కేంద్రంపై ‘ఎక్స్’ దావా.. కర్నాటక హైకోర్టులో రిట్ పిటిషన్

కేంద్రంపై ‘ఎక్స్’ దావా.. కర్నాటక హైకోర్టులో రిట్ పిటిషన్
  • కేంద్రం ఏకపక్షంగా సెన్సార్ షిప్ చేస్తోందని ఆరోపణలు 

న్యూఢిల్లీ: అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్‌’ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్నాటక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్ ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్సార్ షిప్ చేస్తోందని ఆరోపించింది. ఐటీ యాక్ట్‌-–2000 సెక్షన్‌ 79(3)(బీ)  ప్రకారం కేంద్ర ప్రభుత్వం సేఫ్‌ హార్బర్‌ అనే నిబంధన తెచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్​లు బ్లాక్‌ చేయాలి. లేదా తొలగించాలి. 

లేకపోతే  అవి న్యాయపరమైన రక్షణను కోల్పోతాయి. ఈ సెక్షన్‌ నే సవాల్‌ చేస్తూ ‘ఎక్స్‌’ కర్నాటక హైకోర్టులో దావా వేసింది.  అధికారులు చట్టపరమైన విధానాలను పాటించడం లేదని, ఆన్‌ లైన్‌ లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని ‘ఎక్స్’ రిట్‌ పిటిషన్‌లో ఆరోపించింది.
 
ఐటీ యాక్ట్ సెక్షన్ 69 (ఏ) దుర్వినియోగం 

కంటెంట్ ను బ్లాక్ చేసే అంశంపై ఐటీ యాక్ట్ లోని సెక్షన్‌ 69(-ఏ) సెక్షన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అది ఏయే సందర్భాల్లో ఉపయోగించాలని శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ‘ఎక్స్’ పిటిషన్ లో ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేసింది. సెక్షన్ 69 (ఏ) కింద కాకుండా స్పష్టమైన నిబంధనలు లేని సెక్షన్ 79 (3) (బీ)తో కంటెంట్ ను నియంత్రించడానికి ప్రభుత్వం చూస్తోందని వెల్లడించింది. 

సెక్షన్ 79 (3) (బీ) కింద కంటెంట్ ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ‘ఎక్స్’ వాదిస్తోంది. సాక్ష్యాలుగా 2024 ఫిబ్రవరిలో రైల్వే శాఖ పంపిన ‘బ్లాకింగ్‌ ఆదేశాలను’ కోర్టుకు చూపించింది. ప్రభుత్వ చర్యలతో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బ తినడంతో పాటు  యూజర్ల నమ్మకాన్ని కూడా కోల్పోతామని ‘ఎక్స్’ వాదించింది.