడో గోల్ కొట్టి స్కోరు మళ్లీ సమం చేశాడు. ఆ తర్వాత మరో గోల్ కోసం ఇరు జట్లూ చాలా ప్రయత్నాలు చేశాయి. మెస్సీ రెండుసార్లు స్కోరు చేసినంత పని చేసినా సాధ్యం కాలేదు. ఫ్రాన్స్ ప్రయత్నాలు సైతం ఫెయిల్ కావడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో మ్యాజిక్ చేసిన అర్జెంటీనా కప్పు సొంతం చేసుకుంది.
మెస్సీ.. మెస్సీ.. మెస్సీ..! ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ప్రపంచం మొత్తం మార్మోగుతున్న పేరు..! ఎవరి ఆట.. రాత ఎలా ఉన్నా.. మెస్సీ మెరవాలని, అతని కప్పు కల నెరవేరాలని, అర్జెంటీనా విశ్వవిజేతగా నిలవాలని.. ప్రత్యర్థి జట్ల అభిమానులు సైతం కోరుకున్నారు..! వారి ఆశీస్సులకు ఫలితం దక్కింది..! మెస్సీ 16 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది...! కలల కప్పు అతని దరి చేరింది..! అతని కెరీర్ పరిపూర్ణమైంది..! తన చివరి వరల్డ్ కప్‌లో, దేశం తరఫున చివరి మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టి అర్జెంటీనాను ప్రపంచ చాంపియన్‌గా నిలిపిన మెస్సీ
నిజమైన చాంపియన్!
తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా వంటి అనామక టీమ్ చేతిలో ఘోర ఓటమి తర్వాత పుంజుకున్న అర్జెంటీనా ఫైనల్ చేరడమే ఒకెత్తయితే.. గత ఎడిషన్ చాంపియన్, ఈసారీ ఓ రేంజ్‌లో ఆడుతున్న ఫ్రాన్స్‌ను కట్టడి చేసి కప్పు నెగ్గడం నభూతో..!
దీనికంతటికీ కారణం మెస్సీనే!
తన కలల కప్పును ఎలాగైనా అందుకునే ఆశతో.. అదే శ్వాసతో ఒక్కో అడుగు వేస్తూ.. తన జట్టునూ ముందుకు తీసుకొచ్చిన మెస్సీ పోరాటానికి సలాం కొట్టాల్సిందే..! ఈ తరంలో ఎవరు గ్రేట్ అనే చర్చ ఇక అనవసరం..!
మెస్సీనే గ్రేటెస్ట్ ప్లేయర్!
ఫైనల్ అంటే ఇదీ.. ఇలానే సాగాలని ప్రతి ఒక్కరూ అనుకునే పోరు ఇది. ఇటు లెజెండ్ మెస్సీ డబుల్ ధమాకా... అటు ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో చేసిన మ్యాజిక్ మాటల్లో వర్ణించలేనిది..! 79 నిమిషాల వరకు అర్జెంటీనా 2–0తో నిలిస్తే.. నిర్ణీత టైమ్ ముగిసేలోగా 2–2తో స్కోరు సమం..! ఆ వెంటనే 3–2తో అర్జెంటీనా మళ్లీ లీడ్‌లోకి వస్తే.. ఎక్స్‌ట్రా టైమ్ ముగిసే సరికి 3–3తో మళ్లీ స్కోరు సమం చేసిన ఫ్రాన్స్! చివరకు షూటౌట్‌లో అసలైన జట్టునే విజయం వరించింది..! ఈ టోర్నీతో మెస్సీ ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినా.. ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె రూపంలో
మరికొన్నేళ్లు సాకర్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే లెజెండ్ దొరికాడు..! 3 అర్జెంటీనాకు ఇది మూడో వరల్డ్‌కప్. 1978, 1986లో ఆ టీమ్ విజేతగా నిలిచింది.10 వరల్డ్‌కప్‌లో పది గోల్స్ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ ఎంబాపె. 23 ఏండ్ల 363 రోజుల్లో ఈ ఘనత సాధించిన అతను గెర్డ్ ముల్లర్ (24 ఏండ్ల 226 రోజులు)ను అధిగమించాడు. 26 వరల్డ్‌కప్స్ (2006–2022)లో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. ఈ టోర్నీలో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. 25 మ్యాచ్‌లతో ఉన్న జర్మనీ ప్లేయర్ లోథర్ మథాస్ (1982–1998) రికార్డును బ్రేక్ చేశాడు. 1 వరల్డ్ కప్ ఫైనల్లో ఇద్దరు ప్లేయర్లు రెండేసి గోల్స్ కొట్టడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి. 2 వరల్డ్ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్ కొట్టిన రెండో ప్లేయర్ ఎంబాపె. చివరగా 1996లో జర్మనీపై ఇంగ్లండ్ ప్లేయర్ జెఫ్ హస్ట్ చివరగా ఈ ఘనత సాధించాడు.
- మొత్తం ప్రైజ్‌మనీ‑రూ 3,638 కోట్లు
- విన్నర్ (అర్జెంటీనా) ‑ రూ. 347 కోట్లు
- రన్నరప్ (ఫ్రాన్స్) ‑ రూ. 248 కోట్లు
- మూడో ప్లేస్ (క్రొయేషియా) ‑ రూ. 223
- నాలుగో ప్లేస్ (మొరాకో) ‑ రూ. 206 కోట్లు అవార్డులు
- గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్)– మెస్సీ (అర్జెంటీనా)
- గోల్డెన్ బూట్‑ (ఎక్కువ గోల్స్ 8)‑ఎంబాపె (ఫ్రాన్స్)
- గ్లోల్డెన్ గ్లోవ్ (బెస్ట్ గోల్ కీపర్)‑మార్టినెజ్ (అర్జెంటీనా)
- ఫిఫా యంగ్ ప్లేయర్‑ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా)