సోషల్ మీడియా.. ఎంత మంచిదో అంత డేంజర్

సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ  ఉన్నాయి. టెక్నాలజీ అభివృద్ది చెందడంతో  సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది.  ఈ వేదిక ద్వారా  ప్రపంచంలో  ఏమూల ఏం జరిగినా  క్షణాల్లో  తెలిసిపోతోంది.  యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఉదయం నిద్రలేవగానే  వాట్సప్ ఓపెన్ చేసి కామెంట్లు,  ఫేస్ బుక్ లో లైక్స్ చూడనిదే చాలామంది కుర్రకారుకు రోజు మొదలవ్వదు. రోజంతా ఉద్యోగంతోనే ….వ్యాపారంతోనే ఎంతగా అలసిపోయినా నిద్రపోయే ముందు ఒకసారి స్మార్ట్ ఫోన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేసి ఫేస్ బుక్ , వాట్సప్ చూడాల్సిందే. అంతగా సోషల్ మీడియాకు  యువత ఫిదా అయింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేనంతా తమ బిజినెస్ ను డెవలప్ చేసుకుంటున్నాయి వ్యాపారవర్గాలు.

ఎన్నికల్లో కీలక పాత్ర

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా  సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఓటర్లతో రాజకీయ పార్టీలు ఈజీగా ఇంటరాక్ట్  కావచ్చు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో చాలా వేగంగా ఎక్కువ మందికి పొలిటికల్ లీడర్లు చెప్పే అవకాశం సోషల్ మీడియా కల్పిస్తోంది. అనేక రాజకీయ పార్టీలు తమకు అనుబంధంగా ఈ వ్యవహారాలు చూసుకోవడానికి  ప్రత్యేకంగా  విభాగాలను కూడా ఇదివరకే ఏర్పాటు చేసుకున్నాయి. సోషల్ మీడియా పై  బాగా అవగాహన ఉన్న నిపుణుల సేవలను రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి.
విచ్ఛిన్నమవుతోన్న మానవ సంబంధాలు

సోషల్ మీడియా ఇవాళ్టి మనిషి జీవితంలో భాగమైంది. దీనిని ఎవరూ కాదనలేదు. అయితే సోషల్ మీడియా నెగెటివ్ యాంగిల్ ను కూడా పరిశీలించాలి.ఆరోగ్యవంతంగా ఉండాల్సిన మానవ సంబంధాలు సోషల్ మీడియా పుణ్యమా అని విచ్ఛిన్నమవుతున్నాయి. సైబర్ బెదిరింపులు, ఆన్ లైన్ వేధింపులు, ట్రోలింగ్ సమస్యలు పెరిగాయి. యువతలో  సగం మంది సోషల్ మీడియాకు తీవ్రంగా అడిక్ట్ అయ్యారు. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత అంశాల కు సంబంధించిన గోప్యత విషయంలో హద్దులు దాటుతున్నారు. గుట్టుగా ఉండాల్సిన విషయం కూడా ఇంటి గడప దాటుతోంది. సోషల్ మీడియాలో చేరి ఊరంతా చేరుతుంది.  పరిచయం లేని వ్యక్తులు ప్రేమ, పెళ్లి పేరుతో  దగ్గరకావడానికి  ప్రయత్నించడం చివరకు ఈ బాపతు కహానీలు విషాదాంతంగా ముగియడం ప్రతిరోజూ  అందరం చూస్తున్నదే. 2006 నుంచి 2016 వరకు లెక్కలు తీసుకుంటే సోషల్ మీడియా వినియోగం రోజుకు  గంట లేదా రెండు గంటలు ఉండేది. ఫోర్ జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. సోషల్ మీడియా  ఎంత పెద్ద ప్లాట్ ఫాం అయినా అది మనం ఎదగడానికే ఉపయోగపడాలి కానీ దిగజారడానికి కాదు. సోషల్ మీడియా పిచ్చిలో పడి మానవ సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.

– కాళంరాజు వేణుగోపాల్,

టీచర్, మార్కాపురం, ప్రకాశం జిల్లా