కరీంనగర్, వెలుగు: తెలంగాణలో సామాజిక న్యాయం బీసీ ముఖ్యమంత్రి ద్వారా మాత్రమే సాధ్యమని, ఆ దిశగా బీసీలు తమ ఓటు తామే వేసుకుని అత్యధిక ఎమ్మెల్యే సీట్లు సాధించాలని తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్స్ లో శనివారం తెలంగాణలో సామాజిక న్యాయం - - బీసీ ముఖ్యమంత్రి సాధన సదస్సు పేరిట నిర్వహించిన సభకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. ఏడు శాతం కూడా లేని ఆధిపత్య కులాలను సీట్లు అడుక్కోవడం సిగ్గుచేటన్నారు. మెజార్టీ వర్గాలే వారికి బీఫామ్ ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. సీఎల్పీ నేతగా బీసీని చేస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తేనే కాంగ్రెస్ ను బీసీలు నమ్ముతారని స్పష్టం చేశారు. అరవై ఏళ్లు రాష్ట్రాన్ని రెడ్లే పరిపాలించారని, బీసీలకు పాలించే అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ దొరల రాజ్యం పోవాలనే తాను 30 ఏళ్లుగా తిరుగుతున్నానని తెలిపారు. తెలంగాణ వస్తే దొరల రాజ్యం వస్తదని అప్పుడే అన్నలు తనను హెచ్చరించారని, వారు అన్నట్లే దొరల రాజ్యం వచ్చిందని గుర్తు చేశారు.