కేంద్ర సాహిత్య అకాడమీకి ‘ఎర్ర’ పక్షపాతం?

“పిల్లి గుడ్డిదైతే ఎలుక మీసాలు పట్టి దువ్వింది” అని సామెత. కేంద్రంలో ఉన్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉదారంగా వదిలేసిన కారణంగా కేంద్ర సాహిత్య అకాడమీ అనేక పిల్లిమొగ్గలు వేస్తున్నది. ముఖ్యంగా దాన్ని నడిపించే కన్వీనర్ కృత్తివెంటి శ్రీనివాస్ రావు చర్యల వల్ల అవార్డులు, నియామకాలు 'జాతీయవాద ప్రభుత్వ' ఆలోచనలకు విరుద్ధంగా వస్తున్నాయి. 'అయిన వాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలు' అన్నట్లుగా గత డెబ్భై ఏళ్ల నుండి సాహిత్య అకాడమీ ఒంటికన్ను శుక్రుడి లానే ప్రవర్తించింది. విచిత్రం ఏమిటంటే కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు దాటినా అక్కడి పైరవీకారుల వల్ల ఇప్పటికీ సాహిత్య అకాడమీ సభ్యుల నియామకం, అకాడమీ ఇచ్చే అవార్డుల విషయంలో అంతా ‘ఎర్ర ’ ఆధిపత్యమే!

కేంద్ర సాహిత్య అకాడమీ ఆరంభం నుంచే..

1954లో  'సాహిత్య అకాడమీ' ప్రారంభమైంది.  ఈ అకాడమీ మొదటి సభకు  అధ్యక్షులుగా పండిత జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించారు. ‘తనను ప్రధానిగా కాక, కవిగా, రచయితగా గుర్తించి సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమించినందుకు చాలా గర్వంగా ఉందని’ స్వయంగా జవహర్లాల్ నెహ్రూ పేర్కొంటూ ముచ్చట పడ్డారు. ఇక్కడే అసలు చిక్కుముడి పడింది. నెహ్రూ తర్వాత 11 మంది అధ్యక్షులైనా.. ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాకపోవడం విచిత్రం. ఏటా సాహిత్య అకాడమీ ఒక లక్ష రూపాయలను బహుమతిగా 24 భాషలలో ఆయా ఎంపిక చేసిన రచయితలకు అందిస్తోంది. ‘బహు భాషల పుస్తకాల' సేకరణతో సాహిత్య అకాడమీ అతిపెద్ద గ్రంథాలయం నిర్వహిస్తున్నది.  వార్షిక ఉపన్యాసాలు, కవి సంగమం, కవి సంధ్య.. వంటి ప్రతిష్టాత్మకమైన ఎన్నో కార్యక్రమాలు సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్నది. ఇంత ప్రసిద్ధమైన చరిత్ర, ఇందరు ప్రఖ్యాతులు నడయాడిన సాహిత్య అకాడమీకి ‘ఎర్ర జబ్బు' ఎలా పట్టింది! మందు లేని 'మార్క్స్ రోగా’నికి అడ్డుకట్ట ఎలా? అన్నవే ప్రస్తుత కాలంలో ముఖ్యమైన చర్చనీయాంశాలవుతుండడం గమనార్హం.

సాహిత్య వనంలోకి చొరబడ్డ ఎర్ర కాకులు..!

'భారతదేశం నా వారసత్వ సంపద' అని ప్రతిజ్ఞ చేసినట్లు సాహిత్య అకాడమీ 'నా వారసత్వ సంపద' అని బల్ల గుద్ది చెప్పినవాళ్లనే జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియామకం చేస్తూ వెళ్లిపోవడం వెనుక రహస్యం ఏమిటి ? తాము పీఠంలో ఉన్నప్పుడు తలచుకున్న వారికి అవార్డులు ఇవ్వడం, వీలైతే వాళ్లనే ప్రసిద్ధులను చేసి వివిధ భాషల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో స్థానం కల్పించడం, తర్వాత తమ పుస్తకాలకు అవార్డులు ఇప్పించుకోవడం ‘సాహిత్య వింత’ కాక మరేమిటి? ధూర్జటి ‘రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు’ అని కృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండి అనగలిగాడు. పోతనను గురించి చెప్పేవాళ్లు హాలికుడై తన కలాన్ని అమ్ముకోవడం ఇష్టం లేదని ‘పడుపు కూడు' భుజించనని అన్నాడు. ‘మాకొద్దీ తెల్లదొరతనమూ” అని నినదించిన గరిమెళ్ల సత్యనారాయణ పాండీ బజార్లో అడుక్కుతిన్నాడంటారు. రావూరి భరద్వాజ లాంటి వారు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పలేం. ఎందరో గొప్ప కవులు తమ సాహిత్యాన్ని ముద్రించుకునే భాగ్యానికి నోచుకోకుండానే అసువులు బాయటం విచారకరం. దానివల్ల మనం ఎంతో గొప్ప సాహిత్యాన్ని నష్టపోయాం. మరి సాహిత్య అకాడమీని నడిపే ఈ ‘ఎర్ర జబ్బ సంచుల’ ముఠా గిట్టని వారిని తొక్కేయడం, నచ్చనివారిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం ఓ సిలబస్ పెట్టుకున్నారు. సాహిత్యంతో ఎలా వ్యాపారం చేయొచ్చో వీళ్ళను చూసి నేర్చుకోవచ్చు. గొప్పగా రాసేవాళ్ళకు అప్పుడో ఇప్పుడో ఓ అవార్డు పారేసి తమవైపు తిప్పుకోవడం; తమ వెంట ఉంటేనే అవార్డులు, గుర్తింపు వస్తాయని భ్రమింపచేయడం వంటి కుత్సిత పనులను ఓ కళగా పోషిస్తున్నారు. ఆశ్రిత పక్షపాతం, అనర్హమైన ప్రాధాన్యత, భజనపరుల కీర్తి కండూతి వంటి అవలక్షణాలు భారతీయ భాషా సంస్కృతిని ఏకం చేయకపోగా దేశాన్ని సాహిత్యం ద్వారా విభజించే పని నిర్విఘ్నంగా చేస్తున్నారు. 

అనర్హులకు అందలం

అవార్డులు పొందిన సభ్యులుగా ఉన్న పెద్దలు, ఎలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తారనే దానికి క్రింద ఉదాహరణ చూడవచ్చు. 'జో ఆజ్ సాహిబే మసనద్ హై కల్ నహీఁ హోంగే! కిరాయేదార్ హై జాతీమకాన్ థోడీ హై! సబీకా ఖూన్ హై షామిల్ యహాఁకీ మిట్టీ మే! కిసీకే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై’! ఇవీ వాళ్ల ప్రోత్సాహం నుండి పుట్టినవి, ఇవే వాళ్లు రాసిన రచనల్లోని మచ్చుతునకలు. వాటి గురించి విమర్శ చేయడం మొదలుపెడితే గ్రంథాలు సరిపోవు. ఉదాహరణకు ఇటీవల ఓ తెలుగు అనువాదకురాలికి ఓ అవార్డు వచ్చింది. హిందీలో భాషా సింగ్ రాసిన నాన్ ఫిక్షన్ నవల 'అదృశ్య భారత్' అనే టైటిలు ఈమె ‘అశుద్ధ భారత్’ అని పేరు పెట్టింది. ఎంత గొప్ప అనువాదమో!? ఇటువంటి అపరిపక్వ భాషావేత్తలకు సాహిత్య అకాడమీ పక్షపాతులు అవార్డులు, సత్కారాలు అందివ్వడం విచారకరం. 

సాహిత్య పిపాసకులకు అవార్డులు దక్కవు

బంతిలో కూర్చున్నవాళ్లలో తమకు నచ్చినవాళ్లకు అవార్డులు ఇస్తారు. వాళ్లు వెళ్లేటపుడు తమకు నచ్చినవాళ్లను బస్సు సీట్లో రుమాలు వేసినట్లు ఆసనంపై కూర్చోబెట్టి దిగిపోతారు. అవార్డులు పొందగలరు. మళ్లీ వాటిని ‘వాపస్​ ఇవ్వడం’ చేయగలరు. 2012 తర్వాత ఈ దారుణం మరీ ఎక్కువైంది. అవార్డులు పొందినవారు అర్బన్ నక్సలిజంకు మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. క్రింది కులాలను అణచివేసిన వాళ్లే ఇప్పుడు భీమాకోరేగావ్ గురించి మాట్లాడతారు. నిజంగా సాహిత్యం గురించి తపన పడేవాళ్లకు ఈ అవార్డులు దక్కడం లేదు. ‘ద్రౌపది’ని అవమానపరుస్తూ నవల రాసిన మహామహోపాధ్యాయుడు పద్మభూషణ్ పొందగా లేనిది మార్క్సిస్ట్ సాహిత్యవేత్తలు పొందితే తప్పేమిటి? ఓవైపు అవార్డులు తీసుకుంటూనే, మరోవైపు 'స్వేచ్ఛ లేదు' అంటూ జాతీయవాద ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారు. వీళ్లేదో హైదరాబాద్​లో వ్యవసాయం చేసి పంటలు పండించినట్లు పంజాబ్ రైతులపై కవిత్వం రాస్తారు. సిఏఏ, కాశ్మీర్లపై కళ్లనిండా నీళ్లను నింపుకొని, కలాల్లోకి వంపేస్తారు. ఆశ్చర్యం..! ఇదే ఎర్ర కలాల తెంపరితనం.

జాతీయవాద ప్రభుత్వంలోనూ..

ఇంకో విచిత్రం వింటే మన సిగ్గు, సింగారం బయటపడిపోతుంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ మహాకవి గురజాడ చెప్పాడంటూ 'దేశమంటే మట్టి కాదోయ్; మనుషులోయ్' అన్న వాక్యం ఉదాహరించారు. జస్టిస్ పార్టీ వాసన కలవాడో, కమ్యూనిస్టు మేధావో ఎవరో ఈ వాక్యం ఆయనకు అందించి ఉంటారంటే మనం నమ్మలేం. ‘ఆనందమఠ్’ నవల ద్వారా ‘బకించంద్ర ఛటర్జీ’ వందేమాతరం అంటూ మాతృభూమిపై మమకారం రగిలించి స్వాతంత్ర్యోద్యమం ఉర్రూతలూగించారు. ఎందరో వీరులు వందేమాతరం అంటూ ఉరిత్రాడును ముద్దుపెడుతూ ప్రాణం వదిలిపెట్టారు. అలాంటి సమయంలో 'దేశమంటే మట్టికాదోయ్, మనుషులోయ్' అన్న వాక్యం ఆఖరుకు ప్రధాని నోట చెప్పించిన వారి బుద్ధి కుశలతకు జోహార్లు. మొత్తానికి కాశ్మీర్ లాంటి టెర్రరిస్టులున్న చోట వ్యూహంతో మోదీ-, షా ద్వయం కొట్టగలిగారు. కానీ ప్రసార, ప్రచార మాధ్యమాలు, సాహిత్యరంగం, విశ్వవిద్యాలయాలు ఈ మూడూ ఇప్పటికీ  ఎర్ర నక్కల ప్రాబల్యానికి చెక్​ పెట్టలేకపోయాయి. ఇప్పటికైనా జాతీయవాద సంస్థలు మొద్దునిద్ర నుండి మేల్కొనకపోతే, కేంద్రంలో అధికారం కోల్పోతే, మరో రెండు నిమిషాల్లో దేశాన్ని ధ్వంసం చేయగల ‘కలం నైపుణ్యం’ వీళ్ల చేతుల్లో ఉంది.

భారతీయతకు చోటేది? 

భారతీయతను, జాతీయతను దుమ్మెత్తిపోయడమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందటానికి గీటురాయి. 'సబాల్టర్న్’ పేరు చెప్పి సంస్కారవంతమైన సాహిత్యాన్ని తొక్కేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో వ్యాస, వాల్మీకి, కాళిదాస వంటివారు, వాగ్గేయకారులు అసలు కవులే కాదు. మార్క్స్ మత్తుమందును మళ్ళీ మళ్ళీ మెదళ్ళలోకి దట్టించే మహోన్నతమూర్తులే వీళ్ళ దృష్టిలో మహాకవులు. ఈ ముఠా సామాన్యుల్లో సాహిత్యం పట్ల ఉన్న భావుకతను చంపి, 'కవిత్వం' పట్ల గౌరవం లేకుండా చేసినమాట వాస్తవం. అందుకే ఇప్పుడు జానపదాలకు, పద్యాలకు, సినిమా పాటలకు విలువ ఉంది కాని 'సాహిత్య సభలకు, కవి సమ్మేళనాలకు ఎవడూ రావటం లేదు. సాహిత్యానికి ఉన్న ఆత్మను మింగేసిన ఈ గుంపు కవిత్వాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేసింది. ఇప్పుడు కవిత్వం ఒక అంగడి సరుకు. ఇదంతా కవిత్వానికి పట్టిన ఎర్ర చీడ. లిటరరీ రంగంలో ఈ 'రెడ్ టేపిజమ్' జాతికి ప్రమాద సంకేతం! కవులకు అవార్డులు రావడం, జ్యూరీ సభ్యులుగా నియమింపబడటం అనేది అంతర్జాతీయ నేరం కాదు, కానీ ఒకే వర్గ పైత్యం ఇందులో ఉండడం నిందనీయం. అదీ డెబ్భై ఏళ్ల సుదీర్ఘ కాలం నుండి !! మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఎవరూ 'జాతీయవాద’ కవులు, పరిశోధకులు లేరా? వాళ్ల అవకాశాలను వీళ్లు ఇంత నిస్సిగ్గుగా ఎలా తన్నుకుపోతున్నారు! అయిదేళ్లలో వేలకోట్ల బడ్జెట్ అప్పనంగా తినేస్తుంటే - ఈ దేశాన్ని రోజూ కలాల బలంతో తూలనాడుతుంటే జాతిని ప్రేమించే, 'దేశాన్ని ప్రేమించే' కవి పండితుల మనస్సు కళుక్కుమనదా? - డా. పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్​