- సర్వేలు, ప్రచార ప్లానింగ్ అంతా వీళ్ల చేతుల్లోనే
- ఎన్నికల నాటికి లక్ష మంది క్యాంపెయినర్లు
- పార్టీలు, లీడర్ల కోసం పుట్టుకొస్తున్న స్ట్రాటజీ సంస్థలు
- అభ్యర్థులు, పార్టీలతో ఒప్పందాలు..
- లక్షల నుంచి కోట్లలో ప్యాకేజీలు
- వందల సంఖ్యలో రిక్రూట్మెంట్లు
- వీళ్లకు రూ.12 వేల నుంచి లక్షల్లో జీతాలు
- వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికలుగా ప్రచారం
వచ్చే ఎన్నికల కోసం సోషల్ మీడియా సైన్యం తయారవుతోంది. అభ్యర్థులకు ఎన్నికల వ్యూహాలు అందించేందుకు స్ట్రాటజిస్టు సంస్థలు పుట్టుకొస్తున్నాయి. గెలుపునకు అవసరమైన అన్ని రకాల వ్యూహాలను రూపొందిస్తున్నాయి. నియోజకవర్గాల సర్వేల నుంచి మొదలుపెట్టి.. పోలింగ్ రోజు దాకా క్యాండిడేట్ అనుసరించాల్సిన ప్రణాళికను అందజేస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లందరూ ఈ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. జనాన్ని తమ లైన్‌లోకి తెచ్చుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: ఇప్పుడు ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా సమాచారం వేగంగా చేరిపోతుంది. దీంతో పొలిటీషియన్లు జనంలోకి వెళ్లేందుకు స్ట్రాటజిస్ట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పదికి పైగా పెద్ద సంస్థలు.. వందల సంఖ్యలో చిన్నా చితక సంస్థలు లీడర్ల కోసం పనిచేస్తున్నాయి. అందులో కొన్ని రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్‌తో పని చేస్తుంటే, మరికొన్ని జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్నాయి. ముందుగా ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థలు.. తమ ఉద్యోగులతో క్యాండిడేట్ల తరఫున సోషల్ మీడియా వేదికలపై ప్రచారానికి రూపకల్పన చేస్తున్నాయి. అభ్యర్థికి సంబంధించిన అన్ని అంశాలను ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా జనంలోకి
తీసుకుపోతున్నాయి.
రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్లు:
సోషల్ మీడియా ప్రచారం కోరుకునే నేతలు కన్సల్టెన్సీల ద్వారా సోషల్‌మీడియా ఆర్మీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఫలానా నియోజకవర్గంలో ఎంతమంది కావాలో చెబుతూ పని, జీతం వివరాలను అందులో పేర్కొంటున్నారు. వసతి, భోజనం ఏర్పాటు చేస్తామని, ట్రావెలింగ్ అలవెన్సులు ఇస్తామని చెబుతున్నారు. ఇట్ల ఇప్పటికే వందల సంఖ్యలో నోటిఫికేషన్లు రిలీజయ్యాయి. ఒక్కో అభ్యర్థి కోసం 10 నుంచి 20 మందిని పెట్టుకుంటున్నారు. ఇందుకోసం రూ. 12 వేల బేసిక్ శాలరీ నుంచి రెండు లక్షల వరకు జీతాలను చెల్లిస్తున్నారు. నాలుగైదేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.90 వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఈ సంఖ్య భారీగా పెరుగుతూ పోనుంది. ఒక్కో అభ్యర్థి వంద మంది దాకా సోషల్ మీడియా సిబ్బందిని నియమించుకునే అవకాశాలు ఉన్నాయని ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సోషల్ మీడియా ఫోర్స్ పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మామూలు లీడర్లు కూడా నలుగురైదుగురు వ్యక్తిగత సోషల్ మీడియా క్యాంపెయినర్లను నియమించుకున్నారు. పెద్ద లీడర్లు, పార్టీ చీఫ్‌ల కోసం 50 మంది నుంచి 100 మంది వరకు పని చేస్తున్నారు. పార్టీ తరఫున పని చేసే వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే లీడర్ల కోసం కనీసంగా పది వేల మంది పని చేస్తున్నారు.
మీడియాపై ప్రభావం
సర్వే సంస్థలు, కొందరు అభ్యర్థులు ఇచ్చే జీతాలు ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది మీడియా నుంచి స్ట్రాటజిస్టులుగా, సోషల్ మీడియా క్యాంపెయినర్లుగా షిఫ్ట్ అవుతున్నారు.
మీడియాలో పని చేయడం వల్ల రాజకీయంగా, సామాజికంగా అవగాహన ఉంటుందని జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లను రిక్రూట్ చేసుకునేందుకు స్ట్రాటజీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కొందరు క్యాండిడేట్లు కూడా డైరెక్ట్‌గా మీడియాలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి భారీ జీతాలు ఇవ్వడంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు. చివరకు నియోజకవర్గ, మండల స్థాయిలో పని చేసే రిపోర్టర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. సర్వేలు, అభిప్రాయ సేకరణ, పీఆర్, తాజా వ్యూహాల కోసం వీళ్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. దాంతో మీడియాపై బాగానే ప్రభావం పడుతోంది.
ఏం చేస్తరంటే..?
ప్రచారం బిజీలో ఉన్న అభ్యర్థి.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడం కష్టం. జనం ఏమనుకుంటారో పసిగట్టడం కూడా సాధ్యం కాదు. కార్యకర్తలు చెప్పే సమాచారంపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే న్యూట్రల్‌గా ఉండి, వాస్తవాన్ని వివరించే స్ట్రాటజీ సంస్థలపై ఆధారపడడం బాగా పెరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే, చేయాలనుకునే అభ్యర్థులకు సోషల్ మీడియా టీమ్ వెన్నెముకలా పని చేస్తుంది. స్ట్రాటజీ సంస్థకు చెందిన సోషల్ మీడియా టీమ్స్.. ముందుగా అభ్యర్థి తరఫున నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తాయి. అభ్యర్థికి అనుకూలమైన, ప్రతికూలమైన అంశాలను సేకరిస్తాయి. పథకాల తీరుతెన్నులపై అంచనా రూపొందిస్తాయి. కులం, మతం, ఏజ్ ఆధారంగా రకరకాల అభిప్రాయాలను శాంపిళ్ల రూపంలో సేకరిస్తాయి. ఈ శాంపిళ్లను సంస్థలోని అనలిస్టులు విశ్లేషిస్తారు. దీని ఆధారంగా స్ట్రాటజీలను రూపొందిస్తారు. అభ్యర్థి క్యాంపెయినింగ్ కోసం ఎంచుకోవాల్సిన స్లోగన్లు, స్పీచ్ మొదలుకొని అన్ని రకాల ప్రచార అంశాలను సిద్ధం చేస్తారు. ప్రాంతాలవారీగా, జనసమూహాల వారీగా అంశాలను ఎంపిక చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రచారం చేస్తారు. క్యాండిడేట్‌కు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ రోజువారీ స్ట్రాటజీలను మారుస్తూ ఉంటారు.
టీమ్ ఇట్లుంటది
ప్రొఫెషనల్‌గా పని చేసే సంస్థల్లో నియోజకవర్గాల వారీగా టీమ్ లీడర్స్‌తో కూడిన ఒక గ్రూప్ ఉంటుంది. హెచ్ఆర్ గ్రూప్, పీఆర్ గ్రూప్, సీనియర్ ఎలక్షన్ క్యాంపెయినర్లు, అసోసియేట్ అనలిస్టులు, ఫీల్డ్ సర్వేయర్లు ఉంటారు. అదనంగా సోషల్ మీడియా క్యాంపెయినింగ్ టీమ్ ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లు, గ్రాఫిక్ డిజైనర్లలాంటి టీమ్ కూడా ఉంటుంది.
ముందస్తు సర్వేలు షురూ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న అంచనాలతో రాష్ట్రంలో ఇప్పటికే ముందస్తు సర్వేలు షురూ అయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇందుకు సర్వే ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు15 నుంచి 20 మందితో సర్వే చేయిస్తున్నరు. నియోజకవర్గంలో పరిస్థితి ఎట్ల ఉంది, ఏ సమస్య ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది, ప్రజలు ఏమనుకుంటున్నరు, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నరు, ఎమ్మెల్యే అభ్యర్థిపై అనుకూలంగానే ఉన్నారా లేక వ్యతిరేకంగా ఉన్నారా, అందుకు కారణాలు ఏంటి.. తదితర 15 నుంచి 25 ప్రశ్నలతో క్వశ్చనీర్ తయారు చేసి సర్వే చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, అన్ని వయసుల వారినీ కవర్ చేస్తున్నారు. వచ్చే సమాధానాల ఆధారంగా రిపోర్ట్ తయారు చేసి ఇస్తున్నారు. రిపోర్టుల్లోని అంశాలను పరిశీలించి ఎమ్మెల్యేలు, అభ్యర్థులు తమ ప్లస్‌లు, మైనస్‌లను బేరీజు వేసుకుంటున్నారు. ఏం చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నరు.
హద్దులు దాటుతున్న ఫేక్ ప్రచారం
ప్రచారంలో భాగంగా పార్టీలు గ్రామాల్లోని ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి.. గెలిస్తే ఏం చేస్తామో చెబుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌లో ఫేక్ ప్రచారం పీక్ స్టేజీకి చేరుకుంటున్నది. దేన్ని నమ్మాలో, నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటున్నది. ఒక లీడర్‌కు అనుకూలంగా, మరో నేతకు వ్యతిరేకంగా ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారు. ఫలానా నేత పార్టీ మారబోతున్నారని, ఆ పార్టీలోని కీలక నేతను కలిశారని ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు.
మూడు దశల్లో సర్వే
మూడు దశల్లో సమాచారం సేకరిస్తం. కులాలవారీగా సమాచారం తీసుకుంటం. ప్రభుత్వ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు, పొందని వారెవరో వివరాలు తీసుకుంటం. ఆదాయాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల అభిప్రాయాలు సేకరిస్తం. ఫ్యామిలీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని సమాచారం సేకరిస్తం. ఫీల్డ్ సర్వేయర్ల సమాచారాన్ని ఎనలైజ్ చేసి దాని ఆధారంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై ఎలాంటి ప్రచారం చేయాలో స్ట్రాటజీలు రూపొందిస్తం. తొలి దశలో సర్వేకు 50 మందిని రిక్రూట్ చేస్తం.
- రంజిత్ కుమార్, స్ట్రాటజీ సంస్థ నిర్వాహకుడు
గెలుపు దాకా వెంట ఉంటం
ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థలకు డిమాండ్ పెరుగుతున్నది. అభ్యర్థి రంగంలోకి అడుగు పెట్టిన నుంచి ఎన్నికల్లో గెలిచే దాకా అన్ని రకాల వ్యూహాలు రూపొందిస్తాం. ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి. వెయ్యి మందికి 20 శాంపిళ్లు తీసుకుంటాం. అందులో అన్ని కులాలు, వర్గాలు ఉండేలా చూసుకుంటాం. ఈ సమాచారం అంతా హెడ్ ఆఫీసుకు చేరుతుంది. దాన్ని అనలైజ్ చేసి, వ్యూహాలు అభ్యర్థికి అందజేస్తాం. ప్రస్తుతం అభ్యర్థుల వారీగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. వాళ్ల స్తోమతను బట్టి చార్జ్ చేస్తాం. సర్వేయర్లకు ఒక్కో శాంపిల్‌కి రూ.150 దాకాచెల్లిస్తాం. సిబ్బందికి కూడా వారి పొజిషన్ బట్టి జీతాలు ఉంటాయి.
- రజనీకాంత్ ఎర్రబెల్లి, రాజ్‌నీతి స్ట్రాటజీస్ ఫౌండర్
రెండు నెలల్లో మస్తు డిమాండ్
ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా సర్వేలు జరుగుతున్నాయి. ఒక్కో నియోజకర్గానికి 15 మంది దాకా సర్వే చేస్తున్నారు. స్థానికంగా పరిస్థితి ఎలా ఉందనే దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే సర్వే చేస్తున్నం. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా లోటుపాట్లను పార్టీలు సరిచేసుకుంటాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల శాంపిల్స్ తీస్తున్నాం. సర్వే సిబ్బందికి శాంపిల్‌ను బట్టి పే చేస్తున్నం. ఎన్నికలు దగ్గర పడటంతో మరో రెండు నెలల్లో మస్తు డిమాండ్ ఉండనుంది.
- విక్రమ్, సన్‌షైన్ రీసెర్చ్ ప్రతినిధి