
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావిస్తున్న మీడియా కొత్త పుంతలు తొక్కుతూ మంచీ, చెడూ రెండింటినీ ఎదుర్కొంటోంది. సమాజానికి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన మీడియా కొన్నిసార్లు లక్ష్మణ రేఖను దాటుతూ సర్వత్రా విమర్శలపాలవుతోంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు, ఆన్లైన్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇలా వైవిధ్యమైన ప్లాట్‌ఫారాలపై వేగవంతంగా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నా.. పాఠకులు, వీక్షకులు అది సత్యమో, అసత్యమో అని అనుమానపడే పరిస్థితి రావడం దురదృష్టకరం.
ఒకప్పుడు మీడియా, జర్నలిస్టులంటే సమాజంలో విలువ, గౌరవం ఉండేదంటే ప్రధాన కారణం నిస్వార్థమే ఒక పెట్టుబడిగా ఉండడం. అంతేకాక సమాజాభివృద్ధికి తన వంతు కృషి చేయాలని, అన్యాయాన్ని వెలికితీసి ప్రజలకు నిజం అందించాలనే తాపత్రయంతో యువత జర్నలిస్ట్ రంగాన్ని ఎంచుకునేది. దీనికి భిన్నంగా ఇప్పుడు బతకడానికి ఎదో ఒకటి అనే ధోరణితో యువత మీడియా వైపు వస్తుండడంతో గతంలో వలె విలువలకు ప్రాధాన్యత తగ్గింది. రాజకీయ నేతలు తమ అనుకూలురు, వ్యతిరేకులు అంటూ వార్తలు వడబోస్తుండడంతో ప్రజలు వాటిని విశ్వసించడం లేదు. మీడియా పేరును బట్టి వాటిలోని నిజాలను నిర్ధారించుకుంటున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రింట్ మించి ఎలక్ట్రానిక్.. దాన్ని మించి సోషల్ మీడియా ఒకదానితో మరొకటి పోటీపడుతున్నా యి. డీజిటల్ మీడియా, యూట్యూబ్ చానళ్లు వీపరీతంగా పెరిగిపోయాయి. అన్నీ చెడు చేస్తున్నాయనలేం. కానీ, రాజకీయ పార్టీలు నడిపే డిజిటల్, యూట్యూబ్ చానళ్ల వల్లనే సమస్యలు పెరుగుతున్నాయి. మీడియా అంటే ఇలా ఉంటుందా అని జుగుప్స కూడా ఒక్కోసారి కలుగుతోంది. ఇటీవల తెలంగాణలో మీడియాపై ముఖ్యంగా సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరుష పదజాలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తున్న వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే కారణంతో జర్నలిస్టులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా జర్నలిస్ట్ ముసుగులో కొందరు పనిగట్టుకొని నియంత్రణ లేకుండా నీచమైన భాషతో దూషిస్తున్నారని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని, వారిని క్రిమినల్స్‌గా భావించి చర్యలు తీసుకుంటామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీనిపై మీడియాలో, ఇతర వేదికలపై చర్చలు, అనుకూల, ప్రతికూల వాదనలు, విమర్శలు, రాజకీయాలు షరామామూలుగానే ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా జరిగాయి.
జవాబుదారీతనం లేకుండా ప్రసారం
మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు సర్వసాధారణం. అయితే సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో సోషల్ మీడియా ప్రారంభించే అవకాశాలుండడంతో లెక్కలేనన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఎవరికివారే యజమానులుగా మారిపోయి సొంత లాభాల కోసం విలువలు పాటించడం లేదు. అపరిమిత సంఖ్యలో ఉన్న వీటిపై ప్రభుత్వంతోపాటు మీడియా నియంత్రణ సంస్థలు కూడా పట్టుకోల్పోయాయి.
సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు జవాబుదారీతనం లేకుండా ప్రసారం అవుతున్న దశలో ఏదో ఒక ప్రధాన నాయకుడిపై వచ్చేవాటిపైనే ఎక్కువ లైకులు, డిస్‌లైకులు, కామెంట్లతో విపరీత స్పందన వస్తుంది. ఈ కథనాలపై నిజానిజాలను పరిశీలించే ఒక వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. మీడియా పేరుతో బాధ్యతారాహిత్యంగా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే భావన నెలకొన్న నేపథ్యంలో కట్టడికి ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు మీడియా సంస్థలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
జర్నలిస్టులు కొన్ని నియమాలకు కట్టుబడాలి
వార్త అందించడం ప్రధాన బాధ్యతగా భావించే మీడియాతో పాటు జర్నలిస్టులు కొన్ని నియమాలకు కట్టుబడాలి. ప్రభుత్వం అందించే సంక్షేమం ప్రజలకు అందడం లేదని చెప్పాలనుకున్నప్పుడు వాటిలో లోటుపాట్లను, వైఫల్యాలను తెలియజేస్తూ బాధితులకు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నించాలి. కానీ, వారు ప్రభుత్వాన్ని పరుషజాలంతో, బూతులతో తిట్టేలా ప్రోత్సహిస్తూ, ప్రశ్నలు సంధిస్తూ వారి నుంచి తమకు కావాల్సిన రీతిలో సమాధానాలు ఆశించకూడదు.
ఒకవేళ వారే అసభ్యకరంగా మాట్లాడితే కూడా బాధ్యతగల జర్నలిస్టుగా అలాంటి పదాలను, మాటలను తొలగించి, బాధితులు ఇబ్బందులు పడుతున్న అంశాలను మాత్రమే హైలైట్ చేయాలికాని పనిగట్టుకొని తిట్టించినట్టు ప్రసారం చేస్తే మాత్రం తిప్పలు తప్పవు. రాజకీయ నేతలను, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ, అసభ్యకరమైన దృశ్యాలు ప్రసారం చేయడం మీడియా కట్టుబాట్లను తప్పినట్టే. ఉన్నదున్నట్టు చెప్పడం మీడియాకు శ్రీరామరక్ష.
తిమ్మిని బమ్మిని చేస్తూ సత్యాలను అసత్యాలుగా, అసత్యాలను సత్యాలుగా ప్రసారం చేయడం సోషల్‌మీడియా విలువలకు తిలోదకాలివ్వడమే. మీడియా, జర్నలిస్టులు స్వీయ నియంత్రణ పాటించకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. రాజకీయ పార్టీలు తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకేలా స్పందిస్తే ఇలాంటి ఘటనల సందర్భాల్లో జవాబుదారీతనం పెరగడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం కూడా కలుగుతుంది.
సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న పార్టీలు
స్వేచ్ఛ, హక్కులు, ప్రశ్నించడం, వాక్ స్వాతంత్రం పేరుతో ఏమి చేసినా చెల్లుతుందనే భావనతో మీడియా ఎదుటివారి మనోభావాలకు భంగం కలిగించడం వారి హక్కులను హరించడమే. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియాలో ఇలాంటి ధోరణి అధికంగా కనిపిస్తుంది. సంచలనాలు సృష్టించాలని, వేగవంతంగా వార్తలు ప్రసారం చేయాలనే ఆతృతతో స్వీయ నియంత్రణ పాటించకుండా సోషల్ మీడియా దారి తప్పుతోంది.
దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ప్రభావం అధికంగా కనబడుతోంది. ఆధునిక సాంకేతిక కాలంలో సోషల్ మీడియా ప్రస్తుతం ఏ రంగానికైనా ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రధానంగా రాజకీయ పార్టీలు తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చనే దృష్టితో సోషల్ మీడియాను పెద్ద ఎత్తున పెంచి ప్రోత్సహిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీల ఆధీనంలో లెక్కలేనన్ని సంఖ్యలో సోషల్ మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ మీడియా సంస్థలు అందులోని జర్నలిస్టులు సదరు పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే ఉత్సాహంలో దారి తప్పడం వివాదాస్పదం అవుతోంది.
సమాజానికి మీడియా దిక్సూచిలా ఉండాలి
సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయాలను, ఎన్నికలను, ప్రభుత్వాలను ప్రభావితం చేసే దశకు చేరుకోవడం ప్రమాదకరం. ఒక్కోసారి సోషల్ మీడియా ద్వారా అవాస్తవ సమాచారాన్ని వైరల్ చేస్తూ ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ సమాజానికి కీడు కూడా చేస్తున్నారు. మీడియా సంస్థలు, జర్నలిస్టులు స్వీయ నియంత్రణ పాటించకపోతే రాజకీయ పార్టీలకు, నేతలకు పావులుగా మారి తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు కానీ, దీర్ఘకాలికంగా అది వారికి చేటే చేస్తుంది.
ఏదేనీ ఒక ఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం, అనంతరం అందరూ మర్చిపోవడం పరిపాటిగా మారిన ప్రస్తుత దశలో సమాజానికి మీడియా ఒక దిక్సూచిలా ఉండేలా అందరూ కలిసికట్టుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మీడియా సంస్థలు, జర్నలిస్టులు విలువలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో లక్ష్మణ రేఖ గీసుకుంటే వారికదే శ్రీరామ రక్ష.
- డా. ఐ.వి మురళీకృష్ణ శర్మ