విశ్లేషణ: కులాల లెక్కలు తీస్తేనే సామాజిక న్యాయం 

దేశంలో ప్రతి కులానికి సంబంధించిన వివరాలు సరిగ్గా ఉండేలా జనాభా లెక్కల సేకరణ జరగాలన్న డిమాండ్‌‌ ఎప్పటి నుంచో ఉంది. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) లెక్కలు తీస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా లెక్కల సేకరణలో ఇప్పటి దాకా షెడ్యూల్డ్ కులాల గురించి, షెడ్యూల్డ్ తెగల గురించి మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇతర వెనకబడిన కులాల గురించి కూడా వివరాలు సేకరించాలనే డిమాండ్‌‌ తెరపైకి వచ్చింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఈ కులాల లెక్కలు తీయాలనే అంశం సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఎన్డీయేకు మద్దతిచ్చే పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి 2021లో చేపట్టబోయే జనాభా లెక్కల్లో కులాల లెక్కలు తీయాలని డిమాండ్​ చేస్తున్నాయి.

హిందూ మతంలో అగ్ర, నిమ్న కులాల భావన శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. కానీ, అన్ని కులాలకు సంబంధించి సరైన లెక్కలు లేవు. అయితే, వెనకబడిన కులాలుగా పిలిచే వారు 52 శాతం మంది వరకు ఉంటారని ఒక అంచనా. వీరినే ఇతర వెనుకబడిన కులాలుగా(ఓబీసీ) గుర్తించారు. ప్రతి పదేండ్లకోసారి దేశంలో జనాభా లెక్కిస్తున్నా, అందులో దళితులు, ఆదివాసీల సంఖ్యపైన మాత్రమే స్పష్టమైన సమాచార సేకరణ ఉంటుంది. ఓబీసీలు ఎందరున్నారనే లెక్కలు మాత్రం లేవు. వయసు, లింగం, వైవాహిక స్థితి, గృహ కూర్పు, కులం, ఎస్సీ, ఎస్టీ, మతం, ఆర్థిక కార్యకలాపాలు, అక్షరాస్యత, గ్రామీణ-పట్టణ కూర్పు, భాష, వైశాల్యం, వలస వంటి వివిధ వర్గాల జనాభాను లెక్కిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల రూపకల్పన,  అమలు కోసం జనాభా లెక్కలు అత్యంత ప్రధానమైన సమాచారంగా ఉపయోగపడుతోంది.

1881లో మొదటిసారిగా

మనదేశంలో జనాభా లెక్కల సేకరణకు సంబంధించి 1865--–1872 నుంచి ప్రయత్నాలు మొదలైనప్పటికీ, 1881లో తొలిసారిగా పూర్తి స్థాయి జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. స్వాతంత్ర్యానికి ముందు అన్ని వర్గాలు, కులాలకు సంబంధించిన సమాచారాన్ని జనాభా లెక్కల్లో సేకరించారు. 1931లో జనాభా లెక్కల్లో కులాలకు సంబంధించిన సమాచారాన్ని తొలిసారిగా సేకరించారు. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్(కాకా కలేల్కర్ కమిషన్), రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్(మండల్ కమిషన్)కు ఈ సమాచారమే పునాది. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలకు సంబంధించిన పబ్లిక్ పాలసీలను రూపొందించడానికి ఆయా వర్గాలకు సంబంధించిన సామాజిక, విద్య, ఆర్థిక వెనుకబాటుతనం సమాచారం చాలా కీలకం. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌‌వర్డ్ క్లాసెస్(ఎన్‌‌సీబీసీ), జస్టిస్ రోహిణి కమిటీ(ఓబీసీ ఉప వర్గీకరణ) రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు సరైన సమాచారం లేక అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

న్యాయపరమైన అడ్డంకులు తొలగుతాయి
కులాల లెక్కలు తీయడం వల్ల సమాజాన్ని కులాల ప్రాతిపదికన విభజిస్తుందని కొన్ని వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయానికి వస్తే, భారతీయ కుల వ్యవస్థ ఇప్పటికే సమాజాన్ని విభజించి, అనేక వర్గాల ప్రజలను సమాజానికి దూరంగా నెట్టివేసింది. ప్రభుత్వం మతంతో పాటు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు, ఓబీసీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం వల్ల వచ్చే నష్టం ఏముంది? ఒడిశా వంటి రాష్ట్రాలు రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా సంస్థలైన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సామాజిక, విద్యలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను కూడా అందించడం లేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌గఢ్, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాలు 15% కంటే తక్కువ రిజర్వేషన్లను అందిస్తున్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాలు న్యాయపరమైన సమస్యల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించాయి. ఈ రాష్ట్రాలు ఎక్కువ ఎస్సీ, ఎస్టీ జనాభాను కలిగి ఉన్నాయి. రాజ్యాంగం వారి జనాభాకు అనులోమానుపాతంలో రిజర్వేషన్లను అందిస్తుంది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు అందించడం న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు సమాచారంతో మాత్రమే న్యాయ వ్యవస్థను ఒప్పించగలవు. సీలింగ్ పరిమితిని దాటి ఓబీసీలకు రిజర్వేషన్‌‌ను విస్తరించగలవు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుల గణన హిందూ ఓబీసీలకు ముప్పుగా పరిణమిస్తుందనే వాదన హాస్యాస్పదంగా ఉంది. హిందూ ఓబీసీలు ఇతర మత విశ్వాసాల కంటే, హిందూ మతంతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు. ఓబీసీల సాధికారత కోసం చేసే ఏ ప్రయత్నాలైనా హిందూ మతం బలోపేతం కావడానికి, హిందువుల ఐక్యతకు దారితీస్తుంది. 

కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు
కులాల లెక్కలు తీయడం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ ఈ కులాల లెక్కల వల్ల కింది స్థాయి నుంచి సరైన సమాచారం  ద్వారా ఆయా వర్గాల్లో ఉన్న పేదరికాన్ని, ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, ఉన్నతమైన అభివృద్ధికి సంబంధించిన కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. కులాల లెక్కల ద్వారా సేకరించిన సమాచారం, సర్వేల ద్వారా సేకరించిన సమాచారం కంటే కచ్చితత్వాన్ని అందిస్తుంది. ఈ లెక్కల వల్ల దేశంలోని ఓబీసీలకు సాధికారత కల్పించే విధానాలను రూపొందించే ఏ చర్యలు అయినా, రాజ్యాంగ స్ఫూర్తిలో ఒకటైన సామాజిక న్యాయాన్ని సాధించడానికి సహాయపడతాయి. సమ సమాజాన్ని నిర్మించడానికి దేశానికి ఉపయోగపడతాయి.
                                                           - జి.కిరణ్ కుమార్, జాతీయ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్