కులగణనతోనే బీసీలకు సామాజిక న్యాయం సాధ్యం : సాదం వెంకట్

కులగణనతోనే బీసీలకు సామాజిక న్యాయం సాధ్యం : సాదం వెంకట్

140 కోట్ల దేశ జనాభాలో 70 కోట్లమంది బీసీలు ఉంటే ముప్పై బీసీ కులాలు కూడా చట్టసభల మెట్లు ఎక్కకపోవడం అన్యాయం కాదా!  ఇవన్నీ చూస్తుంటే ఆలోచనాపరులకు కళ్లలో నీళ్లు వస్తున్నాయి. బీసీల లెక్కా పత్రం పక్కకు పెట్టడం ఇంకెన్నాళ్లు.  బీసీల లెక్కలను పక్కకు పెట్టేవారు పిడికెడు మంది పాలకులు మాత్రమే.  లెక్క తేలిస్తే చిక్కుముడులు వస్తాయనే భయమా.  

ఒకవేళ లెక్క తేలకపోయినా.... లెక్కల పేరుతో గందరగోళం సృష్టించినా  కొంచెం వెనుకా ముందు అయినా చిక్కుముడులు విప్పే సంఖ్య సత్తా బీసీలకు ఉంది.  రెండు రెళ్లు నాలుగు అనేది ఎంత నిజమో ఈ దేశంలో  బీసీలు 60 శాతం దాకా ఉన్నది అంతే నిజం.  నోరులేని మూగజీవులు బీసీలు.  అన్ని రంగాలలో వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో సరిగా చెప్పుకోలేని సాంఘిక వెనుకబాటుతనంలో ఉన్న రాజకీయ అనాథలు బీసీలు. 

బీసీలు ఎందుకు ఐక్యం కాలేకపోతున్నారు!

సంఖ్యాబలం ఎక్కువగా ఉండి సంపద తక్కువగా ఉండటమే బీసీలు ఐక్యత లేమికి ప్రధాన కారణం.  పాలక కులాలు సంఖ్య అతి తక్కువగా ఉండి,  సంపద ఎక్కువ కలిగి ఐక్యంగా ఉండటం. పాలక కులాలకు సంపద ఎక్కడ నుంచి   వచ్చింది అంటే?  నిజాం నవాబు వంటి అతి సంపన్నులుగా ఉన్నవారిదగ్గర... తాబేదార్లుగా, జాగిరుదారులుగా, పెత్తందార్లుగా ఉన్నారు. 

నిజాం నవాబు లాంటి రాజుల శకం అంతం కావటంతో వారు భూములను  జాగిరుదారులు,  జమిందారులు తమ పేరిట రాసుకుని కోట్లకు అధిపతులు అయ్యారు. అప్పటికే  దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. రూమి టోపీ తీసి ఖద్దరు ధరించి కాంగ్రెస్ లో చేరి గెలుపు గుర్రాలుగా మారి  దశాబ్దాలుగా రాజకీయంగా శాసిస్తున్నారు.  పాలక కులాలకు  బీసీలకు రాజకీయపోటీ  వికలాంగులకు... సకలాంంగులకు పోటీగా మారింది.  వీటికి అతితంగా మార్పు రావాలంటే కుల ఆధారిత లెక్క తేల్చాల్సిందే.  

బీజేపీకి చుక్కలు చూపించిన బీసీలు

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో... బీసీ జనాభా లెక్కలు చెయ్యబోమన్న బీజేపీకి  బీసీలు చుక్కలు చూపించారు.  అందుకని ఈ పరిణామాత్మక,  గుణాత్మక మార్పులు గుర్తించి తెలంగాణ, ఏపీ సహా  దేశవ్యాప్తంగా పక్కగా కుల ఆధారిత లెక్కలు తియ్యాలి.  సమాజంలో  సగానికి పైగా ఉండి అవమానాల్లో మగ్గిపోతున్నందుకే  బీసీలకు వారి లెక్కలు కావాలి.  సకల రంగాలలో అసమాన పంపిణీని సమానం చేసేందుకే  బీసీలు ముక్తకంఠంతో లెక్కలు అడుగుగుతున్నారు. 

గణతంత్రం జనతంత్రం కావాలంటే!   జనగణన ఇంకెన్నాళ్లని  బీసీలు, మేధావులు అడుగుతున్నారు. ఈ దేశంలో చెట్లకు పుట్టలకు లెక్కలున్నాయి.  సమాజలో ప్రాణం ఉన్న మనుషులకు ఎందుకు లెక్కలు తియ్యరని ముక్తకంఠంతో బీసీలు డిమాండ్ చేస్తున్నారు.  ఆకాశం నివాసయోగ్యంగా  మారుతున్న నేడు భూమి మీద మనుషుల లెక్కల కోసం మల్లగుల్లాలెందుకు!  కులగణన ద్వారా బీసీలు ఏం అడుగుతున్నారు. 

గత ప్రభుత్వం రకరకాల కారణాలతో  కేవలం పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు 17, - 18 శాతానికే  పరిమితంచేసి బీసీలకు అన్యాయం చేసింది.  రాహుల్ గాంధీ  కామారెడ్డి  బీసీ డిక్లరేషన్​లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించటంతో  దేశవ్యాప్తంగా  చర్చ అయ్యింది.  లెక్కలు చేయబోమన్న బీజేపీకి అరకొర 
మెజారిటీతో  ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.  

ఇంటింటి సర్వేతో కులాల లెక్కలు తియ్యాలి

బీసీ కమిషన్ మధ్యంతర ఉత్తరువులతో  మమ అనిపించొద్దు.  ఇంటింటి సర్వేతో  అన్ని కులాల లెక్కలు తియ్యాలి.  కులసంఘాలన్నీ  బీసీ కుల మేధావులతో సమగ్రంగా చర్చించి చెయ్యాలి.  కొన్నిరకాల మీటింగులకు విద్యార్థులను వాడుకుంటున్నారు. వారిని అలాకాకుండా కులగణనకు ఉపయోగించవచ్చు. టిక్ లు కొట్టే కాలమ్స్​ఉంటాయి తేలికగా చెయ్యొచ్చు.  

8వ  క్లాస్ నుంచి  డిగ్రీ వరకు  విద్యార్థులకు  ముగ్గురికి  వారి ప్రాంతలోనే  యాభై ఇండ్లు కేటాయించాలి. ఉద్యోగులతో  మూడంచెలుగా చెక్ చేసి మూడు నుంచి  ఐదు రోజుల్లో రాష్ట్రం మొత్తం లెక్కలు తీయొచ్చు . అలాంటి విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. లేదా అన్నిరకాల ఉద్యోగులతో తప్పులకు తావు లేకుండా కుల ఆధారిత లెక్కలు తీయొచ్చు.    తప్పులకు తావున్నా , ఆశాస్త్రియంగా చేసినా ఫలితం కంటే నష్టమే ఉంటుంది.  గణతంత్రం పేరుతో నిర్వహించేది అంతా ప్రజాస్వామ్యం కాదు. అది చోర తంత్రం అందుకే  కులగణన  చెయ్యాలి. 


కులగణన చేయకపోవడంతోనే.. అయోధ్యలో ఓడిన బీజేపీ

బీజేపీ పదేండ్లు అధికారంలో ఉండి... కుల ఆధారిత లెక్కలు చెయ్యబోమని చెప్పటంతో నార్త్​లో జనరల్ సీట్ అయిన అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది.  కుల జనగణన చెయ్యకపోవడం కూడా బీజేపీ ఓటమికి ఓ కారణం. సోనియా గాంధీకి తెలంగాణ  ఇచ్చిన దేవతగా పేరుంది.  ఆమె ఆధ్వర్యంలోనే ఉదయ్​పూర్  డిక్లరేషన్ జరిగింది.  దాని ప్రకారం  ప్రతి పార్లమెంట్ సీట్ పరిధిలో  ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తామని విధాన నిర్ణయం చేసి తప్పుకున్నారు.  కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో  రాహుల్ గాంధీ స్వయంగా బీసీ లెక్కలు చేస్తామని ఒప్పుకున్నారు. 

రేవంత్​రెడ్డి కూడా కులగణన చేస్తామని హామీ ఇచ్చి  సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోనియాకు తెలంగాణ దేవతగా ఏంత పేరు వచ్చిందో  ఈ హామీలు అమలు పరచ్చకపోవడం వల్ల అంతే చెడ్డ పేరు వస్తుంది. ఏజ్ ఏంత ఉన్నా నాలెడ్జి  గ్యాప్  లేకపోతే అన్ని సమూహాలతో కలిసి పనిచేయొచ్చు.  ముఖ్యమంత్రి రేవంతరెడ్డి గమనించాల్సింది ఏమిటంటే సోషల్ మీడియా తదితర సాంకేతిక మార్పులతో   బీసీలు ఇటీవల చైతన్యం అయ్యారు.  చదువుతో గుణాత్మక మార్పులు వచ్చాయి. దీన్ని గమనించైనా ముఖ్యమంత్రి బీసీ లెక్కలకు శ్రీకారం చుట్టి ఈ మార్పులకు అనుగుణంగానైనా పాలించాల్సిన అవసరం ఉంది. 

- సాదం వెంకట్,సీనియర్​ జర్నలిస్ట్​