బడా నేతలు వర్సెస్ ప్రజా నాయకులు : డా. బూరనర్సయ్య గౌడ్

సాధారణంగా ఒక వ్యక్తి లేదా వ్యవస్థ కింది స్థాయి నుంచి పైకి వచ్చేటప్పుడు సమాజ ప్రవర్తన పలు దశల్లో ఉంటది. మొదట నిన్ను విస్మరిస్తారు, తర్వాత అవహేళన చేస్తారు, తదుపరి విమర్శిస్తారు, ఆ తదుపరి అడ్డుకుంటారు, చివరకు దాసోహం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గురించి కొన్ని పార్టీలు లేదా సంస్థలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. మొదట బీజేపీ అసలు ఎక్కడ ఉంది అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవహేళన చేశారు, పార్లమెంటు ఎన్నికల తర్వాత విమర్శ మొదలు పెట్టారు, ఇక ప్రజా సంగ్రామ పాదయాత్రలో అడ్డుకున్నారు, హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడులో ఎదిరించడం మొదలు పెట్టారు. ఇక హైదరాబాద్ మున్సిపల్​ఎన్నికలు,11 వేల కార్నెర్ మీటింగుల తర్వాత, ప్రజల మద్దతు ప్రబలంగా ఉన్నదని ఇప్పుడు బీజేపీకి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.

తె లంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో అభ్యర్థులు అత్యధికమంది మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసినవాళ్లు. విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు, లేదా ఇతర సాదా సీదా నాయకులు మాత్రమే. సంపన్నులు కారు లేదా రాజకీయ కుటుంబాల వారసులు కారు. అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టడానికి  టీఆర్ఎస్​కు అభ్యర్థులు లేరు. అప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ టీఆర్ఎస్ నాయకులను చూసి అవహేళన చేసిన రోజులు అవి. కానీ టీఆర్ఎస్​ పార్టీ, కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలతో ఒక్క సారి ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలను అడిగితే ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. బడా నాయకులను చూసి కాదు. ప్రజలు తలచుకుంటే, నమ్మకం కల్గించగలిగితే , బడా నాయకులు కూడా మట్టికరుస్తారు. 

100 కోట్లకు తగ్గకుండా ఎమ్మెల్యేల ఆస్తులు

9 ఏండ్ల టీఆర్ఎస్​ పాలనలో 75 ఏండ్లలో జరిగిన అవినీతి కంటే ఎక్కువ జరిగింది. 2014 లో సైకిల్ కూడా లేని టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఇప్పుడు బిలియనీర్లు అయ్యారు. ఉద్యమంలో వందల కేసులు ఉన్నాయని ప్రచారం చేసిన వారు.. ఇయ్యాల వందల కోట్లకు అధిపతులయ్యారు. ఉద్యమం సమయంలో పైసా పైసా కోసం కట కట లాడిన టీఆర్ఎస్ నాయకత్వం, ఇప్పుడు యావత్తు భారతదేశంలోని రాజకీయ పార్టీలకు రాజకీయ పెట్టుబడి పెట్టేస్థాయికి ఎదిగింది. ప్రపంచంలో అత్యంత పెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి సొంత హెలికాప్టర్ కూడా లేదు. కానీ కేవలం 3% జనాభా పాలించే తెలంగాణ రాష్ట్ర నాయత్వం సొంత విమానం కొనే స్థాయికి ఎదిగింది.

క్లుప్తంగా చెప్పాలంటే బిలియనీర్(100 కోట్లు)కు తగ్గని టీఆర్ఎస్​ఎమ్మెల్యే లేడంటే అతిశయోక్తి కాదు.  బీజేపీలో సిద్ధాంతపరమైన, విద్యావంతులైన, విద్య రాజకీయాల దశ నుంచి రాటు తేలిన నాయకత్వం ఉంది. తెలంగాణలో కనీసం 300 మంది ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థాయి నాయకులు ఉన్నారు. పరిపాలన రంగంలో, వ్యవసాయం నుంచి వ్యాపారం, విద్య నుంచి వైద్యం, టెక్నాలజీ నుంచి ఫ్యూచర్ గురించి సొల్లు కాకుండా సబ్జెక్టు ఉన్న బూర లాంటి, వివేక్ వెంకట్ స్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఈటల, జితేందర్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి లాంటి ఉద్యమ నాయకులు ఎందరో ఉన్నారు. తెలంగాణ బీజేపీ రథ సారధి బండి సంజయ్ నాయకత్వం, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీ కృష్ణుడిలా యుద్ధతంత్రాన్ని నడిపించే మోడీ, యుద్ధ దళపతి అమిత్ షా, పంచ పాండవుల లాగ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, భీముడి లాంటి అర్వింద్​ ఇలా ఎందరో ఉన్నారు.

పార్టీని చాకచక్యంగా నడిపించే మనోహర్ రెడ్డి, ప్రదీప్, వెంకటేశ్వర్లు, బంగారు శృతి, ప్రేమేందర్ రెడ్డి లాంటి అనేకమంది ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థుల జాబితా హనుమంతుడి తోకలా ఉంది. ఇలా ఒక్కో నియోజక వర్గంలో పోటీపడే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.  ఇక హైదరాబాద్ లోని కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఆరితేరిన నాయకులు ఉంటారు. కాంగ్రెస్ లో ఉండే నాయకత్వం ఎప్పుడూ కీచులాడుకుంటారు కాబట్టి మీడియాలో కనిపిస్తారు. బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో పనిచేసే బీజేపీ నాయకులది ప్రచారం తక్కువ, పనితనం ఎక్కువ ఉంటది. 

బీజేపీ నాయకత్వం 

బీజేపీది సిద్ధాంతపరమైన దీర్ఘకాలిక రాజకీయం. డ్రిప్ ఇరిగేషన్ లాగా ఎక్కడ తడి పొందాలో అక్కడే నీళ్లిచ్చే సిస్టం. తెలంగాణ నేటి హంగు, ఆర్బాటం, చుక్క, ముక్క, రుక్క రాజకీయాలు కాకుండా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రాజకీయాలు. ఇక్కడి నాయకులూ వామన అవతారం లాగ పొట్టివారిగానే కనిపించవచ్చు. కానీ మహా బలి చక్రవర్తిని కూడా పాతాళానికి తొక్కే శక్తి ఉన్నవారు. ఒక్కసారి వారిలో ప్రభుత్వం రావాలనే కమిట్​మెంట్ వస్తే, తమ మాట తామే వినరు. బీఆర్ఎస్ వి గాలి రాజకీయాలు అయితే, బీజేపీవి గతి రాజకీయాలు. ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 7.1% ఓట్లు వస్తే, 2019 పార్లమెంటు ఎన్నికల్లో అవి 19.45% వచ్చినవి. కేవలం 4 నెలల వ్యవధిలో, అదే త్రిపురలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.5% వచ్చి ఒక అసెంబ్లీ స్థానం కూడా గెలవలేదు. కానీ అదే బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 43.59% ఓట్ల శాతంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే బీజేపీ మోక్ష మాక్రో, బూత్ మైక్రో రాజకీయాలకు ప్రతీక. 

సిద్ధాంతమా ? డబ్బా?

గతంలో తెలంగాణ సెంటిమెంట్, క్యారెక్టర్ మీద గెలిచిన బీఆర్ఎస్, ఇప్పుడు కేవలం క్యాష్ నమ్ముకుంది. బీఆర్ఎస్​ ఇచ్చే లేదా కేసీఆర్ ఇచ్చే పథకాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే గతి అని తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. తెలంగాణలో సంక్షేమ పథకాల నిజమైన ప్రదాత మద్యం బాటిల్ అని ప్రతి ఓటరుకు తెలిసింది. ఆ పప్పులు ఇక ఉడకవు. బీజేపీ మాత్రం సిద్ధాంతం, అందరి ప్రగతి, శాశ్వత ప్రగతి, పేద మధ్య తరగతికి అవసరం అయ్యే కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి అనే పంచతంత్రంతో ముందుకు వెళ్లి కోటి ఓట్లు, 90 సీట్లు, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. అందరి తెలంగాణ.. ఆత్మగౌరవ తెలంగాణ.. అభివృద్ధి తెలంగాణ సాకారం కావాలంటే తెలంగాణాలో కమలం వికాసం ఎంతైనా అవసరం.

- డా. బూరనర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ భువనగిరి, బీజేపీ లీడర్