ఘట్కేసర్, వెలుగు: సోషల్ మీడియాలో వ్యూస్, పాపులారిటీ కోసం ఓఆర్ఆర్పై నోట్ల కట్టలు విసిరిన యూట్యూబర్‌ను ఘట్కేసర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని బాలానగర్‌కు చెందిన రాయలపురం భానుచందర్‌గా గుర్తించారు. మనీ హంట్ చాలెంజ్ పేరుతో నిందితుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నట్లు ఉప్పల్ ఏసీపీ చక్రపాణి తెలిపారు. యువత ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు వీడియోలను స్ఫూర్తిగా తీసుకొని, జైలు పాలు కావొద్దని సూచించారు.
ఆ నోట్లు ఫేకా? ఒరిజినలా?
అయితే, ఓఆర్ఆర్పై ఫేక్ నోట్లు విసిరినట్లు నిందితుడిపై పెట్రోలింగ్ వెహికల్ ఇన్చార్జి బండారు శ్రీరాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ, ఆ నోట్లను పోలీసులు ఇంకా రికవరీ చేయలేదు. దీంతో ఆ కరెన్సీ ఫేకా? ఒరిజినలా? అన్నది క్లారిటీ లేదు. భానుచందర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.