అవినీతిని నిర్మూలించలేమా!

ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని యజమానినే అవినీతితో దోచుకు తినే సేవకులు గల రాజకీయ సంస్కృతి దేశంలో బలపడింది. నాయకుడంటే ఒకప్పుడు మాటలపై నిలబడే వాడు. ఇప్పుడు నోట్ల కట్టలతో ఓట్లను కొనేవాడు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో ‘కలుపు’. రెండవది దేశంలో ‘అవినీతి’. కలుపు వల్ల పొలం నాశనం అవుతుంది. అవినీతి వల్ల దేశం సర్వనాశనం అవుతున్నది. నేడు అవినీతి సర్వ వ్యవస్థల్లో వికృత రూపంలో వ్యవస్థీకృతమై ఉంది. ఈ అవినీతి వటవృక్షానికి తల్లి వేరు ‘రాజకీయ అవినీతి’ అని ఎన్నో అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేశాయి. అవినీతికి, రాజకీయాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అవినీతి మూలంగా అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ధనమంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. భారతీయ వ్యవస్థలను ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతితో భ్రష్టు పట్టిస్తున్నారు. అలా కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా(మీడియా )స్వేచ్ఛ..ఇవేవీ అవినీతికి అతీతం కాదనేలా నేడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న ఈమధ్య సుప్రీంకోర్టు న్యాయాధీశులే ఎల్గార్ పరిషత్ గౌతమ్ నవ లఖా.. సామాజిక కార్యకర్త కేసులో ఆందోళన వ్యక్తపరిచారు. ఎంతో అవినీతికి పాల్పడినా ధనబలంతో కొందరు సునాయాసంగా కేసుల నుంచి తప్పించుకుంటున్నారన్నారు.  ఆ  అవినీతిపరులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే స్వయం ప్రతిపత్తి కలిగిన అత్యున్నత న్యాయాధీశులే ఆవేదన వ్యక్త పరచడాన్ని బట్టి చూస్తుంటే! పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అవినీతి రూపంలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా మారిందనిపిస్తుంది. 

అవినీతిపరులకే అవకాశాలు?

చిన్నా చితక అవినీతి(మైనర్ కరప్షన్) జనజీవనంలో వివిధ కార్యాలయాల కలాపాల నుంచి మొదలై, భారీ అవినీతి మేజర్ కరప్షన్ రాజకీయ కుంభకోణాల వరకు చూస్తున్నాం, వింటున్నాం. ఈ అవినీతిపరులందరూ అవినీతి సర్వసాధారణమనేలా ప్రజల్ని మానసికంగా తయారు చేశారు. ఇది నేరమనేది మరిచిపోయారు. అవినీతి అనే దాన్ని ప్రభుత్వ పన్నులతో పాటు ఇదొక అదనపు పన్నుగా మార్చేశారు. దీన్ని అరికట్టడానికి స్వాతంత్ర్య పోరాటం లాంటి మరో సాంఘిక ఉద్యమం రావాలి. మన దేశంలో ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అయిన ఎన్నికల ప్రక్రియలో ఆర్థిక, అంగ బలం గల వారిని, సంపన్నులను, నేరచరిత్ర కలిగిన వారిని గెలుపు గుర్రాల పేరుతో రాజకీయ పక్షాలన్నీ ఏరి కోరి అభ్యర్థులుగా నిలుపుతున్నాయి. ఆనాడు ఓటుకు ఒక రూపాయి చొప్పున పంచిన రోజుల నుంచి నేడు వెయ్యిల రూపాయల వరకు పంచడం చూస్తున్నాం. అవినీతితో సంపాదించిన డబ్బును వెదజల్లుతూ ప్రజలను ప్రలోభాల మత్తులో నిండా ముంచుతున్నారు. నేడది ఎక్కడికి దారి తీసింది అంటే! ‘డబ్బు ఇవ్వకుంటే ఓటు వేసేదే లేదు’ అనే స్థాయికి దిగజార్చారు. అవినీతి సొమ్మును ఎన్నికల వేళ కోట్లకు కోట్లు వెదజల్లడం, ఆ తర్వాత అంతకు రెట్టింపుగా రాబట్టుకోవడానికి విపరీతమైన అవినీతికి పాల్పడటం పరిపాటిగా మారింది. తాము ఓటు వేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకుంటారు. వారి జీవితాలను ఆర్థిక, సామాజిక స్థితిగతులను మారుస్తారని వారు నమ్మి ఓట్లు వేస్తున్నారు. కానీ వారి అభీష్టం నెరవేరకపోగా ప్రజాప్రతినిధులు సంతలో సరుకుల్లా అమ్ముడుపోతున్నారు. ప్రజాతీర్పుకు, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వకుండా అధికారం, పదవీ వ్యామోహంలో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్న తీరులో అన్ని రాజకీయ పార్టీలు గురివింద గింజ నీతినే అవలంబిస్తున్నాయి.

కఠిన చట్టాలు రావాలి..

భారీ ఖరీదైనవిగా మారిన రాజకీయాల నుంచి అవినీతిని ప్రక్షాళన చేయాలి. ఇకనైనా ఈ అవినీతి చీడపీడను కట్టడి చేయకపోతే భవిష్యత్ భారతం ఏమైపోవాలి. ప్రజలను ఇలా తయారు చేసింది, ముమ్మాటికీ రాజకీయ నాయకులే. అవినీతికి, రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి అవినీతికి వ్యతిరేకంగా నిలబడి స్వీయ ప్రయోజనాలు ఆశించని నైతిక విలువలకు కట్టుబడ్డ వారిని పార్టీలు అభ్యర్థులుగా నిలపాలి. అలాంటి వారిని ప్రజలు ప్రలోభాలకు లోబడకుండా ఎన్నుకోవాలి. నేడు రాజకీయాలకు దూరంగా ఉంటున్న మేధావులు, బుద్ధిజీవులు, యువకులు విశాల భరతజాతి భవితవ్య ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ పక్షా(పార్టీ)లను నడపాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పత్రికా స్వేచ్ఛ సైతం అధికార పక్షాల కబంధహస్తాల్లో బందీగా అవుతున్నది.  ప్రజల సమస్యలను, అసమ్మతులను నిర్భయంగా తెలియజేసే స్వేచ్ఛ కూడా అధికారం పక్షాన చేరిపోతోంది. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను అధికార రాజకీయాలకు ఊడిగం చేయించుకుంటున్నారు. ఇలాంటి వేళ 75 ఏండ్ల అమృతోత్సవాలు జరుపుకున్న స్ఫూర్తితో అవినీతి, రాజకీయ కల్మషంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంలో వెంటనే సమగ్రమైన సంస్కరణలతో కఠిన చట్టాలతో అవినీతిని పారదోలాలి. నాటి స్వాతంత్ర పోరాటంలోని జాతి నిర్మాతల స్వప్నాలు నెరవేరేలా అవినీతి రహిత, నైతిక విలువలతో కూడిన రాజకీయ నాయకుల కోసం పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయ నాయకులు కూడబలుక్కొని అవినీతితో దేశ సంపదను వంతులవారీగా దోచుకు తింటున్న తీరు మారాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కేసులను సత్వర విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రజా ప్రతినిధైనా అవినీతికి పాల్పడితే వారిని కఠిన చట్టాలతో శిక్షించేలా సవరణలు రావాలి. ఈ అవినీతి అనే మదపుటేనుగును కట్టడి చేసే అంకుశం లాంటి కఠిన చట్టాలు రావాలి. ఆ కఠిన చట్టాల అమలు తీరును బట్టి అవినీతి అంతమవుతుంది.- మేకిరి దామోదర్, సోషల్ అనలిస్ట్