
మాజీ రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనే 26 ఏళ్ళ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఢిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
పూర్తివివరాల్లోకి వెళితే జమ్మూకి చెందిన సిమ్రాన్ సింగ్ స్థానిక ప్రాంతంలోని సెక్టార్ 46లో ఓ అద్దె ఫ్లాట్ లో నివాసం ఉంటోంది. సిమ్రాన్ సింగ్ రేడియో జాకీ గా పనిచేసేది. దీంతో వృత్తి రీత్యా గుర్గావ్ లో ఉంటోంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చెయ్యడమే కాకుండా లోకల్ యాడ్స్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది.
అయితే ఉన్నట్లుండి సిమ్రాన్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని మృతి చెందింది. ఇదే ఫ్లాట్ లో ఉంటున్న ఆమె సిమ్రాన్ స్నేహితులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సిమ్రాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. అలాగే సిమ్రాన్ సింగ్ స్నేహితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇందులో సిమ్రాన్ సింగ్ గత కొన్ని నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
ఈ విషయం గురించి గుర్గావ్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం సిమ్రాన్ ఫ్లాట్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని దీంతో ఆమె గదికి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించినట్లు తెలిపారు. అయితే సిమ్రాన్ సింగ్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదా అనుమానాస్పద ఆనవాళ్లు లేవని స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ కేసుకి సంబందించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.