విశ్లేషణ: జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు ఉండాలె

ప్రజలకు న్యాయాన్ని అందించడంలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరంగా కొనసాగడంలోనూ కోర్టులదే కీలక పాత్ర. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ సమన్యాయాన్ని అందించాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. ఈ బాధ్యతలను రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నెరవేరుస్తుంటారు. అయితే అందరికీ న్యాయాన్ని అందించే న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయం అమలవుతోందా? అనే చర్చ ఇటీవల ఎక్కువగా నడుస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు కోర్టుల్లో అవకాశాలు దక్కుతున్నాయా? లేక కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయా? అనే పరిశీలన కూడా తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో అవకాశాలు దక్కని సామాజిక వర్గాలు తమకు వాటా కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో జడ్జీల నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే నిజమైన న్యాయం దక్కుతుంది. జనాభా దామాషా ప్రకారం జడ్జీల పోస్టులు భర్తీ చేసినప్పుడే మరింత సామాజిక న్యాయం, సమాజంలో ప్రశాంత జీవనం సాధ్యమవుతాయి.

గత నెలలో ముగిసిన పార్లమెంట్​ సమావేశాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల పెన్షన్ సవరణ చట్టం-2021 బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టస్ ‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో వైవిధ్యం లేదు”అని ఒక మాట చెప్పారు. బ్రిట్టస్​ ప్రసంగంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన లెవనెత్తిన అంశాల్లో వాస్తవం ఉందని, ఆ ప్రసంగం విని ఆనందించానని చెప్పారు. అయితే జాతీయ మీడియా బ్రిట్టస్​ ప్రసంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాధగా ఉందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిట్టస్​ చెప్పినట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో వైవిధ్యం లేదనేది వాస్తవమేనా? న్యాయమూర్తుల నియామకాల్లో సామజిక న్యాయం కొరవడి పారదర్శకత, వైవిధ్యం లోపించాయా? దేశ రాజకీయ, పరిపాలన, న్యాయ వ్యవస్థల్లో సామాజిక న్యాయం లేకపోవడానికి కారణాలను ప్రస్తుత సమాజం చర్చించుకోవలసిన అవసరం ఉందని అర్థమవుతోంది.

కొన్ని కులాల వారికే అవకాశాలు

రాజ్యసభలో చర్చ సందర్భంగా ‘‘ఇప్పటి వరకు నియమితులైన 47 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 14 మంది బ్రాహ్మణులే. అదేవిధంగా 1950 నుంచి 1970 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన 14 మందిలో 11 మంది బ్రాహ్మణులే ఉన్నారు”అని ఎంపీ బ్రిట్టస్  పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 1980 వరకు ఒక్కరు కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నుంచి లేరని బ్రిట్టస్​ తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 1977లో ఏడు నుంచి పదిహేడుకు పెంచినా ఒక్కరు కూడా ఓబీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ వారు జడ్జీగా లేకపోవడానికి ప్రధాన కారణం చదువే అని ఆయన స్పష్టం చేశారు. హిందూ ధర్మశాస్త్రాల ద్వారా సంస్థాగతమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో జీవిస్తూ వీరంతా విద్యకు దూరమయ్యారని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చాక చాలా మంది విద్యావంతులైనప్పటికీ, వేల సంవత్సరాలుగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనక్కి నెట్టేయబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ వీరికి సరైన అవకాశాలు దక్కడం లేదని బ్రిట్టస్​ తెలిపారు.

జడ్జీల నియామక ప్రక్రియ ఎలాగంటే..

సుప్రీంకోర్టులో ఎవరినైనా న్యాయమూర్తిగా నియమించాలంటే అతడు/ఆమె భారత పౌరుడై ఉండాలి. ఏదైనా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా కనీసం ఐదేండ్లు పనిచేసి ఉండాలి లేదా ఏదైనా హైకోర్టులో కనీసం పదేండ్లు వకీలుగా పనిచేసి ఉండాలి. అలాంటి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం సిఫార్సు, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ శాఖ ద్వారా రాష్ట్రపతి ఆమోదంతో నియమిస్తారు. అదేవిధంగా ఎవరినైనా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే అతడు/ఆమె ఏదైనా హైకోర్టులో పది సంవత్సరాలు వకీలుగా పనిచేసి ఉండాలి లేదా జిల్లా స్థాయి జడ్జిగా పనిచేసిన వారికి సీనియార్టీ పద్ధతిలో అవకాశం కల్పిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా రాష్ట్రపతి ఆమోదంతో నియమిస్తారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మనం గమనించవలసింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రధానంగా ఉందనేది. అందుకే దేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ఎంపికలో రాజకీయ జోక్యాలు కనబడుతుంటాయి. అందుకే దేశంలో రాజ్యాధికారం ఏ కులాల చేతుల్లో ఉంటే, ఆ కులాల వారినే జడ్జీలుగా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం లెక్కలు చూస్తే అర్థమవుతోంది. 

రిజర్వేషన్లు లేకపోవడమే అసలు సమస్య

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జడ్జీల ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించకపోవడమే. జాన్ బ్రిట్టస్ తన ప్రసంగంలో ఒక ప్రధాన న్యాయమూర్తిని ఉదాహరణగా చెబుతూ.. సదరు ప్రధాన న్యాయమూర్తి తాత, మామయ్య, కుటుంబంలోని మరికొందరు, అందరూ జడ్జీలే అని చెప్పారు. సుప్రీంకోర్టులో 1950 నుంచి ప్రధాన న్యాయమూర్తి పదవిలో అత్యంత సీనియర్ జడ్జిని నియమించాలని నిబంధన ఉన్నప్పటికీ 1973లో ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జీలను కాదని ఎంఎన్ రాయ్ ని నియమించారు. తద్వారా జడ్జీల నియామకాల్లో రాజకీయ పలుకుబడి, కులం ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారిని నియమించకపోవడానికి కారణం చదువు, ప్రతిభ లేక కాదు. వీరికి కుల, రాజకీయ బలాలు లేనందు వల్లనే ప్రాతినిధ్యం లభించడం లేదు. అందుకే 2014లో ఎన్డీయే ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 124ఎ, 124బి, 124సిలను చేరుస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీల నియామకానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా, మైనారిటీ సభ్యుల కనీస భాగస్వామ్యంతో నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్​మెంట్స్​ కమిషన్ ఏర్పాటు, విధివిధానాలను ఖరారు చేసింది. అయితే అడ్వొకేట్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు తీర్పులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీ తీర్పుతో 99వ సవరణ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడుతూ కొట్టివేసింది.

కుల వ్యవస్థను నిర్మూలించాలి

స్కూల్​ పుస్తకాల్లో భారతదేశాన్ని ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని నిర్వచిస్తున్నారు. వాస్తవానికి శత్రుదేశంతో యుద్ధం వస్తే తప్ప ఎవరూ ఏకం కావడం లేదు. హిందువులు, ఇతర మతాలతో జగడం వస్తేనే ఏకమవుతున్నారు తప్ప, సాధారణ సమయాల్లో కులాల వారీగా విడిపోయి బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులు దేశానికి ఉపయోగకరమా? నాటి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, కాన్షీరాం వరకు సామాజిక సంస్కరణలే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పారు. వారు చెప్పినట్టుగా సామాజిక సంస్కరణలు వస్తే తప్ప దేశంలోని అన్ని రంగాల్లో వైవిధ్యం రాదు. దేశంలో అంటరానితనాన్ని ఆర్టికల్ 17 ద్వారా రాజ్యాంగం నిషేధించింది. కానీ, కుల నిర్మూలన కోసం ఎలాంటి అధికరణలనూ రాజ్యాంగంలో చేర్చలేదు. దీన్నిబట్టి పాలకులకు కుల వ్యవస్థను కొనసాగించి, రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశం ఉన్నట్లుగా భావించాలి. ఇప్పటికైనా రాజ్యాంగంలో ఆర్టికల్ 17ఏను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అలాగే రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. దేశంలో కుల, మత భేదాలను నిర్మూలిస్తే సకల రంగాల్లో సమానత్వం ఏర్పడి వైవిధ్యభరితమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా నిలబడుతుంది.
– కోడెపాక కుమారస్వామి, సోషల్​ ఎనలిస్ట్