గ్రంథాలయాలతో విజ్ఞాన సముపార్జన

విద్య అజ్ఞానంపై సంధించిన వజ్రాయుధమైతే, అజ్ఞాన గాడాంధకారాన్ని తొలగించే అక్షర హారం పుస్తకం. దైవం కొలువున్న ప్రదేశం దేవాలయమైతే, జ్ఞాన జ్యోతిని వెలిగించే గ్రంథాలకు  నెలవైన నిజమైన దేవాలయం గ్రంథాలయం. దేశ స్వాతంత్య్రోద్యమం లోను, సాంఘిక దురాచారాల నుండి మేల్కొలపడం లోను, తెలంగాణలో ఒకప్పటి నిజాం నిరంకుశ పాలన వలన నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితుల నుండి కాపాడి,ప్రజలను జాగృత పరచడంలోను గ్రంథాలయోద్యమం పాత్ర అనిర్వచనీయం. అయ్యంకి వెంకట రమణయ్య తెలుగు వారికి సుపరిచితం.  గ్రంథాలయాల ద్వారా  ప్రజల్లో సామాజిక స్ఫృహ కలిగించాలనే  ఉద్దేశ్యంతో  అవిశ్రాంత కృషి చేసి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొందారు.

గ్రంథాలయోధ్యమకారులు ఎందరో.. 

వేటపాలెం లో ఏర్పడిన సారస్వత నికేతనం  గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి. కేరళ లోని" త్రివేండ్రం పబ్లిక్ లైబ్రరీ" ని  ఇండియాలో మొదటి లైబ్రరీ గా పిలుస్తారు.తెలుగు రాష్ట్రాల్లో 1872 లో సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రాచీన  గ్రంథాలయంగా పేరుగాంచింది. కొమర్రాజు లక్ష్మణరావు కూడా   గ్రంథాలయ ఉద్యమానికి విశేషమైన కృషి చేసాడు. తెలంగాణాలో సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ గొంతు "కాళోజీ" గ్రంథాలయోద్యమంలో  ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు. అనేక ఉద్యమాల ప్రభావంతో అప్పటి  నల్గొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథ నిలయం, వరంగల్​ లో ఆంధ్ర భాషా నిలయం ఏర్పడ్డాయి. తెలంగాణ లో గ్రంథాలయ ఉద్యమం     అత్యంత క్రియాశీలకంగా మారింది. హైదరాబాద్ లోని కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఒక పురాతన గ్రంథాలయం. మన ఆలోచనా సామర్థ్యం పెరగడానికి పుస్తకపఠనమే నిజమైన మితృడు. వర్తమానంలో జరుగుతున్న  ప్రాపంచిక సంఘటనలు, గతంలో జరిగిన వాస్తవ సంఘటనలను గ్రంథస్థం చేసి, రాబోయే తరాలకు అందించడమే చరిత్ర. చరిత్ర అంటే వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్ఠినట్టుగా విశదీకరిస్తూ అక్షరరూపమిస్తూ గ్రంథస్థం చేయడమే. తమ మేధస్సుకు పదును పెట్టి ఆణిముత్యాల వంటి కథాకథనంతో పద్య, గద్య, శిల్ప , చిత్ర, కావ్య రూపాల్లో నాటి సృజనాత్మక శిల్పకారులు, చిత్రకారులు, కవులు విజ్ఙానాన్ని నిక్షిప్తం చేసేవారు. నాటి రచనలు ఎన్ని తరాలకైనా తరగని ఆస్తి. అందుకే మన ప్రాచీనకాలానికి  చెందిన గ్రంథాలు ఈనాటికీ పండిత పామరుల చేత విశేష జనాదరణ పొందుతున్నాయి. ప్రతీ ఒక్కరూ పుస్తకాలను చదవాలని, విజ్ఞాన సముపార్జన జరగాలని, దానితోనే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుందని అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలని, ఎందరో విజ్ఞులు గ్రంథాలయల కోసం ఉద్యమించారు. ఇండియన్ లైబ్రరీ అసోషియేషన్ ఆవిర్భవించడానికి  ఆద్యుడు అయ్యంకి వెంకట రమణయ్య. ఎందరో మహనీయుల కృషి ఫలితమే నవంబర్ 14 వతేదీన భారత ప్రభుత్వం "జాతీయ గ్రంథాలయ దినోత్సవం" గా ప్రకటించింది. నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు "గ్రంథాలయ వారోత్సవం" గా ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా దేశం నలుమూలలా అనేక గ్రంథాలయాలను స్థాపించి సామాన్యులందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మనోవికాసానికి పఠనం అవసరం

అయితే విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లిన గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్నది. సాంకేతిక విజ్ఞానం క్రొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో గ్రంథ పఠనం  ప్రాధాన్యత కోల్పోయింది. మొబైల్​ ఫోన్ పుస్తక స్థానాన్ని ఆక్రమించింది. మన ఆలోచనలకు పదును పెట్టి, మానసిక వికాసం కలిగించిన గ్రంథాలయాలు వెల వెలబోతున్నాయి. మరో గ్రంథాలయోద్యమం ప్రారంభం కావలసిన అవసరం ఏర్పడింది.  మన గ్రంథాలయాలు  మన  పురాతనమైన వెలకట్టలేని ఆస్తిపాస్తులు. వాటిని కాపాడుకోవాలి. పుస్తక పఠనం పై నేటి విద్యార్థికి ఆసక్తిని కలిగించాలి. పుస్తక పఠనమే మన ఆలోచనా నేత్రాల సక్రమ వీక్షణకు సవ్యమైన మార్గం. అజ్ఞానానికి నిజమైన ఔషధం విలువైన పుస్తకం. గ్రంథాలయ వారోత్సవాల స్ఫూర్తి  గ్రంథాలయాల ఆవశ్యకతకు దోహదం చేయాలి. - సుంకవల్లి సత్తిరాజు,సోషల్​ ఎనలిస్ట్