గ్లోబల్ మహమ్మారిగా మారిపోయిన సోషల్ మీడియా

సోషల్‌‌ మీడియా అనేది ఇప్పుడు ఒక కొత్త అంతర్జాతీయ మహమ్మారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు ఈ కొత్త వైరస్‌‌‌‌ను వేగంగా వ్యాపింపజేస్తున్నాయి. ఢిల్లీ శివార్లలో రైతుల నిరసనపై పాప్‌‌‌‌ సింగర్‌‌‌‌ రిహానా చేసిన ట్వీట్‌‌పై ఇండియన్‌‌‌‌ మీడియా చర్చిస్తోంది. కొన్ని టెలివిజన్‌‌ చానెల్స్‌‌లో రిహానాకు మద్దతుగా, వ్యతిరేకంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆమెపై నీచమైన, ద్వేషపూరిత కామెంట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాము చెబుతున్న దానికి మద్దతుగా ఎవరైతే గట్టిగా అరిచి చెప్పగలుగుతున్నారో వారి మాటలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఎక్కడో సుదూరాన ఉన్న ఒక పాప్‌‌ సింగర్‌‌‌‌ చేసిన ఒక చిన్న ట్వీట్‌‌పై ఈ గొప్ప దేశంలో ప్రసార సమయంతా స్పందిస్తూ, చర్చలు జరుపుతుండటం విచారకరం.

నేషనల్‌‌‌‌ చానెల్స్‌‌లో ఉపన్యాసాలు, చర్చలు చూస్తుంటే ఇండియా వంటి దేశంలో బ్రాడ్‌‌కాస్ట్ సమయాన్ని విలువ లేనిదిగా మార్చేస్తోంది. ఘర్షణ, పేదరికం, ఆకలి, ద్వేషం, నిరాశ, హింస అన్నది సోషల్‌‌ మీడియా లేనప్పుడు కూడా ప్రపంచంలో ఉంది. ఈ దుర్మార్గాలను తగ్గించడంలో సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు ఏ మాత్రం సాయపడలేదన్నది వాస్తవం. పైగా ఉన్న సమస్యను గతం కంటే అనేక రెట్లు పెంచాయి. సోషల్‌‌ మీడియా పూర్తిగా పనికిరానిదని నేను చెప్పడం లేదు. కానీ ఈ గ్రూప్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెషన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడేవి కావు. అక్కడక్కడ జరిగిన విద్వేష ఘటనలను ముడిపెట్టి దాన్ని సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ ద్వారా ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆసక్తి ఉన్నవారికి, ఏ మాత్రం ఆసక్తి లేని వారికి నిజాన్ని మెలితిప్పి, వాస్తవాలను మరుగుపరిచి, ఫొటోషాప్‌‌‌‌ రియాల్టీతో అద్భుతమైన తప్పుడు కథనాలు షేర్‌‌ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలను రెచ్చగొట్టడంలో సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ నిజంగానే విజయం సాధించాయని చెప్పాలి.ఈ మహమ్మారి అవలక్షణాల్లో కొన్నింటిని ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. వీటిని చూడటం ద్వారా ఇవి అనేక దేశాల ఆలోచనా తీరును ఎలా నష్టపరుస్తున్నాయో మనమంతా అర్థం చేసుకోవచ్చు.

సెన్సేషనలిజం అంటేనే ఇష్టం

సోషల్‌‌ మీడియాలో చురుగ్గా ఉండే వారు తమకున్న మాస్‌‌‌‌ ఫాలోయింగ్‌‌ను చూసుకుని మురిసిపోతుంటారు. ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు.. ఎందుకు అవుతున్నారో అనే విషయాలపై వీరికి ఆసక్తి శూన్యం. వీరి లక్ష్యం ఒక్కటే, ఏ విధంగానైనా సరే ఫాలోయింగ్‌‌ పెంచుకోవడం. నార్మల్‌‌ అంటే సోషల్‌‌ మీడియాకు తెగ విసుగు. అసాధారణానికి ఎప్పుడైనా వెల్​కమే. పరస్పర గౌరవం, పదాల ఎంపిక, జాగ్రత్తతో కూడిన సంభాషణ, సామాజికంగా బాధ్యతాయుతమైన పదజాలం వంటివి నేటి రోజుల్లో నిలదొక్కుకోలేవు, మనుగడ సాగించలేని పరిస్థితి. ఈ అన్‌‌‌‌హెల్తీ సెన్సేషన్‌‌‌‌ అన్నది ఆమోదయోగ్యంగా మారిపోయింది. అంతే కాదు, చాలా సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో ఇది సరైన కమ్యూనికేషన్‌‌‌‌ విధానంగా ప్రశంసలు పొందుతోంది. భాష ఎంత ఎక్కువ తలతిక్కదనం, విద్వేషపూరితం, పిచ్చితనం, వికృతత్వం, దూషణభరితంగా ఉంటుందో అంత ఎక్కువ మంది ఫాలోవర్లు, లైకులు, షేర్లు, ప్రశంసలు అందుకుంటున్న దుస్థితి కనిపిస్తోంది. వర్చువల్‌‌ నాయకులుగా ఎదగాలని తపించిపోయేవారు వాస్తవంగా ఎలా ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తున్నాయంటే వారు వెంటనే తమను తాము సమీక్షించుకొని తాము సంభాషించేందుకు ఈ సంచలన భాష ఎంచుకుంటున్నామా అనేది నిర్ణయించుకోవాలి.

నిష్పాక్షికత ఎక్కడా కనిపించడం లేదు

ఏదైనా ఒక విషయంపై అభిప్రాయం కలిగి ఉండటం మంచిదే. బాగా చదువుకున్నవారు, ఆలోచన చేయగలిగే వారు, ఎంచుకున్న రంగాల్లో అనుభవం కలిగినవారు, పరిశ్రమకు చెందిన నిపుణులే కాదు కొన్ని నిర్దిష్ఠ అంశాల్లో ఆసక్తి కలిగిన సాధారణ ప్రజలకు వారి వారి రంగాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు ఉంటాయి. వాటికి సంబంధించి వారికి బలమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అది సాధారణం కూడా. కానీ, ప్రతి విషయంపైనా ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అది వారి సమయాన్ని వృథా చేసుకోవడమే. సోషల్‌‌ మీడియాను అంటుకొని ఉండేవారిలో చాలా మందికి ప్రతి విషయంపైనా, ప్రతీ ఒక్కరిపైనా ఒక కచ్చితమైన అభిప్రాయం ఉన్న తీరు ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సిగ్గు, ఎగ్గు లేకుండా తమ భావాన్ని వ్యక్తం చేయాలనే తపన వారిలో తీవ్రంగా ఉంటోంది. చాలా సందర్భాల్లో అలా చేయడం ద్వారా వారు తమ తెలివితక్కువతనాన్ని తామే బయటపెట్టుకుంటున్నారు. ఈ పిచ్చి లక్షణాలతో కూడిన ధోరణి కారణంగా సోషల్‌‌ మీడియాలో నిష్పాక్షికత అన్నది కనుమరుగైపోతోంది. ఒక విషయంపై ఏదో వైపు ఉండాలనే ధోరణి తీవ్రమైపోతోంది. సమస్యలు లేదా అంశాలపై ఎవరైనా స్టడీ చేసి అర్థం చేసుకొని దానిపై ఒక స్పష్టమైన వైఖరి తెలుసుకునే ప్రయత్నం చేసేవారిని బలహీనులుగా, తెలివితక్కువ వారిగా, బుద్ధిలేనివారిగా జమ కడుతున్నారు. సమాజంలో లేదా దేశంలో నిష్పాక్షికతకు గౌరవం, ఔచిత్యం లోపించినప్పుడు మూర్ఖులదే రాజ్యమవుతుంది. మిడిమిడి జ్ఞానం, అవగాహనా లేమితో వారు వ్యక్తిగత, సమాజ సామరస్యాన్ని నాశనం చేస్తారు.

కీబోర్డు వీరసైనికులు

ఒక విషయంపై ఏ మాత్రం అవగాహన లేకున్నా లేదా కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఎటువంటి అపరాధ భావం లేకుండా ఎంతో ధీమాతో కామెంట్స్‌‌ చేయడం సోషల్‌‌ మీడియాలోనే చెల్లింది. వారు మాట్లాడుతున్న విషయానికి సంబంధించి వారికి ఎటువంటి సమాచారం అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే దాని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా వారివైపు నుంచి ఉండదు. కీ-బోర్డు మీద కొన్ని అక్షరాలు టైప్‌‌ చేయగల సామర్థ్యం ఉంటే సరిపోతుంది. ఈ కీ-బోర్డు వీరసైనికుల సంఖ్య కోట్లలో ఉంది. మనుగడలో ఉండేందుకు, సర్క్యులేషన్‌‌లో తమ పేరు చూసుకునేందుకు చాలా మంది ఇష్టపడే విధానం ఇది. కామెంట్‌‌ చేస్తున్న విషయానికి సంబంధించి చాలా మందికి దానితో ఎటువంటి సంబంధం ఉండదు. ఈ నకిలీ సైనికులు ఒక యుద్ధం నుంచి మరో యుద్ధానికి వేగంగా దూసుకుపోతారు. ఏది ఏమైనా అవి తాలు దెబ్బలే. రాకెట్‌‌ సైన్స్‌‌ నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్‌‌ వరకు సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేసే ఈ లక్షణం అత్యంత వేగంగా ప్రపంచమంతా వ్యాపించే అంటువ్యాధి లాంటిది. ఈ కీ-బోర్డు వీరసైనికులు సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపరు. చూపలేరు. అంతే కాదు వీరిలో చాలా మందికి వారు ఎంచుకున్న సమస్యతో ఎటువంటి సంబంధం ఉండదు. అది వారిపై ఎటువంటి ప్రభావమూ చూపదు. సోషల్‌‌ మీడియా వేదికగా భీకరమైన పోరాటాలు చేసే ఈ యోధులు ఔచిత్యం కోసం, గుర్తింపు కోసం పాకులాడుతూ తమ భావోద్వేగాలను సంతృప్తి పరుచుకుంటారు.-కె.కృష్ణసాగర్‌ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి.