ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సామాజిక వేత్తల ఆందోళన

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై  సామాజిక వేత్తల ఆందోళన

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీం ఇచ్చిన మెజారిటీ తీర్పుపై దేశంలోని సామాజిక వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు రిజర్వేషన్లు పవిత్ర మౌలిక అంశాలకు విరుద్ధంగా ఉన్నాయని మేధావుల అభిప్రాయం. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతున్నది. రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే అంశంగా భావిస్తున్నారు. ఈ తీర్పుపై మౌలికమైన మూడు అంశాలను పరిశీలించాల్సి ఉన్నది. ఒకటి.. రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం ఏమిటి? దానికి ఏ విధంగా భంగం కలుగుతుంది, రెండు.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చినందున గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును అధిగమించి ఉంటే ఆయా అంశాలను ఎలా ఎదుర్కోవాలి?, మూడు.. రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితిపై గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును అధిగమించడం.

రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన స్కీం కాదు

రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. ఆర్థికాభివృద్ధి పథకం అంతకంటే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి తమ, తమ జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, అధికార పదవుల్లో వాటా ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్య మౌలిక లక్షణం. అధికార పదవుల ద్వారా మాత్రమే బీసీ/ఎస్సీ/ఎస్టీ కులాల సామాజిక గౌరవం పెరుగుతుంది. రిజర్వేషన్ల ద్వారా విద్యా, ఉద్యోగాలు, పదవులు వస్తాయి. ఉద్యోగాలు/పదవుల ద్వారా అధికారం లభిస్తుంది. అధికారం ద్వారా పేదకులాల గౌరవం పెరుగుతుంది. ఇది రిజర్వేషన్ల లక్ష్యం. ఉదాహరణకు రిజర్వేషన్ల ద్వారా ఒక బీసీ లేదా ఒక దళితుడు ఒక కలెక్టర్ గానో, డిప్యూటీ కలెక్టర్ గానో, ఎమ్మెల్యే గానో మంత్రి గానో  ఎంపికై ఉంటే ఆ వ్యక్తికి, కుటుంబానికి, ఆ కులానికి గౌరవం పెరుగుతుంది. ఇదే కులాలకు చెందిన వారికి 50 ఎకరాల భూమి ఉన్నా, కొన్ని పరిశ్రమలు ఉన్నా, సంపద, ఆస్తి ఉన్నా ఆ వ్యక్తికి ఆ సమాజం గౌరవం ఇవ్వదు. పేద కులాలకు గౌరవం డబ్బు– ఆస్తి - సంపద ద్వారా లభించదు. కేవలం అధికారం ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే రిజర్వేషన్లు పెట్టారు. అదే రిజర్వేషన్ల లక్ష్యం. 

50 శాతం పరిమితి ఎలా తొలగిస్తారు?

ఈడబ్ల్యూఎస్ ​రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు విచారకరం. గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లు గరిష్ట పరిమితి 50 శాతం విధించింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్​10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఈ గరిష్ట పరిమితి తొలగించి 60 శాతానికి పెరిగింది. ఇప్పుడు 5 మంది జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పు గతంలో 9 మంది జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పును ఎలా ఓవర్ టేక్ చేస్తుంది? దీనిపై11 మంది జడ్జీలు గల బెంచ్​మాత్రమే గరిష్ట పరిమితి తొలగించాల్సి ఉంది. అగ్ర కులాల్లోని పేదలకు ఆర్థిక పరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి. తప్ప విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. 1986 ఎన్టీఆర్ ​సీఎంగా ఉన్న సందర్భంలో బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 నుంచి 44 శాతానికి పెంచగా  కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. 1990లో మండల కమిషన్ నూ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించిన అగ్రకుల సోదరులకు రిజర్వేషన్లు పెట్టడం ఎంత వరకు న్యాయం? 15 శాతం జనాభా గల అగ్రకుల సోదరులకు విద్యా, ఉద్యోగ, అధికార పదవుల్లో, సంపదలో 70 నుంచి 80 శాతం వాటా ఉంది.  అలాంటి వారికి రిజర్వేషన్లు పెట్టడంలో ఏమైనా న్యాయం ఉందా? గత 75 ఏండ్లుగా న్యాయ, రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలో 80 శాతం పదవులు అగ్రకులాల వారే పొందారు, పొందుతున్నారు. 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారు. 80 శాతం పదవులు పొందుతున్నారు. అలాంటి వారికే రిజర్వేషన్లు ఇవ్వడంలో ఉన్న శాస్త్రీయత, హేతుబద్ధత ఏమిటి? ఇటీవల జరిపిన ఓ సర్వేలో ప్రైవేటు రంగంలోని -ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో 95 శాతం అగ్రకులాల వారే ఉన్నట్లు తేలింది. 15 శాతం జనాభా గల అగ్రకులాల వారికి ప్రెవేట్ రంగంలో 95 శాతం, ప్రభుత్వ రంగంలో 63 శాతం ఉద్యోగాలుంటే ఇంకా వీరికి రిజర్వేషన్లు పెట్టడంలోని ఔచిత్యమేముంది? ఈ దేశ సంపద, పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్ వ్యవస్థలు, డబ్బు, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టులు, అధికారం ఎవరి చేతుల్లో ఉన్నాయి? 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల చేతుల్లో 90 శాతం సంపద రిజర్వ్ అయి ఉన్నది. మరి వీటిని కూడా అన్ని కులాల జనాభా ప్రకారం వాటా పంచితే దేశంలో ప్రజలందరి ఆకలి, పేదరికం తొలగిపోతాయి కదా? ఈ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు?

ఆర్థిక వెనుకబాటుకు కొలమానం ఏమిటి?

ఆర్థికంగా వెనుకబడిన వారు ఆధిపత్య కులాల్లో మాత్రమే ఉంటారా? ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఉండరా?  అంటే ప్రభుత్వం దృష్టిలో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నది కేవలం అగ్రకులాలకు చెందిన వారేనా? ఏ అంశాల ఆధారంగా ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని నిర్ణయిస్తున్నారు? ఆర్థికంగా వెనుకబాటు ఏటా మారుతుంటుంది. అలాంటప్పుడు ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎలా నిర్ణయించి సర్టిఫికెట్ ఇస్తారు?  బీసీ క్రీమీలేయర్ విధానంలో సూచించిన కొలమానాలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి  నిర్ణయించిన కొలమానాలకు తేడా ఉంది. మరి ఈ తారతమ్యం ఎందుకు? ఈ సదుపాయం కేవలం ఆధిపత్య కులాల వారికి మాత్రమే ఎందుకు ఉండాలి? గత 30 ఏండ్లుగా బీసీలు క్రీమీలేయర్ నిబంధనమూలంగా నష్ట పోలేదా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో ఆధిపత్య కులాల జనాభా15 శాతానికి మించి లేదు. 15 శాతం ఉన్న అగ్ర కులాల వారిలో 10 శాతం మంది పేదవారు ఉన్నారని చెప్పేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు ఏమిటి? అటువంటి వివరాలు  లేకుండా సుప్రీంకోర్టు ఎలా నిర్ణయిస్తుంది?  జనగణన, సోషియో ఎకనామిక్ సర్వే డేటా లేకుండా ఓబీసీల‌‌‌‌ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పు ఇవ్వలేమని చెబుతూ వచ్చిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్​రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఎలాంటి డేటా లేకుండానే ఎలా తీర్పు ఇవ్వగలిగింది? అగ్ర కులాల వారిలో  పేదవారి మొత్తం జనాభా రెండు శాతం కూడా లేదు. అలాంటప్పుడు 2 శాతం వారికి10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం  న్యాయమా? అలా  కాదంటే అగ్ర కులాల మొత్తం జనాభా లెక్కలు తీసి, వారిలో ఏండ్ల తరబడి పేదరికంలో ఉన్న వారి జనాభా లెక్కలు తీసి వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. అగ్రకులాల్లోని పేదవారికి రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా ఇస్తారు? ఏ ఆధారంగా ఇస్తారు? ఉద్యోగాల్లో వారికి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేదని ఇస్తారా! కాలేజీల్లో వారు చదువుకోవడం లేదని ఇస్తారా! లేక సమాజంలో అగ్రకులాల వారికి సామాజిక, గౌరవం లేదని ఇస్తారా? అనే కోణంలో చూడాలి. ఓట్ల కోసమని ‘విలువలు’ పాటించకుండా వ్యవస్థను భ్రష్టుపట్టించే విధానాలు రూపకల్పన చేయడం రాజకీయ దివాళా కోరుతనమని ధ్రువపరుస్తున్నది. నైతిక పతనావస్థను సూచిస్తుంది. ఈ తీర్పుపై గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా 9 మంది జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పు, కేశవానంద భారతి కేసులో13 మంది జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి15 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే ఈ కేసును విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

మౌలిక స్వరూపం మారుస్తరా?

రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్​లో సామాజికంగా, విద్యారంగంలో వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఎక్కడా లేదు. ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం. రాజ్యాంగపరంగా ఇవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం ‘ఆర్థిక వెనుకబాటుతనం’ ఆధారంగా రిజర్వేషన్లు పెట్టాలనే కొత్త ప్రతిపాదికపై పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగంలోని ఆర్టికల్15(6),16(6) అధికరణలను కొత్తగా చేర్చింది. పైగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చారు. ఇలా మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు13 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం పార్లమెంట్ కు లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన పదాన్ని చేర్చడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమే అవుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలు మార్చాలంటే గతంలో13 మంది సుప్రీం కోర్టు జడ్జిల మౌలిక సూత్రాలు మార్చరాదనే తీర్పును అధిగమించడానికి 15 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కావాలి. పెద్ద ధర్మాసనం నిర్మించకుండా 5 మంది జడ్జీలు గతంలోని తీర్పును ఎలా అధిగమిస్తారు? ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధం. 

= ఆర్. కృష్ణయ్య, అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం