
వెనుకబడిన తరగతులు (బ్యాక్వర్డ్ క్లాసెస్ )కు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ చరిత్రాత్మక ఘట్టం ఈ నెల 17న తెలంగాణ శాసనసభలో ఆవిష్కారమైంది. తెలంగాణలోని వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు విద్యాసంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు 2025 బిల్లులు రెండింటిని ఆమోదించారు.
మార్చి 17 బీసీలకు చారిత్రాత్మక దినోత్సవంగా చెప్పవచ్చును. స్వాతంత్య్ర భారతదేశంలో ఏ పాలకుడు చేయని సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. బ్రిటిష్ పాలనలో 1931లో చేసిన కులగణన తర్వాత 2025 వరకు మళ్లీ కులగణన జరగలేదు. అణగారిన వర్గాలు కోల్పోయిన హక్కులను రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో లేవనెత్తారు.
తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణనను చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కులగణనకు నడుం బిగించి ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని రేవంత్ రెడ్డి సంకల్పానికి... 4 ఫిబ్రవరి 2024న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ 16 ఫిబ్రవరి 2024 తీర్మానం చేసింది.
శాస్త్రీయంగా కులగణన
కులగణనను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చేసింది. మొదట 2024 నవంబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలోని ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ చేసింది. నవంబర్ 9న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేను గవర్నర్ ప్రారంభించారు. సర్వే పూర్తికి 50 రోజులు పట్టింది.
1, 15,71,457 కుటుంబాలను లిస్ట్ చేస్తే 1, 12,15,134 పాల్గొన్నాయి. 3,56,323 కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. 3, 54,77,554 మంది ఉంటే బీసీలు 1,64,09,179(46.25%) ఎస్సీలు 61,84,319 (17.43%), ఎస్టీలు 37,76,588 (10.08%), ముస్లిం మైనార్టీ బీసీలు 35,76,588(10.08%), ముస్లిం మైనార్టీ ఓసీలు 8,80,424 (2.48%), ఓసీలు 47,21,115 (13.31%) ఇందులో బీసీలు, బీసీ మైనారిటీలు కేటగిరివారీగా A నుంచి E వరకు కలిసి 1,99,85,767(56.33) మంది ఉన్నారు. ఇక ఓసీలు, మైనార్టీ ఓసీలు కలిసి 56,01,539(15.79%) మంది ఉన్నారు.
2014లో కేసీఆర్ చేపట్టిన సమగ్ర కులగణన లెక్కలు ఒక్కరోజులో తూతూ మంత్రంగా చేపట్టారు. వాటికి చట్టబద్ధత, శాస్త్రీయంగా జరగలేదన్నది వాస్తవం. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్స్ తోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన మాత్రమే శాస్త్రీయమైనది. దశాబ్దాలుగా బీసీ వర్గాలు ఎదురుచూస్తున్న 42 శాతం రిజర్వేషన్స్ బిల్లుతో వారి చిరకాల స్వప్నం నెరవేరనున్నది. బహుజనుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా అమలుచేసిన ఘనతను దక్కించుకున్నారు.
బీజేపీపై బాధ్యత
భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో తాము బీసీల పక్షపాతమని, స్వయంగా దేశ ప్రధాని బీసీ బిడ్డ అని బీజేపీ చెపుతుంటారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్స్ బిల్లు పార్లమెంటులో ఆమోదించే బాధ్యత వారిపై ఉన్నది. ప్రధాని మోదీ పలుమార్లు ‘నేను చాయ్ వాలా’ అంటూ చెప్పుకోవడం దేశ ప్రజలకు గుర్తుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపనున్నారు. పార్లమెంటు ఉభయసభల ఆమోదం, షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చేలా చూడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత. వక్రబుద్ధితో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు బీసీ ద్రోహులుగా మారటం ఖాయం. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ బీసీలపట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తేటతెల్లం కానుంది.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బీసీ 42% రిజర్వేషన్స్ బిల్లు ఆమోదింపచేయడం బీజేపీ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంకల్పబలం ఉన్న రేవంత్ రెడ్డి అనతికాలంలో అన్ని వర్గాల ప్రశంసలు అందుకున్నారు. తన 16 నెలల పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
దళిత, బహుజనుల ఆత్మీయ బంధువు రేవంత్
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, తనను నమ్మి తెలంగాణ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ మాటలను శిరసావహిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లకి రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి జనం జేజేలు పలుకుతున్నారు. అబద్ధాలతో, మోసాలతో అందలం ఎక్కి 10 సంవత్సరాలు దోచుకున్న కేసీఆర్ అరాచకాన్ని చూసిన జనం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
అందుకే కాబోలు సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో జనం మా నాయకుణ్ని చూసి ఓటు వేశారు. మీ రుణం తీర్చుకుంటాను అని పదేపదే చెపుతుంటారు. ప్రజాదరణ ఉన్న నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణతో రేవంత్ రెడ్డికి ప్రజాదరణ మరింత పెరిగింది.
దళిత, బహుజన వర్గాలకు రేవంత్ రెడ్డి ముమ్మాటికి ఆత్మీయబంధువే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వారి పాలనలో జరిగిన మేలుకు గుర్తుగా ‘అభినవ ఫూలే’గా ఆయా వర్గాలు భావిస్తున్నాయి. 42% రిజర్వేషన్స్ బిల్లుతో బీసీలకు సంపూర్ణ సామాజిక న్యాయం జరగనున్నది.
- పున్నా కైలాష్ నేత,జనరల్ సెక్రటరీ,టీపీసీసీ–