
ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు చాలా సులభంగా ప్రారంభించవచ్చు. కానీ, ఏ దేశం కూడా యుద్ధం ఎలా ముగుస్తుందో ముందుగా చెప్పలేదు. శక్తిమంతమైన రష్యా 2022 ఫిబ్రవరిలో తన కంటే చిన్న దేశమైన ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించింది. కానీ, రష్యా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో చిక్కుకుపోయింది. జపాన్, జర్మనీ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించినా ఓడిపోయాయి. అమెరికా, ఫ్రాన్స్ వియత్నాంతో 25 సంవత్సరాలు పోరాడి ఓడిపోయాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లతో పోరాడి ఓడిపోయింది. పెద్ద దేశాలు చిన్న దేశాలతో జరిగిన యుద్ధంలో పోరాడి ఓడిపోయిన జాబితా చాలా పెద్దది.
గత 125 సంవత్సరాలలో.. అంటే 1900 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన 95% యుద్ధాలలో ఏ దేశం యుద్ధాన్ని ప్రారంభించినా అది ప్రత్యర్థి దేశం చేతిలో ఓటమిపాలైంది. అయినా పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో యుద్ధం ప్రారంభించారనే అభిప్రాయం సహజం. పాకిస్తాన్ చైనా సహాయ సహకారాల ద్వారా యుద్ధాన్ని సులభంగా కొనసాగించగలదు. భారతదేశం యుద్ధానికి ఖర్చు చేయవలసిన దానితో పోలిస్తే చైనాకు ఇది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మరోవైపు ప్రతిరోజూ భారతదేశం యుద్ధం కోసం ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో శత్రువే ముందుగా యుద్ధాన్ని ప్రారంభించేలా చేయడం అన్నివిధాలుగా మంచిదని చెప్పవచ్చు.
ఒంటరి యుద్ధం అవుతుందేమో?
పాకిస్తాన్‌తో భారత్ తలపడితే ఆ యుద్ధం నిర్ణీత సమయంలో ముగిసిపోతుందని భారతదేశం కూడా స్పష్టంగా చెప్పలేదు. భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అదే విధంగా ద్రవ్యోల్బణం ముప్పు కూడా నెలకొంది. పాకిస్తాన్, చైనా ఇరుదేశాల ప్రజాస్వామ్య దేశాలు కావు. దీంతో ఆ రెండు దేశాల ప్రజలు ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా ఆందోళన చేయలేరు. కానీ, భారతీయులు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉచిత సౌకర్యాలు, నేరుగా నగదు బదిలీలకు అలవాటుపడ్డారు.
ఉచిత పథకాలు ఆగిపోతే క్రమేణా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారతదేశానికి చాలా మిత్రదేశాలు ఉన్నాయని అందరూ భావిస్తుంటారు. కానీ, భారతదేశానికి ఏ దేశంతోనూ సైనిక సహకార ఒప్పందం లేదు. దీంతో భారతదేశం తరఫున ఇది ఒంటరి యుద్ధం అవుతుంది. ప్రస్తుత ఆధునిక హైటెక్ యుగంలో ఇరుదేశాల మధ్య జరిగే యుద్ధం ఏనుగులు, గుర్రాలతో జరగదు. ఈ కాలంలో యుద్ధం కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు వంటి కొత్త అత్యంత ఆధునిక ఆయుధాలతో జరుగుతుంది. ప్రస్తుతం యుద్ధం శైలి మారిపోయింది.
డా. పెంటపాటి పుల్లారావు, సోషల్ ఎనలిస్ట్