మన దేశంలో సోషల్ మీడియా సత్తా ఎంత?. అది తలచుకుంటే ఏదైనా సాధ్యమేనా? దాన్ని కంట్రోల్ చేయకపోతే కొంపలేమైనా అంటుకుపోతాయా? అంటే, అవును అని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. సమాధానం ఆ ప్రశ్నల్లోనే ఉంది. అందుకే ప్రభుత్వాలు, కోర్టులు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు సోషల్ మీడియాని కట్టడి చేస్తున్నాయి. మొన్నటి అయోధ్య కేసు తీర్పు సమయంలో గానీ, ఆర్టికల్–370ని రద్దు చేసినప్పుడుగానీ, లేటెస్ట్గా సిటిజన్‌షిప్ యాక్ట్ విషయంలో గానీ ఇదే జరిగింది.
సోషల్ మీడియా వల్ల సొసైటీకి మంచీ చెడు రెండూ ఉన్నాయి. మార్పు కోసం ముందుకొస్తే స్వాగతిస్తున్నారు. ఉద్యమాలకు ఊపిరి పోస్తున్నారు. కరప్షన్‌కి వ్యతిరేకంగా అన్నాహజారే పోరాటం మొదలుపెడితే బ్రహ్మరథం పట్టారు. ‘ఆప్’ చీఫ్ కేజ్రీవాల్‌కీ అదిరిపోయే ప్రమోషన్ ఇచ్చారు. నిర్భయ, దిశ, ఆయేషా తదితర అత్యాచార ఘటనలను అంతే తీవ్రంగా నిరసించారు. తమిళనాడులోని జల్లికట్టుకు అనుకూలంగా జత కలిశారు. ఇదంతా వెలుగు అనుకుంటే సోషల్ మీడియాకు చీకటి కోణమూ ఉంది.
అజ్ఞానంతో అపోహలకు కారణం..
ఇంటర్నెట్ కల్చర్ అలవాటుపడ్డవాళ్లలో అన్ని వయసులవారూ, తెలివితేటల పరంగా అన్ని స్థాయిలవారూ ఉంటున్నారు. అన్నీ తెలిసినోళ్లను ఆలోచింపజేసే రీతిలో పోస్టింగ్‌లు పెడుతుంటే సగం సగం తెలిసినోళ్లు అపోహలకు కారణమవుతున్నారు. అజ్ఞానాన్ని షేర్ చేస్తున్నారు. సోయీ సొంపూ లేనోళ్లు సొసైటీని రెచ్చగొడుతున్నారు. మహిళలను అశ్లీలంగా చూపుతున్నారు. కరుడు గట్టిన కార్యకర్తలు పని గట్టుకొని ప్రత్యర్థి పార్టీలపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీంతో కొన్ని వర్గాల మధ్య గొడవలు పెడుతున్నారు.
అందువల్లే ఇలాంటివాటిని అడ్డుకోవటానికి సర్కార్లు అప్పుడప్పుడు ఇంటర్నెట్ బంద్ పెడతాయని, సోషల్ మీడియా సైలెంట్ అయ్యేలా చేస్తాయి. జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు సమయంలో మొబైల్ డేటా, మిగతా కమ్యూనికేషన్లు అందుబాటులో ఉండుంటే ఆ సెన్సిటివ్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అదుపుచేయటం కష్టమయ్యేదని అంటున్నారు. అయోధ్య తీర్పు, సిటిజన్‌షిప్ బిల్లు ఆమోద సమయాల్లో కూడా ఈ ఎత్తుగడ బాగా పనిచేసిందని చెబుతున్నారు.
కోట్ల సంఖ్యలో యూజర్లు
ఇప్పుడు మన దేశంలో సోషల్ నెట్వర్క్ యూజర్లు 35.14 కోట్లు. మూడింట రెండొంతుల మంది ఆన్లైన్లో ఉంటున్నారు. రూరల్, అర్బన్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో జనం స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వర్చువల్ కమ్యూనిటీలు, గ్రూపులు ఏర్పాటుచేసుకొని క్షణక్షణం టచ్‌లో ఉంటున్నారు. దీనివల్ల సోషల్ మీడియా ప్రజల ఆలోచనలను అప్పటికప్పుడు మార్చగలిగే స్థాయిలో ఫాస్ట్‌గా దూసుకుపోతోంది. 15 ఏళ్లలోనే ఫేస్బుక్, యూట్యూబ్ ప్రపంచ స్థాయిని సొంతం చేసుకున్నాయి.
లోకంలో ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి అప్పట్లో రేడియో, టీవీలే దిక్కు. న్యూస్ పేపర్ కోసం తెల్లారి పొద్దు పొడిచే దాక వేచిచూడక తప్పనిపరిస్థితి. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఓ పల్లెలా లేదా ఓ పట్టణంలా మారిపోయింది. ఏ దేశంలో చీమ చిటుక్కుమన్నా ప్రతి ప్రదేశానికీ లైవ్‌లో వచ్చేస్తోంది. ప్రజలూ అంతే వేగంగా స్పందిస్తున్నారు. మంచి జరిగితే ‘హ్యాట్సాఫ్’ చెబుతున్నారు. చెడు జరిగితే హింసకు దిగుతున్నారు. ఎవరిపైనైనా సరే సెటైర్లు వేస్తున్నారు.
మన దేశంలో సోషల్ మీడియా లిస్టు చాంతాడంత. దీన్నిబట్టే దాని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా చేసే పనులు కూడా టోటల్‌గా ఇన్నీ అని తేల్చిచెప్పలేం. ‘ఇందుకలడందులేడనే సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే కలడు’.. అనే మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. లిటరసీ రేటుతో పోటాపోటీగా డిజిటల్ లిటరసీ పెరగటానికి సోషల్ మీడియానే సిసలు కారణం. గతంలో ‘టెక్ శావీ’ ట్రెండ్ మాదిరిగా ఇప్పుడు ‘సోషల్ మీడియా శావీ’ అనేది ప్రజెంట్ జనరేషన్‌కి పర్యాయపదంగా మారింది. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, పింటరస్ట్, గూగుల్ ప్లస్ తదితర యాప్‌ల గురించి తెలియనివారు లేరు. సోషల్ మీడియా అంతగా సొసైటీలోకి చొచ్చుకుపోయింది. పబ్లిక్పై పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ప్రభావితం చూపుతోంది. 24 గంటలూ ‘ఇంట’రాక్షన్, లైవ్ ఛాటింగ్, స్టేటస్ అప్డేట్స్ అందుబాటులోకి రావటం వల్లే సోషల్ మీడియా ఇంతగా పాపులర్ అయింది. తర్వాత్తర్వాత పవర్‌ఫుల్‌గా మీడియాగా తయారైంది. ప్రతి సైట్ లేదా బ్లాగ్ లేదా వాట్సప్ గ్రూప్‌ని చెక్ చేసి సెన్సార్షిప్ విధించే యంత్రాంగం మన దగ్గర లేదు. అందువల్లనే సోషల్ మీడియాపై కంట్రోల్ చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎక్కడైనా అల్లర్లు, పుకార్లు పుట్టించే అవకాశముందని భావిస్తే… ఆయా చోట్లలో ఇంటర్నెట్‌ని బంద్ పెడుతోంది. దాంతో రెచ్చగొట్టడానికి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి సిద్ధపడే అరాచక శక్తులను అదుపు చేసినట్లవుతోంది. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంది మోడీ సర్కారు. ఈ యాక్ట్‌పై విధ్వంసానికి పాల్పడుతున్నవాళ్లకు బయట నుంచి మెసేజ్‌లు, యాక్షన్‌ప్లాన్ ఆర్డర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది.
మన దేశంలో యాక్టివ్ ప్లాట్‌ఫామ్స్
- ఇంటర్నెట్ వాడుతున్నవారు 46 కోట్ల పైమాటే
- వాట్సాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 20 కోట్లు (ప్రపంచంలోనే అత్యధికం)
- ఫేస్బుక్ పుట్టింది 2004లో. ఈ 15 ఏళ్లలో ఇండియాలో యూజర్లు 25 కోట్ల చిల్లర
- యూట్యూబ్ పుట్టింది 2005లో. ప్రస్తుతం ఈ వీడియోలు చూస్తున్నవారు 26 కోట్ల పైనే
- లింక్డిన్ యూజర్లు 4 కోట్ల 20 లక్షలు
- ట్విట్టర్ కస్టమర్లు 2 కోట్ల 30 లక్షలు
- కమ్యూనిటీల ఏర్పాటుకు సోషల్ మీడియాపై ఆధారపడుతున్న ఆర్గనైజేషన్ల శాతం 95.7
- బ్రాండ్లకు లైకులు, షేర్లు, కామెంట్లు కోరుకుంటున్న కంపెనీల పర్సంటేజీ 76.1
- సక్సెస్ అంచనాకు సోషల్ మీడియాను లెక్కలోకి తీసుకుంటున్న సంస్థలు 81 శాతం.
ప్లస్‌లు..
- జనరల్ ఫన్, నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్
- ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఆన్లైన్లో కలుసుకునే వెసులుబాటు
- ఈజీ, ఇన్స్టంట్ కమ్యూనికేషన్
- ఇన్ఫర్మేషన్ డిస్కవరీ
- బిజినెస్ ఓనర్లకు, పొలిటికల్ లీడర్లకు అద్భుతమైన వ్యాపార, ప్రచార వేదికలు
మైనస్‌లు..
- అవసరమైనదానికన్నా ఎక్కువ సమాచారం అందుబాటులోకి రావటం
- ప్రైవసీ ఇష్యూలు
- సోషల్ ప్రెజర్, సైబర్ బుల్లీయింగ్
- విచ్చలవిడి ఫీలింగ్స్,వ్యక్తిగత ఒంటరితనం
- రొటీన్ లైఫ్ స్టైల్, నిద్రకు చేటు
- ఫేక్ న్యూస్