సామాజిక న్యాయం కాంగ్రెస్​కే సాధ్యం

సామాజిక న్యాయం కాంగ్రెస్​కే సాధ్యం

తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ చారిత్రాత్మక దినోత్సవం. జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ముందడుగు వేసింది. 

జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఎన్నికల ముందే కార్యాచరణ రూపొందించి 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తోంది. వెనుకబడిన కులాలకు సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతో కులగణన చేపట్టి, పూర్తిచేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న రాహుల్ గాంధీ సముచిత నిర్ణయాన్ని తొలిసారిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతగా గర్విస్తున్నాను. బీసీల అభివృద్ధి కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో  ప్రధాన అంశంగా ప్రతిపాదించిన కులగణనను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి తమది బడుగు, బలహీన వర్గాల పక్షపాత ప్రభుత్వమని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంది.   

ఎస్సీల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కూడా ఆమోదించిన మంత్రివర్గం, కాలయాపన చేయకుండా అదేరోజు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడంతో పాటు, వాటిని ఆమోదించి బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై తమకున్న నిబద్ధతను నిరూపించుకుంది. 

ఈ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని ఇచ్చిన పిలుపు స్వాగతించాల్సిన అంశం. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తీర్మానాలు చేయడం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది.

చారిత్రాత్మక ఘట్టం 

స్వాతంత్ర్య భారతదేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కులగణన సర్వేకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు రూ.160 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. అధికారికంగా 2024 ఫిబ్రవరి 4వ తేదీన సర్వే ప్రక్రియ ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4వ తేదీని పూర్తి చేసింది. 

క్షేత్రస్థాయిలో 2024 నవంబర్ 6వ తేదీన  సర్వే మొదలుపెట్టి 2024 డిసెంబర్ 25తో  పూర్తి చేసింది. 3.70 కోట్ల  జనాభా గల తెలంగాణలో 3.54 కోట్ల మంది నుంచి శాస్త్రీయ పద్ధతిలో   సమాచారం సేకరించింది.  సర్వేలో  ఎలాంటి గందరగోళం లేకుండా ఒక్కో యూనిట్ 150 ఇళ్లను పరిశీలించింది.  ఇందుకు 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సేవలను అందించారు. వీరికి అదనంగా 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా పనిచేయడంతో అందరి కృషితో చారిత్రాత్మక ఘట్టం విజయవంతంగా పూర్తయ్యింది.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

ప్రజలకిచ్చిన వాగ్దానాలపై మడమ తిప్పని కాంగ్రెస్ ఒక్కో హామీని పూర్తి చేస్తుండడంతో తాము ఉనికి కోల్పోతామనే భయంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్​పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.  95 శాతంపైగా  సర్వే పూర్తయ్యిందని ప్రభుత్వం లెక్కలతో సహా ప్రకటిస్తున్నా సర్వేను అసంపూర్తిగా ముగించారని  విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనం. 

రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457 కాగా, వాటిలో 1,12,15,134 కుటుంబాల సర్వే జరిగిందంటే 96.9 శాతం పూర్తయ్యినట్టే.  పలు కారణాలతో సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323 మాత్రమే.  ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేస్తూ  ప్రజల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తున్నారు.

జనాభా లెక్కలు చేయని బీజేపీ

దేశంలో గతంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల్ని సేకరించేవారు.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలకు బ్రేక్ పడింది. దీంతో అధికారిక లెక్కలు లేకపోవడంతో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారు  హక్కులు కోల్పోతున్నారు. జనాభా లెక్కలు చేపట్టాలని, అందులో భాగంగా కులగణన కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్లమెంట్ వేదికగా ఎన్ని విన్నపాలు చేసినా సామాజిక న్యాయం పట్టని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దేశంలో కులగణనపై బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టం చేయనంతవరకు ఆ పార్టీకి కాంగ్రెస్​పై వ్యాఖ్యలు చేసే అర్హతే లేదు. 

సమగ్ర సర్వేను అధికారికంగాప్రకటించని బీఆర్ఎస్​

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో  హడావుడి చేస్తూ  కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా అధికారికంగా ఆ నివేదికను బయటపెట్టలేదు.  తమ రాజకీయ స్వార్థానికి ఆ సర్వే నివేదికను ఉపయోగించుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో సోషల్ మీడియాలో సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అంటూ వైరల్ చేయడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. 

బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన బీఆర్ఎస్

గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించిన బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ 42 శాతం టికెట్లు బీసీలకు ఇస్తామన్నా విమర్శించడం గర్హనీయం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలోనే  బీసీల సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకొని అమలుచేసింది.  

బీసీ సంక్షేమానికి 2024-–25 బడ్జెట్​లో  రూ.9200.32 కోట్లు కేటాయించింది.  ప్రభుత్వం ఏర్పాటైన అనతికాలంలోనే తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సభ్యులను నియమించింది. పలు బీసీ కులాల సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. బీసీ కార్పొరేషన్​కు 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.73 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్​కు రూ.400 కోట్లు, బీసీ కులాల కార్పొరేషన్, ఫెడరేషన్లకు  రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం.  

తెలంగాణలో సామాజిక న్యాయందేశానికే ఆదర్శం

సావిత్రిబాయి ఫూలే జయంతి జనవరి 3న తెలంగాణలో అధికారికంగా మహిళా టీచర్ల దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.   నాకు పార్టీలో అత్యున్నతమైన టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడమే బీసీల పట్ల కాంగ్రెస్​ ప్రభుత్వ ప్రాధాన్యతను  తెలియజేస్తోంది.   కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఆమోదించి దేశానికే ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం తమతోనే సాధ్యమని మరోసారి నిరూపించుకుంది.

బీసీల జనాభా పెరిగింది

కాంగ్రెస్​పై బీఆర్ఎస్ తప్పుడు గణాంకాలతో చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న లెక్కల్లో బీసీల జనాభా 1,85,61,856 మంది అంటే, 51 శాతమే.  ఇప్పుడు తాజా కులగణన లెక్కల ప్రకారం ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలుపుకొని రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య 1,99,85,767 అంటే 56.33 శాతమని తేలింది. ఈ గణాంకాల ప్రకారం బీసీల జనాభా తగ్గిందా, పెరిగిందా అనేది పాఠశాల ప్రైమరీ విద్యార్థులను అడిగినా చెబుతారు. 

ముస్లింలలో ఉన్న ఓసీలను కూడా కలుపుకుంటే ఓసీలు మొత్తం 15.79 శాతం,  ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45 శాతం ఉన్నారని కులగణన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.  కానీ, ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలతో అర్థరహితంగా ప్రకటనలను చేయడం ప్రజలను పక్కదారి పట్టించడమే. 

బీసీలకు 42శాతం సీట్లుకాంగ్రెస్ ​హామీ

రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 23  శాతం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అయితే, దీనికి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో, రాజ్యాంగ సవరణ పేరుతో కాలయాపన చేస్తూ బీసీలకు అన్యాయం చేయడం కన్నా తొలుత పార్టీ తరఫున బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చి బీసీలకు సమన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. 

- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు-